Begin typing your search above and press return to search.

రేవంత్ దారిలో బండి సంజ‌య్‌..!

By:  Tupaki Desk   |   23 Feb 2022 3:30 PM GMT
రేవంత్ దారిలో బండి సంజ‌య్‌..!
X
తెలంగాణ బీజేపీ శాఖ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ దారిలో న‌డుస్తున్నారా..? పార్టీ సీనియ‌ర్ల విష‌యంలో రేవంత్ అనుస‌రించిన విధానాన్నే బండి కొన‌సాగిస్తున్నారా..? ఇదే పంథా అనుస‌రిస్తే క‌మ‌లంలో క‌ల్లోలం త‌ప్పదా..? అంటే ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌లు అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు. సంజ‌య్ అదృష్ట‌మో.. ఇత‌ర రాజ‌కీయ కార‌ణాలో ఏవైతేనేం.. బీజేపీ తెలంగాణ శాఖ అధ్య‌క్ష బాధ్య‌త‌లు తీసుకున్న‌ప్ప‌టి నుంచీ పార్టీ టాప్ గేరులో దూసుకుపోతోంది. దుబ్బాక ఉప ఎన్నిక‌లో గెలుపు, జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో మంచి ఫ‌లితాలు రాబ‌ట్ట‌డం.. ఇటీవ‌ల హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో విజ‌యం సాధించ‌డంలో బండి సంజ‌య్ కీల‌క పాత్ర పోషించారు. బీజేపీ పెద్ద‌ల అండ‌తో తెలంగాణ‌లో అధికార‌మే ల‌క్ష్యంగా దూసుకెళుతున్నారు.

అయితే.. ఇక్క‌డే అస‌లు చిక్కు వ‌చ్చింద‌ట‌. బండి సంజ‌య్ దూకుడుతో పార్టీ సీనియ‌ర్లు విల‌విల‌లాడుతున్నార‌ట‌. క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌, నిజామాబాద్‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్, న‌ల్ల‌గొండ‌ జిల్లాల్లో పార్టీ సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టి జూనియ‌ర్ల‌ను ప్రోత్స‌హిస్తున్నార‌ట‌. ఇతర పార్టీల నుంచి వ‌ల‌స వ‌చ్చిన వారిని అంద‌లం ఎక్కిస్తున్నార‌ట‌. దీంతో సీనియ‌ర్లు ఏమాత్రం జీర్ణించుకోలేక‌పోతున్నారు. బండి సంజ‌య్ ఒంటెత్తు పోక‌డ‌లు పోతున్నార‌ని ఆరోపిస్తున్నారు. ఆయ‌న వ్య‌వ‌హార శైలిని త‌ప్పు ప‌డుతున్నారు.

బండి సంజ‌య్ సొంత జిల్లా క‌రీంన‌గ‌ర్లో అస‌మ్మ‌తి ఎక్కువ‌గా ఉంది. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో.. గుజ్జుల రామ‌కృష్ణారెడ్డి, సుగుణాక‌ర్ రావు, అర్జున్ రావు,

సోమార‌పు స‌త్య‌నారాయ‌ణ‌, బోడ జ‌నార్ద‌న్‌, వ‌రంగ‌ల్ జిల్లాలో.. రాజేశ్వ‌ర రావు, ధ‌ర్మారావు, నిజామాబాద్ లో యెండ‌ల ల‌క్ష్మీనారాయ‌ణ‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్లో నాగురావు నామాజీ.., న‌ల్ల‌గొండలో కంక‌ణాల శ్రీ‌ధ‌ర్ రెడ్డి త‌దిత‌ర సీనియ‌ర్ నేత‌లు బండి సంజ‌య్‌ని వ్య‌తిరేకిస్తున్నారు. ఈ నేత‌లు ఈట‌ల రాజేంద‌ర్ రాక‌ను కూడా వ్య‌తిరేకించార‌ట‌.

గ‌తంలో క‌రీంన‌గ‌ర్ బీజేపీ అస‌మ్మ‌తి నేత‌లు ఆ జిల్లాలో స‌మావేశం పెట్టుకోగా.. తాజాగా అన్ని జిల్లాల వ్య‌తిరేక వ‌ర్గం హైద‌రాబాద్ లో భేటీ అయింది. అధిష్ఠానానికి డెడ్‌లైన్ విధించింది.

15 రోజుల్లోగా త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని.. బండి దూకుడును అడ్డుకోవాల‌ని.. పార్టీలో త‌మ‌కు ప్ర‌యారిటీ ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తోంది. త్వ‌ర‌లో ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్ద‌ల‌ను క‌లిసి బండిపై ఫిర్యాదు చేయాల‌ని డిసైడ్ అయింది. కాంగ్రెస్ లో కోమ‌టి రెడ్డి, జ‌గ్గా రెడ్డి, వీహెచ్ త‌దిత‌ర సీనియ‌ర్ నేత‌లు కూడా రేవంత్ ఒంటెత్తు పోక‌డ‌ల‌ను వ్య‌తిరేకిస్తున్న విష‌యం తెలిసిందే. ఇపుడు బండి కూడా రేవంత్ దారిలో ప‌య‌నిస్తూ సీనియ‌ర్ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శిస్తున్నారు. చూడాలి మ‌రి పార్టీ పెద్ద‌లు బండిని ఏదారిలో మ‌ళ్లిస్తారో..!