Begin typing your search above and press return to search.

బండ్ల గణేష్ సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   5 April 2019 11:38 AM IST
బండ్ల గణేష్ సంచలన నిర్ణయం
X
రాజకీయం.. సినిమా ఇజం రెండు వేరువేరు.. సినిమాల్లో అగ్రపథానికి వెళ్లిన వారు కూడా రాజకీయాల్లో ఫ్లాప్ అయిన వారు ఎందరో.. చిరంజీవి లాంటి మెగాస్టార్ రాజకీయాల్లో ఇమడలేక అస్త్రసన్యాసం చేసి రాజకీయాలను శాశ్వతంగా వదిలేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్లు అలా ప్రచారానికి వచ్చి భయపడి వెనక్కివెళ్లిపోయారు.

సినిమాల్లో వెలుగు వెలిగి.. రాజకీయాల్లోనూ వెలగిపోదామని వచ్చిన తారాజువ్వలు తుస్సుమనడం కొనసాగుతోంది.. తాజాగా మరో సినీ ప్రముఖుడు రాజకీయాలకు గుడ్ బై చెప్పేశాడు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ప్రముఖ తెలుగు నిర్మాత బండ్ల గణేష్.. సీటు దక్కకపోవడంతో అతాషుడయ్యాడు. తరువాత కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా తెలంగాణ రాష్ట్రసమితి -కేసీఆర్ పాలనపై సంచలన కామెంట్లతో వార్తల్లో నిలిచారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే గొంతు కోసుకుంటానన్న ఈయన డైలాగ్ వైరల్ గా మారింది.

అయితే ఎవ్వరూ ఊహించని విధంగా తత్త్వం బోధపడిన బండ్ల గణేష్ అందరికీ షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నాడు. రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ‘నా వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి నిష్ర్కమిస్తున్నాను. నాకు అవకాశం కల్పించిన రాహుల్ గాంధీకి, ఉత్తమ్ గారికి కృతజ్ఞతలు. ఇక నుంచి నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదు.. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నా విమర్శలు, వ్యాఖ్యల పట్ల బాధపడ్డ వారందరినీ పెద్ద మనసుతో క్షమించమని కోరుతున్నాను’ అని బండ్ల గణేష్ బాధతాప్త హృదయంతో ట్వీట్ చేయడం రాజకీయంగా, సినిమాలోకంలో సంచలనమైంది.

బండ్ల గణేష్ రాజకీయాల నుంచి వైదొలగడంపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. ఆయన ట్వీట్ కు కింద కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రాజకీయ బురద నుంచి బయటపడ్డావని కొందరంటే.. పచ్చబొట్టు లాంటిది రాజకీయం.. నిన్ను వదలదు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.