Begin typing your search above and press return to search.

తెలంగాణ డబ్బులు పంజాబ్ లో పంచుతారా? కేసీఆర్ కు బండి షాకింగ్ క్వశ్చన్

By:  Tupaki Desk   |   8 Aug 2022 4:18 AM GMT
తెలంగాణ డబ్బులు పంజాబ్ లో పంచుతారా? కేసీఆర్ కు బండి షాకింగ్ క్వశ్చన్
X
నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని ఊరికే అనలేదు. ప్రతి మాటకు తెలంగాణ ప్రస్తావన తేవటం.. తన రాజకీయ ప్రయోజనాలకు తెలంగాణ సెంటిమెంట్ ను భారీగా వాడేసే టీఆర్ఎస్ అధినేత.. తెలంగాణకు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేసీఆర్ వైఖరి పలుమార్లు ఆక్షేపించేలా ఉంటుంది. అయినప్పటికీ ఆయన నోటికి జడిసి.. ఏం అంటే.. మరేం అంటారో అన్న భయంతో నేతల నోట్లో నుంచి మాటలు వచ్చేవి కావు. అయితే.. ఇలాంటి వాటన్నింటికి ఏదో ఒక రోజు పుల్ స్టాప్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి పరిస్థితే ఉంది.

ఎవరికీ చెడు విద్యలు నేర్పించొద్దని.. అవతలోడు ఆ విద్యల్ని నీ మీదనే ప్రయోగించే వీలుందని హెచ్చరించే సామెతకు తగ్గట్లే.. ఏ తెలంగాణ సెంటిమెంట్ ను ప్రయోగించి.. తన రాజకీయ ప్రత్యర్థుల్ని కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి చేస్తారో.. ఇప్పుడు అలాంటి పాయింట్లనే ప్రస్తావిస్తూ ఆయన్ను ఆత్మరక్షణలో పడేలా చేస్తున్నారు తెలంగాణ బీజేపీరథసారధి బండి సంజయ్. గులాబీబాస్ కు ఉన్న మాదిరి వాక్ శుద్ధి లేనప్పటికీ.. మాటల్లో పదును మాత్రం ఎక్కువనే చెప్పాలి.

ప్రస్తుతం బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. తన పాదయాత్రలో భాగంగా పలువురిని పలుకరిస్తూ.. అభివాదం చేస్తూ.. ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకుంటూ యాత్రను నిర్వహిస్తున్నారు. ఇలా సాగుతున్న యాత్రలో భాగంగా పోచంపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ సెంటిమెంట్ బాణాన్ని సమయానికి కేసీఆర్ మీదకు సంధించారు బండి సంజయ్.

‘రాష్ట్రంలో 360 మంది చేనేత కార్మికులు చనిపోతే ఇప్పటివరకు ప్రభుత్వం ఆదుకోలేదు. పంజాబ్ లో రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ రాష్ట్రానికి చెందిన 700 మందికి నష్టపరిహారం పేరుతో తెలంగాణ నిధుల్ని అక్కడ పంచారు’ అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలకు సంబంధించి బాధితులకు పరిహారం విషయాన్ని ఆలోచించని కేసీఆర్.. అక్కడెక్కడో ఉన్న పంజాబ్ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని నష్టపరిహారం ఇవ్వటం ఏమిటి? అన్నది ప్రశ్న.

ఇదే ప్రశ్నను సరైన సమయంలో బండి సంజయ్ సంధించారన్న మాట వినిపిస్తోంది. తెలంగాణ పైసలు తెలంగాణ ప్రజలకు సంపూర్ణంగా ఖర్చు చేసి.. అప్పటికి నిధుల లభ్యత ఎక్కువగా ఉంటే వేరే రాష్ట్రాల్లోని వారికి పరిహారం ఇవ్వటం తప్పు కాదు.

అలా కాకుండా రాష్ట్ర ప్రజలకు అందని పరిహారం.. అందుకు భిన్నంగా వేరే రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా వెళ్లి పరిహారం ఇచ్చి రావటం ఏమిటంటూ బండి సంజయ్ ప్రశ్నిస్తున్నా రు. తెలంగాణ ఉద్యమం మొత్తం తన చేతుల మీదుగా.. తన కనుసన్నల్లో సాగినట్లు చెప్పే కేసీఆర్.. తెలంగాణ పైసలు వేరే రాష్ట్రానికి ఎలా ఇస్తారన్న సోయి ఏమైంది? అన్న ప్రశ్న పలువురి నోటి నుంచి వినిపిస్తోంది.