Begin typing your search above and press return to search.

దిగిపొతూ షాకిచ్చే మాట చెప్పారు...?

By:  Tupaki Desk   |   8 April 2022 4:30 PM GMT
దిగిపొతూ  షాకిచ్చే మాట చెప్పారు...?
X
ఆయన నిన్నటి వరకూ మంత్రి. రాత్రికి రాత్రి మాజీ అయ్యారు. ఆయనే మాజీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒక వైపు గత కొన్నాళ్ళుగా ఏపీ కరెంట్ కోతలతో నానా అవస్థలు పడుతోంది. ఫ్యాన్ పార్టీకి ఓటేసినందుకు విసన కర్రలు కొనుక్కోవాలా అని జనాలు గోడు మంటున్నారు. ఇక విపక్షాలు అయితే విసనకర్రలతో పాటు కొవ్వొత్తులు కూడా పంచుతున్నాయి. చీకటి రోజులు దాపురించాయని కూడా కామెంట్స్ చేస్తున్నాయి.

ఈ నేపధ్యంలో పల్లెల రోదన వేదన మామూలుగా లేదు. ఎపుడు కరెంట్ వస్తుందో చెప్పలేమని, ఎంత సేపు ఉంటుందో అసలు చెప్పలేమని ఫైర్ అవుతున్నారు. సరిగ్గా నడి మధ్య వేసవికి తెచ్చి ఇలా అగ్గి రాజేస్తే ఎలా అని సర్కార్ మీద నిప్పులు చెరుగుతున్నారు.

ఇప్పటిదాకా విద్యుతు కోతలు పెద్దగా లేవని అధికారులు చెప్పుకొచ్చారు. మరో వైపు మెయింటెయినెన్స్ వర్స్క్ అని కూడా నమ్మబలుకుతున్న ఘటనలూ ఉన్నాయి. అయితే పెద్దగా కోతలు లేవని నిన్నటిదాకా చెప్పుకొచ్చిన విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇలా పదవి నుంచి దిగిపోగానే అలా నిజాలు చెప్పేశారు.

ఏపీలో విద్యుత్ డిమాండ్ అధికంగా ఉందని ఆయన చెప్పారు. అదనపు విద్యుత్ కొనేందుకు ఇబ్బందులు ఉన్నాయని కూడా ఆయన ఉన్న విషయం చెప్పేశారు. అందుకే కోతలు తప్పడం లేదని చల్లగా అసలు మాట అలా వినిపించేశారు. ఒక్కో యూనిట్ అదనపు విద్యుత్ కొనుగోలు చేయాలీ అంటే పద్దెనిమిది రూపాయలు ఖర్చు అవుతుందని మాజీ మంత్రి అంటున్నారు.

అందుకే కరెంట్ కష్టాలను అధిగమించేందుకు వేరే రకాలైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. దీనిలో భాగంగానే గృహాలకు విద్యుత్ సరఫరా చేయడానికి పరిశ్రమలకు వారంలో ఒక రోజు పవర్ హాలీడే ప్రకటించినట్లుగా బాలినేని అంటున్నారు. మొత్తానికి బాలినేని చెప్పిన దాంట్లో నిజాలు ఉన్నాయి. ఇప్పటిదాకా విపక్షాలు చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. విద్యుత్ వేసవిలో అదనపు అవసరం అవుతుంది.

దాన్ని ఇతర రాష్ట్రాల వద్ద కొనుగోలు చేయాలంటే నిధులు కావాలి. డిమాండ్ అండ్ సప్లై మీద విద్యుత్తు కొనుగోలు వ్యవహారం ఉంటుంది. వెంటనే నిధులు ఇవ్వకపోతే విద్యుత్ ని విక్రయించేందుకు ప్రైవేట్ పవర్ కంపెనీలు ముందుకు రావు. దాంతో బాలినేని చెప్పినట్లుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నమాట.

మరి పరిశ్రమలకు వారంలో ఒక రోజు పవర్ హాలీడే ప్రకటించినా ఏపీలో విద్యుత్ డిమాండ్ కి సరిపడా సరిపోదు అనే అంటున్నారు. ఇక మండు వేసవి నెల మే ముందున ఉంది. అపుడు ఇంకా కరెంట్ కష్టాలు ఎక్కువ అవుతాయి. మరి నాడు ఏం చేస్తారో. పాత విద్యుత్ మంత్రి అయితే ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. కొత్త విద్యుత్ మంత్రి అంతా బాగుందని అంటారా లేక ఇబ్బందులు లేకుండా చూస్తామని అంటారా. చూడాలి మరి.