Begin typing your search above and press return to search.
విజయశాంతిని నిర్లక్ష్యం చేశారు: బండి సంజయ్
By: Tupaki Desk | 3 Nov 2020 11:00 PM ISTలేడీ సూపర్‌స్టార్‌గా సినీ ఇండస్ట్రీలో తనకంటూ స్టార్‌డమ్ సంపాదించారు విజయశాంతి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. తల్లి తెలంగాణ పార్టీ సాధించి ఒంటరిగా పోరాడారు. తదుపరి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు.. అప్పటి నుంచి పార్టీలో స్టార్ క్యాంపెయినర్ గా కొనసాగుతున్నారు.
ఇటీవల రాములమ్మ కాంగ్రెస్‌ను వీడి బీజేపీ గూటికి చేరుతున్నారని జరుగుతున్న ప్రచారం జోరుగా సాగింది. జూబ్లీహిల్స్‌లోని విజయశాంతి నివాసానికి వెళ్లిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా ఆమె కలిశారు. సుమారు అరగంట పాటు ఈ భేటీ జరిగినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా ఈ సమావేశానికి కొద్ది రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా విజయశాంతితో భేటీ అయినట్లు సమాచారం.
అయితే తాజాగా దుబ్బాక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తరుఫున విజయశాంతి పాల్గొని ఈ ఊహాగానాలకు తెరదించారు. పీసీసీ ముఖ్యులు లాబీయింగ్ చేసి ఆమెను బుజ్జగించడంతో మెత్తబడ్డారని సమాచారం. ఈ క్రమంలోనే కేసీఆర్, హరీష్ పై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు.
విజయశాంతి ఇక కాంగ్రెస్ లోనే అనుకుంటున్న సమయంలో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనూహ్యంగా విజయశాంతి గురించి మీడియా ఎదుట ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది.. విజయశాంతి ఎంతో ప్రజాదరణ ఉన్న నాయకురాలు అని, తెలంగాణ ఉద్యమంలో ఆమె కీలకంగా వ్యవహరించారని బండి సంజయ్ పొగడడం ప్రాధాన్యత సంతరించుకుంది.. తెలంగాణ గ్రామాల్లో.. ప్రజల్లో విజయశాంతి చైతన్యం కలిగించారని కొనియాడారు.. కానీ తెలంగాణ వచ్చాక విజయశాంతిని పార్టీలు నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు.
విజయశాంతిపై బండి సంజయ్ సానుభూతి చూశాక ఆమె త్వరలోనే కాషాయదళంలో చేరుతుందన్న వాదనలకు బలం చేకూరుతోంది. మరి రాములమ్మ చేరుతుందా? కాంగ్రెస్ లోనే కొనసాగుతుందా అన్నది వేచిచూడాలి.
