మాటలు మామూలుగా ఉంటే ఏ మీడియా మాత్రం పట్టించుకుంటుంది. కాస్త మసాలా.. అంతుకు మించిన ఉత్సకత రేగేలా.. విన్నంతనే.. చూసినంతనే.. రాసినంతనే.. ఇంకేం ఉంటుందన్న భావన కలిగేలా మాట్లాడటంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముందుంటారు. గడిచిన కొద్ది రోజులుగా ఆయన టార్గెట్ వరంగల్ అన్న ఆపరేషన్ లో ఉన్నారు. ఎక్కడైతే ఎన్నికలు జరుగుతాయో.. ఆ ప్రాంతం మీద పెద్ద ఎత్తున ఫోకస్ చేయటం.. పట్టు సాధించే అలవాటు ఆయనకు ఉంది.
దుబ్బాక ఉప
ఎన్నికకు ముందు నుంచి అక్కడే మకాం వేసి.. చివరకు అనూహ్య విజయాన్ని సొంతం
చేసుకొని బీజేపీకి కొత్త ఊపు.. ఉత్సాహాన్ని తెచ్చిన బండి.. తర్వాత గ్రేటర్
ను టార్గెట్ చేశారు. ఇప్పుడు ఆయన ఫోకస్ అంతా వరంగల్ మీద ఉంది. త్వరలో జరిగే
కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని భావిస్తున్నారు. అంతేకాదు..
టీఆర్ఎష్ బలంగా ఉన్న ప్రాంతంలో పాగా వేయటం ద్వారా.. వారి నైతిక
స్థైర్యాన్ని దెబ్బ తీయటం లక్ష్యమని చెప్పాలి.
ఇప్పుడు అలాంటి పనే
చేస్తున్న బండి.. గడిచిన కొద్ది రోజులుగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
తాజాగా జనగాంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఆయన..సీఎం కేసీఆర్
మీదా.. ఆయనకు అత్యంత ఇష్టమైన ఫాంహౌస్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ
కార్యకర్తలపై పోలీసులు దాడులు ఆపని పక్షంలో తాము సీఎం ఫాంహౌస్ మీద దాడి
చేస్తామన్నారు.
ఫామ్ హౌస్ కు పరిమితమైన ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని
పట్టించుకోవటం లేదన్న బండి సంజయ్.. స్వామి వివేకానంత జయంతి ఉత్సవాన్ని
తెలంగాణలో జరిగే పరిస్థితి లేదన్నారు. బీజేపీ కార్యకర్తలు వివేకానంద జయంతి
వేడుకులు జరుపుకుంటుంటే.. మున్సిపల్ కమిషనర్ కు వచ్చిన ఇబ్బందేమిటని
ప్రశ్నించారు.
బీజేపీ కార్యకర్తలపై పోలీసులు ఎలా లాఠీలతో దెబ్బలు
కొట్టారన్న విషయాన్ని సోషల్ మీడియాలో ఇప్పటికే వీడియోలు షేర్ అయినట్లు
వెల్లడించారు. బీజేపీ కార్యకర్తలపై దెబ్బలు కొట్టిన వారిపై 24 గంటల్లో
చర్యలు తీసుకోకుంటే.. తాము ఫాంహౌస్ పై దాడి చేస్తామన్నారు. ఇప్పటివరకు
నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న బండి.. ఇప్పుడు ఏకంగా దాడి చేస్తాం..
పాంహౌస్ లోకి దూసుకెళుతామన్న మాటలు సరైనవి కాదన్న మాట వినిపిస్తోంది. బండి
తాజా సంచలన వ్యాఖ్యలపై గులాబీ నేతలు ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.