Begin typing your search above and press return to search.

కేసీఆర్ ముఖంలో భ‌యం క‌నిపిస్తోంది!

By:  Tupaki Desk   |   1 March 2022 2:30 AM GMT
కేసీఆర్ ముఖంలో భ‌యం క‌నిపిస్తోంది!
X
అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్‌ 14 నుంచి రెండో దశ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభించనున్నట్లు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సంస్థాగతంగా బీజేపీని బలోపేతం చేయడం, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల జోనల్ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీకి ఉనికే లేదని సీఎం కేసీఆర్ జనగామ సభలో అన్నారని.. అందుకే మార్చి నెలాఖరులో జనగామలోనే భారీ బహిరంగ సభను నిర్వహించి సత్తా చూపిస్తామని చెప్పారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాలను సమర్థిస్తూ బీజేపీ నాయకులు దాదాపు 2 నిమిషాలపాటు చప్పట్లతో స్వాగతించారు. రాబోయే రోజుల్లో మంత్రులతోపాటు టీఆర్ ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలపై జిల్లాలు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉద్యమిస్తామన్నారు. అందరం కలిసి ప్రజాస్వామిక తెలంగాణను ఏర్పాటు దిశగా కృషి చేద్దామని ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, జాతీయ సహాయ కార్యదర్శి శివ ప్రకాశ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, సీనియర్ నేత ఎన్.ఇంద్రసేనారెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి, గరికపాటి రామ్మోహన్ రావు, ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి, మంత్రి శ్రీనివాస్ పాల్గొన్నారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ ఎన్నికల సంఘానికి సమర్పించిన తప్పుడు ఆఫిడవిట్‌పై ఫిర్యాదు చేసిన వారిని పోలీసులే కిడ్నాప్‌ చేయడం అత్యంత దారుణమ‌ని బండి వ్యాఖ్యానించారు.

తప్పుడు అఫిడవిట్‌పై ఎన్నికల కమిషన్ విచారణ ముగిసే వరకు ఆరుగురు ఫిర్యాదుదారులను జైల్లో పెట్టడమే లక్ష్యంగా కేసులు పెట్టారన్నారు. బీజేపీ.. ఇలాంటి దారుణాలను అడ్డుకుని తీరుతుంద‌ని, మంత్రి రాజీనామా చేసేంత వరకు పార్టీ పరంగా ఆందోళనలను కొనసాగిస్తామ‌ని చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర మంత్రులతో పాటు టీఆర్ ఎస్‌ సిట్టింగ్ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలపై అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉద్యమిస్తామ‌ని తెలిపారు. అందరం కలిసి ప్రజాస్వామిక తెలంగాణను ఏర్పాటు చేసే దిశగా కృషి చేద్దామ‌ని పిలుపునిచ్చారు.

పీకేలు మాకు అవ‌స‌రం లేదు..

ప్రశాంత్ కిషోర్‌లు బీజేపీకి అవసరం లేదని ఆ పార్టీ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ పేర్కొన్నారు. బీజేపీ బూత్ స్థాయి కార్యకర్త ఒక పీకేతో సమానమన్నారు. భారతదేశానికే కాదు.. ఉక్రెయిన్‌కి కూడా కేసీఆర్ ప్రధాని అవుతారని సెటైర్లు వేశారు. తెలంగాణను వదిలేసి.. కేసీఆర్ పొలిటికల్ టూరిస్ట్‌లా తిరుగుతున్నాడని తరుణ్ చుగ్ పేర్కొన్నారు. ఢిల్లీ సీఎంతో సమావేశం అయినంత మాత్రాన.. కేసీఆర్ బీజేపీని ఏమీ చేయలేరన్నారు. తమ అవినీతిని దాచిపెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. కేసీఆర్ ముఖంలో భయం కనిపిస్తోందని.. ప్రశాంత్ కిషోర్ ఏమీ చేయలేరన్నారు.