Begin typing your search above and press return to search.

జగన్‌ పాలనపై పవన్‌ భక్తుడి సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   20 March 2023 7:25 PM GMT
జగన్‌ పాలనపై పవన్‌ భక్తుడి సంచలన వ్యాఖ్యలు!
X
బండ్ల గణేష్‌.. పరిచయం అక్కర్లేని పేరు. సినీ నటుడు, నిర్మాతగా కంటే కూడా పవన్‌ కల్యాణ్‌ భక్తుడిగానే బండ్ల గణేష్‌ పాపులర్‌. తాజాగా ఒక యూట్యూబ్‌ చానల్‌ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన జగన్‌ పాలన, ఏపీ రాజకీయాలు, టీడీపీ–జనసేన పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో జగన్‌ పాలన బాగుందని బండ్ల గణేష్‌ ఆ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ ఓడిపోవాలని తాను కోరుకోవడం లేదన్నారు. అలాగే టీడీపీ – జనసేన కూటమి గెలవాలని కోరుకోవడం లేదని హాట్‌ కామెంట్స్‌ చేశారు. టీడీపీ–జనసేన పొత్తుపై యాంకర్‌ ప్రశ్నించగా వారు పొత్తు పెట్టుకున్నట్టు మీకు చెప్పారా అని బండ్ల గణేష్‌ నిలదీశారు. టీడీపీ–జనసేన కలిస్తే కడుపు వస్తుందా? కడుపు రాకుండానే డెలివరీ అవుతుందా అని బండ్ల హాట్‌ కామెంట్స్‌ చేశారు. అయినా ఆంధ్రా రాజకీయాల గురించి తనకేం తెలుసని.. తనను ఎందుకు అడుగుతున్నారని బండ్ల వ్యాఖ్యానించారు.

దేశంలో ఎక్కడా ఉచిత పథకాలు ఉండకూడదని బండ్ల గణేష్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే విద్య, వైద్యం అందరికీ ఉచితంగా అందించాలన్నారు. మిగతా పథకాలు ఎత్తేయొచ్చని చెప్పారు. తనకు కూడా తెలంగాణలో రైతు బంధు పథకాన్ని అందించారన్నారు. మరి రైతు బంధు పథకాన్ని ఎందుకు తీసుకున్నారని అడగ్గా ప్రభుత్వం తనకు ఉచితంగా ఇచ్చింది కాబట్టి తాను తీసుకున్నానని బండ్ల గణేష్‌ తెలిపారు. ఉచిత పథకాలు వద్దనేది తన అభిప్రాయమని.. ఇస్తే మాత్రం తాను కూడా తీసుకుంటానన్నారు. ఉచితంగా వచ్చేది ఏదీ పోగొట్టుకోకూడదనేదే తన అభిప్రాయమన్నారు. ఇక్కడ ఉచితంగా తీసుకుని మరొక చోట ఇంతకు నాలుగురెట్లు ఇస్తానన్నారు.

ఇక పవన్‌ కల్యాణ్‌ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని బండ్ల గణేష్‌ స్పష్టం చేశారు. అయితే ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారనేది తాను చెప్పలేనన్నారు.

ఉచిత పథకాలు తాను ఇవ్వద్దని చెప్పడం లేదని.. అయితే విద్య, వైద్యం మాత్రమే ఉచితంగా అందించాలని బండ్ల గణేష్‌ కోరారు. ఒక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనే కాకుండా దేశమంతా ఉచిత పథకాలు అందిస్తున్నారని బండ్ల గుర్తు చేశారు.

కాగా గతంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన బండ్ల గణేష్‌ కొన్నాళ్లకే ఆ పార్టీ నుంచి బయటకొచ్చేశారు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో లేరు. పవన్‌ కల్యాణ్‌ తో గబ్బర్‌ సింగ్, జూనియర్‌ ఎన్టీఆర్‌ తో బాద్‌ షా, రవితేజతో ఆంజనేయులు, రామ్‌ చరణ్‌ తో గోవిందుడు అందరి వాడేలే చిత్రాలను బండ్ల గణేష్‌ తెరకెక్కించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.