Begin typing your search above and press return to search.

కేసీయార్ ప్రభుత్వం కూలిపోతుందా?

By:  Tupaki Desk   |   23 Sept 2022 10:20 AM IST
కేసీయార్ ప్రభుత్వం కూలిపోతుందా?
X
తెలంగాణలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యలు చాలా విచిత్రంగా ఉంది. మునుగోడు ఉపఎన్నిక తర్వాత కేసీయార్ ప్రభుత్వం కూలిపోతుందట. ఎలా కూలిపోతుందంటే మళ్ళీ దానికి సమాధానం ఉండదు. ఏవేవో పిచ్చిలెక్కలన్నీ వేసి జనాలను నమ్మించాలని బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

లాజికల్ గా అయితే కేసీయార్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం లేదు. ఎందుకంటే ప్రభుత్వంలో అవసరానికి మించిన బలమే ఉంది కేసీయార్ కు. అలాంటపుడు ప్రభుత్వం ఎలా కూలిపోతుంది ?

అయితే ఒక అవకాశం అయితే ఉంది. అదేమిటంటే టీఆర్ఎస్ ఎంఎల్ఏలను టోకున కొనేసుకోవటం. తెలంగాణాలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కనీసం 60 సీట్ల మ్యాజిక్ ఫిగర్ ను దాటాలి. టీఆర్ఎస్ కు ప్రస్తుతం 90 మంది ఎంఎల్ఏల దాకా ఉన్నారు. బీజేపీకి ఉన్నది కేవలం ముగ్గురంటే ముగ్గురు మాత్రమే. అంటే ముగ్గురు ఎంఎల్ఏలున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే అదనంగా 57 మంది ఎంఎల్ఏలను లాక్కోవాలి.

ఇంతమంది ఎంఎల్ఏలను లాక్కుని ప్రభుత్వం ఏర్పాటుచేయటం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేసే ఉద్దేశం లేదు కేవలం కేసీయార్ ప్రభుత్వాన్ని కూల్చటమే ఉద్దేశ్యమైతే దాన్ని జనాలు స్వాగతించరు. కేసీయార్ ప్రభుత్వాన్ని కూల్చేసిన తర్వాత బీజేపీ ఏమిచేస్తుంది ? తాను ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం లేకపోతే రాష్ట్రపతి పాలన పెట్టాలి. రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెడతారు ?

శాంతి భద్రతల సమస్య పెరిగిపోయినపుడు, నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిలైందని అనుకున్నపుడు మాత్రమే రాష్ట్రపతి పాలన పెడతారు. కానీ తెలంగాణాలో అలాంటి పరిస్ధితే లేదు. ఒకవేళ కేసీయార్ పై అవినీతి ఆరోపణలుంటే అదివేరే సంగతి.

ఆరోపణలు అందరిమీదా ఉంటాయి. ఆరోపణలు ఆధారాలతో సహా కోర్టులో నిరూపణ అయినప్పుడు మాత్రమే రాజీనామా ప్రస్తావన వస్తుంది. అప్పుడు కూడా కేసీయార్ కాకపోతే సీఎం కుర్చీలో కేటీయార్ కూర్చుంటారు కానీ ప్రభుత్వమైతే కూలిపోదు. అసలింత సీన్ ఎప్పుడు ఉత్పన్నమవుతుందంటే మునుగోడులో బీజేపీ గెలిచినపుడు కదా. బీజేపీ గెలిస్తే అప్పుడు చూద్దాం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.