Begin typing your search above and press return to search.

బంతి బంతికి ఐపీఎల్ లో బెట్టింగ్ ల జోరు..

By:  Tupaki Desk   |   16 April 2021 1:30 AM GMT
బంతి బంతికి ఐపీఎల్ లో బెట్టింగ్ ల జోరు..
X
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందడి మొదలైంది. రోజురోజుకు మ్యాచ్ లు మజానిస్తున్నాయి. ఉత్కంఠతో ఊపేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్ ను క్యాష్ చేసుకుంటున్నారు బెట్టింగ్ రాయుళ్లు. మ్యాచ్ లపై పందేలు జోరుగా కాస్తున్నారు.

ముఖ్యంగా యువత, విద్యార్థులు, ఉద్యోగులను బెట్టింగ్ మాఫియా లక్ష్యంగా చేసుకుంటోంది. బంతి బంతికీ , ఓవర్ ఓవర్ కు, మ్యాచ్ విజేతలపై బెట్టింగులు కాయిస్తున్నారు. క్రికెట్ బుకీల వలలో చిక్కుకుంటున్న యువకులు అప్పులు చేసి మరీ బెట్టింగులు కాస్తూ ఉన్నది పోగొట్టుకుంటున్నారు.

సులువుగా డబ్బులు సంపాదించవచ్చని బుకీలు యువతకు ఎరవేస్తున్నారు. దీంతో ఈ మాయలో పడి వారంతా చిక్కుకుంటున్నారు. బెట్టింగ్ కేసుల్లో అత్యధికంగా పట్టుబడేది యువత, విద్యార్థులు కావడం విశేషం. ఇక బెట్టింగులకు బానిసలుగా మారి యువత వ్యసనాలకు బానిసలై దొంగలుగా మారుతున్నారు.

తాజాగా ఏపీలోని ఏలూరు, పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెం, జంగారెడ్డి గూడెం, అకివీడు,నిడదవోలు, కొవ్వూరుతోపాటు పల్లెల్లోనూ బెట్టింగ్ లు జోరుగా సాగుతున్నాయట.. ఆన్ లైన్ లో ప్రత్యేకమైన యాప్ లలో ఈ బెట్టింగులు సాగుతున్నాయి. సెల్ ఫోన్ లోనే ఈ తంతంగా నడుస్తోందట. ఇక్కడి ఇంజినీరింగ్ యువత ప్రధానంగా ఈ బెట్టింగులు కాస్తున్నట్టు తెలుస్తోంది.

యువతను పెడదోవ పట్టిస్తూ బెట్టింగులు కాస్తున్న అసాంఘిక శక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. పిల్లలు బెట్టింగులు కాయకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని తూ.గో ఎస్పీ నారాయణ నాయక్ సూచించారు.