Begin typing your search above and press return to search.

బండి సంజ‌య్ సైలెంట్ అయ్యాడా?

By:  Tupaki Desk   |   14 May 2021 9:30 AM GMT
బండి సంజ‌య్ సైలెంట్ అయ్యాడా?
X
బండి సంజ‌య్‌. తెలంగాణ బీజేపీ సార‌థిగా ఆయ‌న అతి త‌క్కువ స‌మ‌యంలో గుర్తింపు తెచ్చుకున్నారు. 2019 ఎన్నిక‌ల్లో క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంటు స్థానం నుంచి విజ‌యం సాధించిన ఆయ‌న త‌ర్వాత కాలంలో బీజేపీ అధ్య‌క్ష‌ప‌దవిని ద‌క్కించుకున్నారు. అయితే.. అప్ప‌టి వ‌ర‌కు ఎంతో మంది సీనియ‌ర్ల‌కు రాని గుర్తింపు, `ఫైర్ బ్రాండ్‌` అనే ముద్ర బండి సంజ‌య్‌కు అత్యంత త‌క్కువ స‌మ‌యంలోనే రావ‌డం గ‌మ‌నార్హం. బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన సంజ‌య్‌.. తెలంగాణ అధికార పార్టీ ముఖ్యంగా సీఎం కేసీఆర్‌, ఆయ‌న కుమారుడు, మంత్రి.. కేటీఆర్‌ను టార్గెట్ చేయ‌డంలోను. నిప్పులు చెరిగే మాట‌లు రువ్వ‌డంలోనూ త‌న‌ను తానే సాటి అనిపించుకున్నారు.

బీజేపీకి అప్ప‌టి వ‌ర‌కు లేని ఊపును.. తీసుకువ‌చ్చిన బండి సంజ‌య్‌.. ఇటీవ‌ల కాలంలో ఒక్క‌సారిగా సైలెంట్ అయ్యారు. ఆయ‌న ఎవ‌రితోనూ ఉల‌కడం లేదు.. ప‌ల‌క‌డం లేదు.పైగా ఫైర్ బ్రాండ్ అనే ముద్ర ఉన్న‌ప్ప‌టికీ.. ఇటీవల కాలంలో ఆయ‌న ఎలాంటి వ్యాఖ్యలు చేయ‌డం లేదు. మ‌రి దీనికి రీజ‌నేంటి? అనేది ఆస‌క్తిగా మారింది. బండి సంజ‌య్ బీజేపీ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. దుబ్బాక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక వ‌చ్చింది. వాస్త‌వానికి టీఆర్ ఎస్‌కు సిట్టింగ్ సీటు. దీంతో ఇక్క‌డ త‌మ గెలుపు న‌ల్లేరుపై న‌డకే అనుకున్నారు సీఎం కేసీఆర్‌. కానీ, బండి ఎంట్రీతో ఈక్వేష‌న్లు మారిపోయాయి.

ఒక‌ప్ప‌టి టీఆర్ ఎస్ నేత‌, ప్ర‌స్తుతం బీజేపీ నేత ర‌ఘునంద‌న‌రావుకు దుబ్బాక టికెట్ ఇవ్వ‌డం నుంచి ఆయ‌న‌ను గెలిపించే వ‌ర‌కు కూడా బండి సంజయ్ ప్ర‌తి విష‌యాన్ని స‌వాలు గా తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకుని టీఆర్ ఎస్ కుచుక్క‌లు చూపించారు. ఇక‌, త‌ర్వాత వ‌చ్చిన హైద‌రాబాద్ గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌ను కూడా అంతే సీరియ‌స్‌ గా తీసుకున్నారు. ఇక్క‌డ కూడా త‌మ‌కు భారీ ఎత్తున సీట్లు వ‌స్తాయ‌ని క‌ల‌లు గ‌న్న టీఆర్ ఎస్ ఆశ‌ల‌కు బండి గండికొట్టారు. ఇలా త‌న‌దైన మార్కుతోను, మార్పుల‌తోనూ ముందుకు సాగుతున్న బండి సంజ‌య్‌కి సీనియ‌ర్ల నుంచి స‌హ‌కారం లేక‌పోగా.. ఆయ‌న‌కు పొగ‌బెట్టేలా కొంద‌రు బీజేపీ నేత‌లు అధికార పార్టీతో అంత‌ర్గ‌త ఒప్పందాలు చేసుకున్నారు.

ఈ క్ర‌మంలో కొన్నిరోజుల కింద‌ట జ‌రిగిన నాగార్జున సాగ‌ర్అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌లో సంబంధం లేని ఎస్టీ నేత‌కు టికెట్ ఇచ్చేలా చ‌క్రం తిప్పి విజ‌యం సాధించారు. దీంతో బండి సంజ‌య్ ప్ర‌ణాళిక‌లు పూర్తిగా దారిత‌ప్పాయి. ప‌లితంగా ఇక్క‌డ టీఆర్ ఎస్ విజ‌యం సాధించింది. ఇక‌, దీనికి ముందు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ.. బండి వ్యూహం పార‌కుండా కొంద‌రు.. సీనియ‌ర్లే.. తెర‌చాటు మంత్రాంగా లు న‌డిపార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో అస‌లు పార్టీని ముందుకు న‌డిపించాలంటే ఇలాంటి వారిని క‌ట్ట‌డి చేయాల‌ని ఆయ‌న కోరుతున్నారు.

నిజానికి బండి సంజ‌య్ ఎంట్రీ త‌ర్వాత‌.. పుంజుకున్న బీజేపీ గ్రాఫ్‌.. ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీఆ విజ‌యం సాధించి.. అధికారంలోకి వ‌చ్చేస్తుంద‌న్న అంచ‌నాల‌ను కొంద‌రు సీనియ‌ర్లు ప‌నిగట్టుకుని పాడుచేస్తున్నారని సంజ‌య్ వ‌ర్గం ఆరోపిస్తోంది. ఈ క్ర‌మంలో వివాదం పార్టీ హైక‌మాండ్‌ కు చేరింద‌ని.. అక్క‌డ ఏదో ఒక‌టి తేల్చుకున్నాకే.. తిరిగి పుంజుకోవాల‌ని సంజ‌య్‌భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అయితే.. ప్ర‌స్తుతం బీజేపీ మాత్రం క‌రోనా విల‌యంలో దేశ‌ వ్యాప్తంగా విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న నేప‌థ్యంలో ఈ విప‌త్తు నుంచి విజ‌య‌వంతంగా బ‌య‌ట‌ప‌డిన త‌ర్వాతే.. రాష్ట్రాల‌పై దృష్టి పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. ఫ‌లితంగా .. క‌రోనా విల‌యం త‌ర్వాత‌.. తెలంగాణ‌లో సీనియ‌ర్ల‌కు క్లాస్ ఇవ్వ‌డ‌మో.. లేక పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంప‌డ‌మో.. చేస్తుంద‌ని భావిస్తున్నారు. అప్ప‌టి వ‌ర‌కు బండి సంజ‌య్ మౌనంగానే ఉంటార‌నిఅంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.