Begin typing your search above and press return to search.

మమత పై నిషేధం

By:  Tupaki Desk   |   13 April 2021 8:42 AM GMT
మమత పై నిషేధం
X
పశ్చిమబెంగాల్ ఎన్నికల విషయంలో కేంద్ర ఎన్నికల కమీషన్ సంచలనమైన నిర్ణయం తీసుకుంది. దీదీ మమతాబెనర్జీని 24 గంటలపాటు ప్రచారానికి దూరంగా ఉండాలని నిషేధం విధించింది. మమతపై కేంద్ర ఎన్నికల సంఘం ఇలాంటి నిషేధం విధించటం ఆశ్చర్యంగానే ఉంది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. ఇప్పటికి నాలుగు దశల పోలింగ్ ముగిసింది. మరో నాలుగు దశల పోలింగ్ జరగాల్సుంది.

అయిపోయిన నాలుగు దశల పోలింగ్ తో పోల్చుకుంటే జరగాల్సిన పోలింగ్ బీజేపీకి చాలా చాలా ఇంపార్టెంట్. బెంగాల్ ఉత్తరప్రాంతంలో జరగబోయే నాలుగు దశల పోలింగ్ లోనే గూర్ఖాల్యాండ్ ప్రాంతం కూడా ఉంది. ఇక్కడ బీజేపీపై జనాలు బాగా మండిపోతున్నారు. పైగా ఈ ప్రాతమంతా దీదీకి బాగా పట్టున్న ఏరియా. గూర్ఖాల్యాండ్ ప్రాంతంలో సుమారు 54 నియోజకవర్గాలున్నాయి. ఈ ప్రాంతంలో బాగా పట్టున్న గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం)మమతకు మద్దతుగా నిలబడింది.

ఈ ప్రాంతంలో దీదీ ప్రచారంలో ఉన్న సమయంలోనే ఎన్నికల కమీషన్ 24 గంటల పాటు నిషేధం విధించింది. ముస్లింలందరు మూకుమ్మడిగా తృణమూల్ కే ఓట్లేయాలన్న మమత విజ్ఞప్తిపై బీజేపీ ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసింది. ఇదే విషయమై కమీషన్ మమతకు నోటీసిచ్చింది. దానికి సమాదానమిస్తు ఎన్నికల ప్రచారంలో తానేమీ తప్పుగా మాట్లాడలేదన్నారు. పైగా తాను మాట్లాడినట్లుగానే నరేంద్రమోడి, అమిత్ షా తదితరులు కూడా చేసిన విజ్ఞప్తుల మీడియా కటింగులను ఎన్నికల కమీషన్ కు పంపారు.

అయితే మమత సమాధానంతో సంతృప్తి చెందని కేంద్ర ఎన్నికల కమీషన్ దీదీ ప్రచారంపై 24 గంటలపాటు నిషేధం విధించారు. మరి ఇలాంటి విజ్ఞప్తులే చేసిన మోడి, అమిత్ అండ్ కో పై ఎందుకు చర్యలు తీసుకోలేదని మమత మండిపోతున్నారు. అయితే ఎన్నికల కమీషన్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదులేండి. నిజంగా హైఓల్టేజీని తలపించే ఎన్నికల ప్రచారం నుండి మమతను 24 గంటలపాటు నిషేధించటమంటే మామూలు విషయం కాదు.

అందుకనే బీజేపీ పెద్దలు మమతను కట్టడిచేయటానికి ఎన్నికల కమీషన్ ద్వారా కుట్ర చేస్తున్నారంటు టీఎంసీ నేతలు మండిపోతున్నారు. ఇదే విషయాన్ని పార్టీ ఎంపి డెరెక్ ఓబ్రెయిన్ మాట్లాడుతు నరేంద్రమోడికి కేంద్ర ఎన్నికల కమీషన్ పూర్తిగా లొంగిపోయిందంటు మండిపోయారు. మోడితో కమీషన్ రాజీపడిపోయిన కారణంగానే మమతపై నిషేధం విధించినట్లు ఆరోపించారు.