Begin typing your search above and press return to search.

బండి సంజయ్ సంచలనం.. వీడియోలు ఉన్నాయి.. బయటపెడతాం

By:  Tupaki Desk   |   20 Nov 2020 11:45 AM IST
బండి సంజయ్ సంచలనం.. వీడియోలు ఉన్నాయి.. బయటపెడతాం
X
దుబ్బాక ఉప ఎన్నికతో మొదలైన టీఆర్ఎస్ - బీజేపీల మధ్య మొదలైన రాజకీయ శత్రుత్వం.. అంతకంతకూ పెరిగిపోతోంది. గ్రేటర్ ఎన్నికల వేళ.. రెండు పార్టీల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం మొదలైంది. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ బీజేపీ నేతలు బార్గెట్ చేస్తే.. కేంద్రంలోని మోడీ సర్కారుపై సీఎం కేసీఆర్ విమర్శనాస్త్రాల్ని సంధిస్తున్నారు. దీంతో.. రెండు పార్టీల మధ్య రాజకీయ వేడి అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

పార్టీనేతలతో మాట్లాడిన సందర్భంలో ప్రధాని మోడీపై చేసిన తీవ్రమైన వ్యాఖ్యలపై తాజాగా బండి సంజయ్ విరుచుకుపడ్డారు. ఛాయ్ అమ్మిన మోడీ.. తాను టీలు అమ్మిన రైల్వేల్ని అమ్మేస్తున్నారన్న ఘాటు విమర్శతో పాటు.. ఆరోపణలు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్.. ఊహించని రీతిలో రియాక్టు అయ్యారు.

చాయ్ పే చర్చ గాకుంటే మందుపై చర్చ పెట్టమంటారా? అని ప్రశ్నించారు. తమ పార్టీ ప్రతి బార్.. వైన్ షాపుల వద్ద ముఖ్యమంత్రి ఫోటో పెట్టి చర్చ పెడుతుందంటూ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఊహించని రీతిలో వ్యాఖ్యానించారు. గతంలో ఎప్పుడూ.. ఏ రాజకీయ పార్టీ నేత నోటి నుంచి రాని ఆరోపణల్ని కేసీఆర్ కుటుంబ సభ్యులపై చేశారు.

పబ్బులకు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు వెళుతుంటారని.. ఎవరెవరు వెళుతున్నారో తమ వద్ద వీడియోలు కూడా ఉన్నాయని.. వాటిని బయటపెడతామని ప్రకటించటం విశేషం. ఇప్పటివరకు రాజకీయ అంశాల మీదనే సాగిన విమర్శలు.. ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యక్తిగత అంశాల వరకు వెళ్లటం గమనార్హం. వీడియోలు అంటూ బండి సంజయ్ నోటి నుంచి వచ్చిన మాటలు గులాబీ నేతలకు షాకింగ్ గా మారాయి. ఈ అంశం మీద మరింత ముందుకు వెళితే మాత్రం.. తెలంగాణలో సరికొత్త రాజకీయం తెర మీదకు రావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.