Begin typing your search above and press return to search.

హిందూపురం నుంచి బాలయ్య సతీమణి పోటీ...?

By:  Tupaki Desk   |   19 Aug 2022 2:30 AM GMT
హిందూపురం నుంచి బాలయ్య సతీమణి  పోటీ...?
X
ఆమె ఎపుడూ జనాలలోకి వచ్చి ఎరగరు. ఆమె ఇంటికే పరిమితం. ఆమె ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే అయిన నందమూరి బాలక్రిష్ణ సతీమణి వసుంధర. ఇక బాలయ్య అంటే అందరికీ తెలిసిందే. ఆయన ఆబాలగోపాలని సుపరిచితమైన నటుడు. అంతకు ముంది అన్న గారి కుమారుడు. ఇక రాజకీయాల్లో కూడా ఆయన తన రూటు బాగానే వేసుకుంటున్నారు. రెండు సార్లు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య భవిష్యత్తులో మరింత బిజీ కావాలని కోరుకుంటున్నారు. ఆయనకు తెలుగుదేశంలో స్థానం ఏమిటి అన్న దాని కంటే కూడా ఆయనకు తెలుగు జనాలలో ఉన్న స్థానం గొప్పది.

అందువల్ల బాలయ్య అనుకుని దిగితే మాత్రం ఆయన రాజకీయ సుడి కూడా తిరిగే అవకాశం ఉందని అభిమానులు శ్రేయోభిలాషులు అంతా అంటూంటారు. ఇదిలా ఉండగా బాలయ్య హిందూపురం నియోజకవర్గంలో ఎక్కువగా ఆయన సతీమణి వసుంధర ఈ మధ్యన కనిపిస్తున్నారు. ఆమె హిందూపురంలో వరస పర్యటనలు చేస్తూ అందరికీ ఆకట్టుకుంటున్నారు.

ఈ మధ్యనే అన్న ఎన్టీయార్ పేరిట మొబైల్ క్యాంటీన్ ని వసుంధర తన స్నేహితులతో కలసి ప్రారంభించారు. ఇది కూడా ఆమె తన సొంత నిధులతో పాటు తన పరిచయస్థులు స్నేహితులు ఇచ్చిన నిధులతో నడుపుతున్నారు. ఇలా అన్న గారి పేరిట మొబైల్ క్యాంటీన్ ని వసుంధర ప్రారంభించి హైలెట్ అయ్యారు. హిందూపురంలో టీడీపీకి బాగా దగ్గర అయ్యారు. ఇపుడు ఆమె మరోసారి బాలయ్య పక్కన మెరిసి ఇంకా ఫోకస్ అయ్యారు.

హిందూపురంలో బాలయ్య తన సొంత నిధులు నలభై లక్షలతో ఏర్పాటు చేసిన ఎన్టీయార్ ఆరోగ్య రధాన్ని భార్య వసుంధరతో కలసి ప్రారంభించడం విశేషం. ఈ దంపతులు ఇద్దరూ హిందూపురంలో పర్యటిస్తూ రాజకీయ వేడిని పుట్టిస్తున్నారు. బాలయ్య అయితే రాజకీయాలకు కొత్త కాదు, పైగా స్థానిక ఎమ్మెల్యే. కానీ ఎపుడూ బయటకు రాని భార్య వసుంధరను ఇపుడు బయటకు తీసుకురావడం హిందూపురం బాధ్యతలలో ఆమెకు కూడా వాటా ఇవ్వడంతోనే ఎక్కడ లేని ప్రాధాన్యత ఏర్పడుతోంది.

మరో వైపు చూస్తే వసుంధర ఇంతలా హిందూపురంలో తిరుగుతూండడాన్ని గమనించిన వారు కొత్త ప్రచారాన్ని ముందుకు తెస్తున్నారు. ఆమె వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు అని కూడా అంటున్నారు. హిందూపురం నుంచి వసుంధరను బరిలోకి దింపి బాలయ్య వేరే చోట నుంచి పోటీ చేస్తారని కూడా టాక్ నడుస్తోంది. అలా హిందూపురాన్ని నందమూరి వారి చేతుల్లోనే ఉంచాలని బాలయ్య ఆలోచిస్తున్నారు అని కూడా చెబుతున్నారు. అందుకే ఆయన భార్యను ఇపుడు బయటకు తీసుకువస్తున్నారు అని అంటున్నారు.

ఇక బాలయ్య హిందూపురం ఎంపీగా పోటీ చేస్తారని, భార్యను ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారని కూడా మరో ప్రచారం కూడా మొదలైంది. అయితే బాలయ్య సన్నిహిత వర్గాలు మాత్రం ఈ ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. వసుంధరకు రాజకీయాల మీద ఏ మాత్రం ఆసక్తి లేదని కూడా చెబుతున్నారు. ఆమె బాలయ్యకు సహాయంగా మాత్రమే నియోజకవర్గానికి వస్తున్నారు తప్ప ఇందులో వేరే అంశాలు ఏవీ లేవని కొట్టిపారేస్తున్నారు. అయినా నిప్పు లేనిదే పొగ రాదు కాబట్టి వసుంధర పర్యటనలు ఏ కీలక మలుపు తీసుకుంటాయో అన్న ఆసక్తి అయితే రాజకీయ వర్గాలలో ఉంది మరి.