Begin typing your search above and press return to search.

బండి సంజయ్ చెప్పినట్లు చేసే దమ్ము అసద్ కు ఉందా?

By:  Tupaki Desk   |   3 April 2020 10:17 AM IST
బండి సంజయ్ చెప్పినట్లు చేసే దమ్ము అసద్ కు ఉందా?
X
ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించటం ద్వారా కొత్త చర్చకు తెర తీశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కమ్ ఎంపీ బండి సంజయ్. హైదరాబాద్ లోని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీలకు చెందిన ఓవైసీ ఆసుపత్రిని కరోనా ఐసోలేషన్ వార్డుగా ఎందుకు మార్చకూడదన్న ప్రశ్నలో అంతో ఇంతో న్యాయముందన్న మాట వినిపిస్తోంది. ముస్లిం ప్రజల కోసం.. వారి ఉన్నతి కోసం తన ప్రాణాల్ని సైతం పణంగా పెట్టేస్తానంటూ ఊగిపోతూ ప్రసంగించే అసద్ లాంటి వారు.. కరోనా వ్యాప్తి విషయంలో ప్రజలెంత అప్రమత్తంగా ఉండాలన్న విషయంపై ఇప్పటివరకూ ఎందుకు మాట్లాడలేదు? అన్నది క్వశ్చన్.

తబ్లిగీ జమాత్ సదస్సులో పాల్గొని.. కరోనా పాజిటివ్ కేసులు పెద్ద ఎత్తున వెల్లడవుతున్న వేళ.. దీనికి హాజరై వచ్చిన వారు స్వచ్చందంగా బయటకు రావాలని.. పరీక్షలు చేయించుకోవాలన్న విషయాన్ని అసద్ ఇప్పటి వరకూ ఎందుకు ప్రకటించలేదు? అన్నది మరో ప్రశ్న. ముస్లిం ఉన్నతి కోసమే తాను ఉన్నట్లు చెప్పే ఆయన.. అందుకు తగ్గట్లే.. వారి క్షేమం కోసం.. పాజిటివ్ గా తేలిన కరోనా బాధితులకు వైద్యం చేయించేందుకు వీలుగా తమ ఆసుపత్రిని కరోనా ఐసోలేషన్ వార్డుగా ఎందుకు మార్చకూడదని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటివరకూ గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై కరోనా రోగుల కుటుంబ సభ్యులు దాడి ఘటనను ఇంతవరకు ఖండించని అసద్ తీరును బండి ప్రశ్నించారు. ప్రస్తుతం ఆసుపత్రులు.. ఐసోలేషన్ వార్డుల కొరత ఎదుర్కొంటున్న వేళ.. అన్ని సదుపాయాలు ఉన్న ఓవైసీ ఆసుపత్రిని ఐసోలేషన్ వార్డుగా ఎందుకు మార్చకూడదు? అని బండి ప్రశ్నిస్తున్నారు.

తాను చేసిన సూచనను అమలు చేస్తారా? అని కేసీఆర్ సర్కారు ను ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం తర్వాత.. తనకు తానుగా ఓవైసీ మాష్టారు ముందుకు వచ్చి.. తమ ఆసుపత్రిని ఐసోలేషన్ వార్డుగా మార్చేందుకు వీలుగా తమ సంసిద్ధతను ప్రకటించే దమ్ము ఉందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిత్యం.. మైనార్టీల సంక్షేమం గురించి మాట్లాడే పెద్ద మనిషి.. ఇప్పుడు తన సొంత ఆసుపత్రిని కరోనా రోగుల కోసం కేటాయిస్తే మంచిదన్న మాటపై సానుకూలంగా స్పందిస్తారా? అన్నది ప్రశ్నగా మారింది.