Begin typing your search above and press return to search.

‘బండి’ హిట్: తిరుపతిలో ‘సోము’ ఫట్ యేనా?

By:  Tupaki Desk   |   20 April 2021 7:39 AM GMT
‘బండి’ హిట్: తిరుపతిలో ‘సోము’ ఫట్ యేనా?
X
తెలంగాణలో బీజేపీని గెలుపుబాట పట్టించి దుబ్బాక, జీహెచ్ఎంసీలో సత్తా చాటించి.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ను తోసిరాజని రాష్ట్రంలో రెండోస్థానంలోకి కమలం పార్టీని తీసుకొచ్చారు బండి సంజయ్. అంటే తెలంగాణలో బండి సంజయ్ హిట్ అయినట్టే లెక్క. ఇప్పుడు ఒత్తిడి అంతా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపైనే. ఔను తిరుపతి ఉప ఎన్నిక ఆయన అధ్యక్ష పీఠానికి ఒక లిట్మస్ పరీక్షలాంటిది అంటున్నారు. అందులో నెగ్గితే కొనసాగుతాడు.. లేదంటే 2024 వరకు ఉంటాడో లేదో చెప్పలేమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఏపీలో జరుగుతున్న తిరుపతి ఉప ఎన్నికను సోమువీర్రాజు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏపీ సహ ఇన్ చార్జి సునీల్ ధియేధర్ సహా ఏపీ బీజేపీ పెద్దలను ఆరు నెలలు ముందుగానే తిరుపతిలో తిష్టవేయించి పార్టీ బలోపేతం చేయించారు. బూత్ స్థాయి నుంచి బీజేపీకి బలం చేకూరేలా శక్తివంచన లేకుండా కృషి చేశారు.

అయితే తానొకటి తలిస్తే తిరుపతి ప్రజలు మరొకటి తలిచారంటారు. తాజాగా వెలువడుతున్న తిరుపతి ఉప ఎన్నిక ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీకి దారుణ పరాభవం తప్పదని.. ఆ పార్టీకి 50వేల ఓట్లు రావడం గగనం అంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీని వెనక్కినెట్టి రెండో స్థానంలో రావడం కష్టమంటున్నారు. అసలు పరువు కాపాడుకోవడమే బీజేపీకి తిరుపతిలో పెద్ద టాస్క్ అంటున్నారు.

దీన్ని బట్టి ఏపీ బీజేపీకి తిరుపతిలో ఓటమి తప్పదని ఖాయమైంది. అందుకే ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలని ఆ పార్టీ కొత్త పల్లవి అందుకుంది. అంటే ఎన్నిక రద్దు చేయాలంటే దానర్థం బీజేపీకి ఇక్కడ గెలుపు అవకాశాలు లేవని వారంతటా వారే ఒప్పుకోవడం అని విశ్లేషకులు సెటైర్లు వేస్తున్నారు.

ఇక సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి ఈ తిరుపతి ఉప ఎన్నిక రెఫరెండంగా మారింది. ఆయన హిట్ నా? ఫ్లాపా అన్నది ఈ ఎన్నికతో తెలుస్తుంది. అయితే కేంద్రంలోని బీజేపీ ఏపీకి చేసిన అన్యాయాలే ఆ పార్టీని దెబ్బతీశాయని.. ప్రత్యేక హోదా, నిధులు, పోలవరం, ఇప్పుడు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంటూ ఏపీ విషయంలో సీతకన్ను వేసిన బీజేపీపై ప్రజలు కోపంగా ఉన్నారని.. అదే తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీకి దెబ్బ పడిందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందని మే తొలి వారం వెలువడే ఫలితాలను బట్టి తెలుస్తుంది.