Begin typing your search above and press return to search.

అదానీ ఖాతాలోకే బందర్ పోర్టు

By:  Tupaki Desk   |   5 Sep 2022 5:13 AM GMT
అదానీ ఖాతాలోకే బందర్ పోర్టు
X
తన కన్ను పడిన పోర్టులు.. ఎయిర్ పోర్టుల్నిఒక పట్టాన వదిలి పెట్టని అదానీ గ్రూపు.. తాజాగా ఏపీలోని బందరు పోర్టును టార్గెట్ చేసిందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని గంగవరం.. కృష్ణపట్నం రేవును తమ అధీనంలోకి తెచ్చుకున్న అదానీ సంస్థ బందరు పోర్టును కూడా తమ పోర్టుఫోలియోలోకి తెచ్చుకునే దిశగా పావులు కదుపుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి.

ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో వచ్చిన అదానీ సంస్థ అధినేత గౌతమ్ అదానీతో పాటు గ్రూపు డైరెక్టర్ (పోర్ట్స్) కోమల్ ను వెంట పెట్టుకువచ్చినట్లుగా చెబుతున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి నేరుగా తాడేపల్లి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రహస్య సమావేశాన్ని నిర్వహించినట్లుగా చెబుతున్నారు.

మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో తిరిగి అదే విమానంలో వెనక్కి వెళ్లినట్లుగా సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఏదైనా సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి ఎదైనా టీం వస్తే.. దానికి సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడిస్తుంది. గుట్టుగా ఉంచటానికి ఇష్టపడరు.

అందుకు భిన్నంగా గౌతమ్ అదానీ.. ఆయనం టీంతో భేటికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అంతేకాదు.. ఈ భేటీ మీద మాట్లాడటానికి ఎవరూ ఇష్టపడకపోవటం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే ఇటీవల నేతన్న నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. బందరు పోర్టుపై పెండింగ్ లో ఉన్న కేసు హైకోర్టులో కొట్టేశారని.. పనులు ప్రారంభించటానికి బందరు రానున్నట్లు చెప్పటం తెలిసిందే.

ఇలాంటి వేళలో గౌతమ్ అదానీ.. ఆయన సంస్థలో పోర్టుల వ్యవహారాల్ని చూసే డైరెక్టర్ కోమల్ ను వెంట పెట్టుకొని వచ్చి ముఖ్యమంత్రితో భేటీ కావటం చూస్తుంటే.. బందరు పోర్టు అదానీ చేతుల్లోకి వెళ్లటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. తొలుత బందరు పోర్టును నవయుగ దక్కించుకుంది. వైసీపీ సర్కారు పవర్లోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే చంద్రబాబు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసింది. పనులు సకాలంలో పూర్తి చేయలేదనే కారణాన్ని చూపించి పోర్టు పనుల్ని రద్దు చేసింది. రాష్ట్ర ప్రభుత్వమే బందరు పోర్టును నిర్మించి.. ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్న వాదన వినిపించింది.

ఈ నేపథ్యంలో బందరు పోర్టు నిర్మాణానికి మళ్లీ టెండర్లు వేయగా.. మేఘా సంస్థతో పాటు విశ్వ సముద్ర హోల్డింగ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలు టెండర్లు వేశాయి. అందులో అత్యధికంగా బిడ్ వేసిన మేఘా సంస్థ అత్యధిక బిడ్ వేసింది. అయితే.. తమ ఒప్పందాన్ని రద్దు చేయటంపై నవయుగ కోర్టును ఆశ్రయించింది. దీనిపై ఉన్న కేసును ఆగస్టు 25న కొట్టేశారు. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై నవయుగ మళ్లీ డివిజన్ బెంచ్ కు వెళ్లింది. దీనికి సంబంధించిన నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఇలాంటి వేళలో.. గౌతమ్ అదానీ గుట్టుగా తాడేపల్లికి వచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయి వెళ్లటంఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.