Begin typing your search above and press return to search.

బండ్ల గణేష్ అప్పుల కథ.. అప్పులిచ్చిన వారి వ్యథ

By:  Tupaki Desk   |   25 Oct 2019 2:30 PM GMT
బండ్ల గణేష్ అప్పుల కథ.. అప్పులిచ్చిన వారి వ్యథ
X
పేరుకు బడా నిర్మాత.. పవన్ కళ్యాన్ లాంటి స్టార్ హీరోతో కోట్లు పెట్టి సినిమా తీశాడు. అబ్బో ఈయనకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని అంతా ముక్కున వేలేసుకున్నారు? వ్యాపారం చేసా? లేక బినామీనా అన్న అనుమానపు చూపులు చూశారు. అయితే సినిమాల్లో హిట్స్ తప్ప ఫ్లాపులే ఎక్కువగా ఆయనకు వచ్చేశాయి.. అయినా ఆ నిర్మాత నిలబడ్డాడు.. రాజకీయాల్లోకి వెళ్లాడు.. మళ్లీ సినిమాల్లోకి వచ్చేశాడు. ఆయనే ‘బండ్ల గణేష్’. నిర్మాతగా, నటుడిగా సినిమాల్లో వెలుగు వెలిగిన బండ్ల తాజాగా చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ కావడంతో ఆయన తీరు ‘మేడిపండు’ చందమని ఇండస్ట్రీలో గుసగుసలాడుకుంటున్నారు. కోట్లు అప్పు తీసుకొని పెద్ద హీరోలతో సినిమాలు తీసి చివరకు అప్పులోల్లను నట్టేట ముంచినట్టు ప్రొద్దుటూరు ఫైనాన్షియర్లు లబోదిబోమంటున్నారు. ఇంతకీ బండ్లకు ప్రొద్దుటూరు ఫైనాన్సియర్లకు ఉన్న లింక్ కథ ఏంటో తెలుసుకుందాం..

*ప్రొద్దుటూరు... సినీ నిర్మాతల పెట్టుబడి అడ్డా

బండ్ల గణేష్.. సినీ నిర్మాతగా తెలుగు ఇండస్ట్రీకి చిరపరిచితమే..అయితే ఈయన సిరిపురిగా పేరుగాంచిన ప్రొద్దుటూరు సినీ ఫైనాన్షియర్ల నుంచి కోట్ల రూపాయలు అప్పు తీసుకొని సినిమాల్లో నిర్మాతగా పెట్టుబడి పెట్టిన వైనం తాజాగా వెలుగుచూస్తోంది. ఇక ప్రొద్దుటూరు ఫైనాన్సియర్లు కూడా మార్కెట్ లో కంటే ఎక్కువ వడ్డీ వస్తుండడంతో సినీ నిర్మాతలకు పెట్టుబడికి కోట్లలో అప్పు ఇచ్చినట్టు తేలింది. బండ్ల గణేష్ కే కాదు.. హైదరాబాద్ లోని పలువురు సినీ నిర్మాతలు ప్రొద్దుటూరు వచ్చి కోట్లలో అప్పు తీసుకొని సినిమాల్లో పెట్టుబడి పెట్టినట్టు ప్రొద్దుటూరు ఫైనాన్సియర్లు చెబుతున్నారు.

* కోట్లలో అప్పు తీసుకొని ఎగనామం

ప్రొద్దుటూరులోని ఒక బలమైన సామాజికవర్గం వారు 7 ఏళ్ల క్రితం హైదరాబాద్ కు చెందిన ఒక నిర్మాతకు కోట్లలో అప్పులు ఇచ్చాడు. అతడు తిరిగి ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో రుణదాతలు కోర్టులో కేసులు వేశారు. అయినా ఆ నిర్మాత ఇప్పటికీ అప్పు చెల్లించకపోవడంతో కోట్లలో మునిగిపోయి బావురుమంటున్నారు..

*బండ్ల గణేష్ కు లక్షల్లోనే అప్పు

ఇక హైదరాబాద్ కే చెందిన సినీ నిర్మాత బండ్ల గణేష్ కు కూడా ప్రొద్దుటూరుకు చెందిన అనేక మంది లక్షల్లో అప్పు ఇచ్చినట్టు తెలిసింది. అయితే ప్రతిగా బండ్ల గణేష్ ఇచ్చిన చెక్కులు బ్యాంకుల్లో చెల్లకపోవడంతో వారంతా కోర్టును ఆశ్రయించారు. చెక్ బౌన్స్ కేసుల్లో ప్రతీ నెల బండ్ల గణేష్ కోర్టుకు హాజరు అవుతున్నాడు. ఇప్పటికే బండ్ల గణేష్ పై ప్రొద్దుటూరులో ఏకంగా 66 చెక్ బౌన్స్ కేసులు నమోదైనట్టు తెలిసింది.

* బండ్లపై 66 కేసులు.. సుమారు 8 కోట్ల అప్పు

సినీ నిర్మాత బండ్ల గణేష్ ఒక్కొక్కరి వద్ద రూ.10 లక్షలు, రూ.20 లక్షలు, రూ.30 లక్షలు అప్పు తీసుకున్నట్టు తెలిసింది. 66 మందికి సంబంధించిన చెక్ బౌన్స్ కేసుల విలువ సుమారు రూ.8కోట్ల వరకు ఉంటుందని కోర్టు వర్గాలు తెలిపాయి. ఈ కేసుల్లోనే బండ్ల గణేష్ ను కోర్టు రిమాండ్ కు పంపడం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

*సినీ పరిచయం కోసం కోట్లలో మునిగారు..

ప్రొద్దుటూరు సహా చాలా ప్రాంతాల్లోని ఫైనాన్షియర్లు హీరోయిన్లు, సినీ లేడి ఆర్టిస్టులు, హీరోలతో పరిచయాల కోసం ఇలా కోట్లలో డబ్బును నిర్మాతలకు ఇస్తూ సినీ వేడుకల్లో వారితో కలిసి తెగ ఎంజాయ్ చేస్తారని సినీ వర్గాల టాక్.. సినీ పరిశ్రమపై పిచ్చి ప్రేమ - వ్యామోహంతో ఇలా నిర్మాతలను నమ్మి కోట్లలో అప్పులు ఇచ్చారు. అయితే నిర్మాత బండ్ల గణేష్ లాంటి వాళ్లు వారిని నిలువునా ముంచేశారని ఇప్పుడు లబోదిబోమంటున్నారు.. బండ్ల లాంటి వారు అప్పులు తీర్చక కోర్టుల వెంట తిరుగుతుండగా.. అప్పులిచ్చిన ప్రొద్దుటూరు ఫైనాన్సియర్లు మాత్రం లక్షల్లో మునిగి బావురుమంటున్నారు. సినీ వ్యామోహంతో ప్రొద్దుటూర్ ఫైనాన్సియర్లకు ఉన్నది పాయే.. ఉంచుకున్నది పాయే అన్న చందంగా మారిపోయిందన్న చర్చ టాలీవుడ్ లో సాగుతోంది.