Begin typing your search above and press return to search.

ట్రంప్ ఖాతాపై నిషేధం..ట్విట్టర్ కి ఎన్ని వేల కోట్లు నష్టమో తెలుసా!

By:  Tupaki Desk   |   12 Jan 2021 7:00 PM IST
ట్రంప్ ఖాతాపై నిషేధం..ట్విట్టర్ కి ఎన్ని వేల కోట్లు నష్టమో తెలుసా!
X
డోనాల్డ్ ట్రంప్ పదవి నుండి దిగిపోయే సమయం ఆసన్నం అయింది. జనవరి 20 న అగ్రరాజ్యం అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఓటమితో తీవ్ర నిరాశనిస్పృహలతో ఉన్న ట్రంప్, తన అనుచరులను క్యాపిటల్ భవన్ పై దాడికి పాల్పడేలా ప్రోత్సహించడం అగ్రరాజ్యంలో తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో ఆయన్ను పదవి నుంచి తప్పించాలన్న ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలు నిషేధానికి గురి అవడం తీవ్ర చర్చనీయాంశమయింది. యాక్టివ్ లీడర్లలో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న ట్రంప్ ట్విటర్ ఖాతా పై నిషేధం విధించడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్రంప్ ఖాతాను నిషేధించడంతో ట్విటర్ పై బాగానే ప్రభావం పడింది. ఆయన ఖాతాను నిలిపివేయడం వల్ల ఏకంగా 5 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఏకంగా 36వేల కోట్ల రూపాయలను ట్విటర్ సంస్థ నష్టపోయింది. అదే సమయంలో ట్విటర్ షేర్ 12శాతం కుప్పకూలింది. ట్రంప్ కు 88 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అదే సమయంలో ట్రంప్ మద్ధతుదారులకు చెందిన 70 వేల అకౌంట్లను ట్విటర్ రద్దు చేసింది.

దీంతో ఈ మేరకు నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఫేస్ బుక్ సంస్థ కూడా ట్రంప్ అధికారిక ఖాతాను మూసేసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ సంస్థ అధినేత జుకర్ బర్గ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ట్రంప్ తన పదవీకాలం పూర్తవడానికంటే ముందే రాజీనామా చేయడానికి ససేమిరా అంటున్నారు. అంతే కాకుండా జనవరి 20న జరిగే బైడెన్ ప్రమాణస్వీకారోత్సవానికి తాను హాజరుకాబోనని ఇప్పటికే ప్రకటించారు. ట్రంప్ నా ప్రమాణస్వీకారానికి రాకపోవడమే ఉత్తమం. కనీసం ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ హాజరయినా నేను సంతోషిస్తాను అని బైడెన్ చెప్పారు.