Begin typing your search above and press return to search.

బండి సంజ‌య్.. ఈ మాట‌లు పాత‌బ‌స్తీకి సరిపోతాయేమో!

By:  Tupaki Desk   |   16 March 2020 3:30 PM GMT
బండి సంజ‌య్.. ఈ మాట‌లు పాత‌బ‌స్తీకి సరిపోతాయేమో!
X
'మీరు ఔరంగ‌జేబు వార‌సులు.. మేం శివాజీ వార‌సులం..విజ‌య‌మో వీర స్వర్గ‌మో తేల్చుకుంటాం. గోల్కొండ‌పై కాషాయ జెండా ఎగ‌రేయ‌డ‌మే ల‌క్ష్యం..' అని అంటున్నారు తెలంగాణ బీజేపీ కొత్త అధ్య‌క్షుడు బండి సంజ‌య్. ముహూర్తం చూసుకుని టీబీజేపీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు తీసుకోనున్నార‌ట ఈయ‌న‌. అయితే అంత‌కన్నా మునుపే వాడీవేడీగా ప్ర‌సంగించారు. అయితే బీజేపీ వాళ్ల‌కు ఇలాంటి ప్ర‌సంగాలు కొత్త కాదు! అని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు.

ప్ర‌తి రాష్ట్రంలోనూ బీజేపీ లో కొంత‌మంది అయినా ఇలా మాట్లాడుతూ ఉంటారు. బండి సంజ‌య్ చేసిన ఈ హాట్ కామెంట్స్ ఇటీవ‌ల‌.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం లో అనేక మంది బీజేపీ నేత‌లు మాట్లాడిన‌వి లాగానే ఉన్నాయి. ఆ మాట‌లే త‌గ్గించుకోవాల‌ని కూడా బీజేపీ అధిష్టానం సూచించిన‌ట్టుగా కూడా వార్త‌లు వ‌చ్చాయి.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా బీజేపీ వాళ్లు తీవ్రంగా స్పందించారు. హాట్ కామెంట్స్ చేశారు. మొగ‌లుల‌ తో మొద‌లు పెట్టి పాకిస్తాన్ వ‌ర‌కూ వారు ప్ర‌స్తావించారు. త‌మ‌ను తాము హిందూ వీర పుత్ర రాజులుగా, త‌మ ప్ర‌త్య‌ర్థుల‌ను మొగ‌లులు, పాకిస్తాన్ వాళ్లు అన్న‌ట్టుగా మాట్లాడారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆప్ ను కానీ, కాంగ్రెస్ ను కానీ గెలిపిస్తే.. మ‌ధ్య‌యుగం అయిపోతుంద‌ని ముస్లింలు హిందువుల అమ్మాయిల‌ను రేప్ లు చేస్తారంటూ కూడా బీజేపీ నేత‌లు మాట్లాడారు! స్థూలంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌లు ఇండియా, పాకిస్తాన్ వార్ అని.. ఇండియా గెల‌వాలంటే బీజేపీని గెలిపించాల‌ని కూడా బీజేపీ వాళ్లు పిలుపునిచ్చారు. కేజ్రీవాల్ ను ఉగ్ర‌వాది అన్నారు!

క‌ట్ చేస్తే.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ మ‌రో సారి చిత్తు అయ్యింది. పాకిస్తాన్ గా బీజేపీ అభివ‌ర్ణించిన ఆప్ ఘ‌న విజ‌యం సాధించింది. ఎన్నిక‌లు అయ్యాకా బీజేపీ అధిష్టాన నేత‌లు మాట్లాడుతూ.. ఆ త‌ర‌హా మాట‌లు మాట్లాడాల్సింది కాద‌ని తేల్చారు. అయితే తెలంగాణ బీజేపీ కొత్త అధ్య‌క్షుడు మాత్రం.. ఔరంగ‌జేబు అంటూ పాత క్యాసెట్ వేశారు. ప్ర‌జ‌ల నాడిని బీజేపీ అర్థం చేసుకోలేక‌పోతోందా?

పాత‌బ‌స్తీ వ‌ర‌కూ ఈ మాట‌లు ఓకే కానీ, ప్ర‌జ‌లు ఇప్పుడు అద్వాన్నం అవుతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌, బ్యాంకుల అభ‌ద్రతాభావం, యువ‌త‌కు అవ‌కాశాలు, క‌రోనా వైర‌స్.. ఈ అంశాల గురించి ఆలోచిస్తున్నారేమో, బీజేపీ నేత‌లు గ్ర‌హిస్తే మంచిదేమో!