Begin typing your search above and press return to search.

అక్బరుద్దీన్ మాటను.. అదిరే అవకాశంగా మార్చుకున్న బండి

By:  Tupaki Desk   |   26 Nov 2020 3:45 PM GMT
అక్బరుద్దీన్ మాటను.. అదిరే అవకాశంగా మార్చుకున్న బండి
X
రాజకీయం అంతే.. ఒక్క మాట చాలు సీన్ మొత్తం మారిపోవటానికి. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న వేళ.. ఎంఎస్ సత్యానారాయణ ఏదో అన్న దాన్ని సీరియస్ గా తీసుకున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. పక్కరోజు ప్రెస్ మీట్ పెట్టి తన ఎంపీ పదవికి రాజీనామా చేయటం.. దాన్ని స్పీకర్ ఓకే చేయటం.. ఆర్నెల్లు గడవకుండానే ఉప ఎన్నిక వచ్చిపడటమే కాదు.. తర్వాతి రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సాధనకు అదో కీలకాంశంగా మారింది. ఒక సీనియర్ నేత నోటి నుంచి వచ్చిన మాటతో తెలంగాణ మలిదశ ఉద్యమం షురూ కావటమే కాదు.. ఉప ఎన్నికలతో భావోద్వేగ రాజకీయాల్ని పండించటమే కాదు.. టీఆర్ఎస్ ను గెలిపిస్తేనే.. తెలంగాణ కల సజీవంగా ఉంటుందన్న భావన కలిగించేలా చేయగలిగారు.

భావోద్వేగ రాజకీయాలకు ఉండే బలం అలాంటిది. అందుకే.. రాజకీయాల్లో ఏదైనా మాటను రాంగ్ టైంలో మాట్లాడితే దాని వల్ల జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో తమకు వచ్చిన అవకాశాన్ని సొంతం చేసుకోవటానికి రాజకీయ పార్టీలు విపరీతమైన ప్రయత్నాలు చేస్తుంటాయి. గ్రేటర్ ఎన్నికల వేళ.. అనుకోని రీతిలో మజ్లిస్ అధినేత సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ నోటి నుంచి వచ్చిన పరుష వ్యాఖ్య.. బీజేపీకి ఒక కొత్త అవకాశాన్ని ఇచ్చిందని చెప్పాలి.
హుస్సేన్ సాగర్ విస్తీర్ణం బాగా తగ్గిపోయిందని.. ఆ నది పరిధిలోనే ఎన్టీఆర్ ఘాట్.. పీవీ ఘాట్ ఏర్పాటు చేశారని.. వాటిని కూడా కూల్చేయాలని ఫైర్ అయ్యారు అక్బరుద్దీన్. భావోద్వేగాల్ని రగిలించే మాటను పట్టుకొని బీజేపీ నేతలు వెనువెంటనే రియాక్ట్ అయ్యారు. మజ్లిస్ పార్టీ ఆఫీసు ఉండే దారుస్సలాంను నిమిషాల్లో కూల్చేస్తామన్న ఘాటు వ్యాఖ్యను చేశారు. అక్కడితో ఆగని బండి సంజయ్.. ఈ రోజు ఎన్టీఆర్ ఘాట్.. పీవీ ఘాట్లను సందర్శించటంతో పాటు పనిలో పనిగా అంబేడ్కర్ విగ్రహం వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. దీంతో.. ఎన్టీఆర్.. పీవీలను స్మరించుకోవటం ద్వారా వారి అభిమానుల మనసుల్ని దోచే ప్రయత్నం చేశారు.

వాస్తవానికి ఎన్టీఆర్.. పీవీలను మాట అన్నప్పుడు.. వారి ఘాట్లను కూల్చేస్తామంటూ దారుణ వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయా పార్టీలు స్పందించాల్సి ఉంది. కానీ.. అవేమీ చేయకపోవటం.. ఆ అవకాశాన్ని తాము సొంతం చేసుకోవటానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. మరణించిన మహానేతల్ని అవమాన పరిచేలా మాట్లాడతారా? అంటూ కస్సుమంటున్న కమలనాథులు ఎంత పొలిటికల్ మైలేజీ సంపాదించగలిగితే.. అంత సొంతం చేసుకోవాలన్న ప్లానింగ్ తో ఉన్నట్లుగా ఈ రోజు చోటు చేసుకున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పాలి. మరి.. కమలనాథుల లెక్కలకు తగ్గట్లు గ్రేటర్ ఓటర్ల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.