Begin typing your search above and press return to search.

బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ప్రజలు ఎందుకు హైదరాబాద్ వస్తున్నారు బండి సంజయ్?

By:  Tupaki Desk   |   9 Aug 2022 12:30 PM GMT
బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ప్రజలు ఎందుకు హైదరాబాద్ వస్తున్నారు బండి సంజయ్?
X
వలస.. ఇది చరిత్రలో ఒక సజీవ సాక్ష్యం. ఆదిమ మానవుడి నుంచి నేటి వరకూ ఎక్కడ ఆహారం, ఉద్యోగ, ఉపాధి ఉంటుందో అక్కడికి జనాలు వలస వెళుతుంటారు. కరువు పీడితాన్ని తరిమికొట్టేందుకు తమ బాగు కోసం ఇలా వసల బాట పడుతారు. ఇప్పటికీ ప్రపంచంలో ఇదే సాగుతోంది.

మనుషులు తమ మెరుగైన జీవితం కోసం వలస వెళ్లడాన్ని హక్కుగా భావిస్తారు. తమ నోట్లోకి నాలుగు ముద్దలు వెళ్లాలన్నా.. ఆస్తులు కూడగట్టుకోవాలన్నా మెరుగైన ఉపాధి ఉన్న ప్రాంతాలకు వెళ్లడం తప్పనిసరి.

ఇప్పుడు అమెరికాలోని అగ్ర కంపెనీలను మన భారతీయులు ఏలుతున్నారంటే.. ఇక్కడ అవకాశాలు లేక.. వారి స్థాయికి తగిన వేతనాలు లేక.. మంచి జీవితం, జీతం కోసం వలసవెళ్లడం వల్లే. ఇప్పుడు దేశంలోనూ తెలంగాణకు చాలా మంది వలస వస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి కోసం తరలివస్తున్నారు. తెలంగాణలోని హైదరాబాద్ సహా ప్రతి నగరానికి బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్ తదితర బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి పని కోసం తరలివస్తున్నారు.

తెలంగాణలోని ముఖ్యంగా హైదరాబాద్ ఫ్యాక్టరీల్లో మెజార్టీ ఈ బీజేపీ పాలిత హిందీ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులే పనిచేస్తున్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా లేబర్ పనుల్లో వారే ఉంటున్నారు. భవన నిర్మాణ పనుల్లో మెజార్టీ వారే. ఇక బార్లు, హోటల్స్, రెస్టారెంట్స్, ఇంటీరియర్ లేబర్, రోడ్స్ పని ఇలా ప్రతి పనికి బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ప్రజలు హైదరాబాద్ వస్తున్నారు.

దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంతటి అభివృద్ధి లేదన్నది వాస్తవం. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవు. అందుకే హిందీ వాసులు తెలంగాణకు వస్తున్నారు. ఇక్కడే రూం తీసుకొని పిల్లాపాపాలతో ఉంటూ రెండు మూడు నెలలు పనిచేసి డబ్బులు సంపాదించుకొని తిరిగి తమ రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. ఎక్కడ చూసినా హిందీ మాట్లాడే ఈ వాసులే ప్రతి పనిలోనూ కనిపిస్తున్న పరిస్థితి.

ఇలా ప్రతి పనిలోనూ బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రజలే హైదరాబాద్ లో కనిపిస్తున్నారు. మరి ఇది చూసినా బండి సంజయ్ లాంటి బీజేపీ వాదులు హైదరాబాద్ లో, తెలంగాణలో అభివృద్ధి లేదు అని అనడంతో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అభివృద్ధి లేనిది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అని.. తెలంగాణలో కాదంటూ ఈ వలసలను చూపిస్తూ ‘బండి’ని కడిగిపారేస్తున్నారు.