Begin typing your search above and press return to search.

ఈ మాటలేంది బలరాం నాయక్?

By:  Tupaki Desk   |   10 Oct 2015 4:06 AM GMT
ఈ మాటలేంది బలరాం నాయక్?
X
పొరపాటున కూడా రాకూడని మాటను తెలంగాణ కాంగ్రెస్ నేత.. మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ అనేసి సంచలనం సృష్టించారు. అనక.. నాలుక్కర్చుకొని జస్ట్ జోకేశా అంటూ కామెడీ చేసే ప్రయత్నం చేశారు. కానీ..జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయిందన్న మాట వినిపిస్తోంది.

విపరీతమైన భావోద్వేగంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 18 నెలలు కూడా పూర్తి కాలేదు. కానీ.. అప్పుడే తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తామంటూ వార్నింగ్ ఇస్తూ బలరాం నాయక్ కలకలం సృష్టించారు. తమ పార్టీకి కానీ ఓటు వేయని పక్షంలో తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపేస్తామంటూ సీరియస్ అయిపోయారు. దీంతో.. పక్కనున్న తెలంగాణ కాంగ్రెస్ అగ్ర నేతలు ఒక్కసారి భూమి కదిలినంతగా ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్న ఈ వ్యాఖ్యలు వచ్చిన క్రమం చూస్తే..

వరంగల్ జిల్లా నర్సంపేటలో కాంగ్రెస్ నేతలు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్.. తెలంగాణను ఇచ్చేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కష్టపడితే.. ప్రజలు మాత్రం టీఆర్ఎస్ కు ఓటేశారంటూ మండిపడ్డారు. అదే అగ్రహంతో టంగ్ స్లిప్ అయిన ఆయన.. ఈసారి కాంగ్రెస్ కానీ ఓడిపోతే.. తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రాలో కలుపుతామంటూ హెచ్చరించారు.

దీంతో.. వేదిక మీద ఉన్న జానారెడ్డి.. ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా సీనియర్ నేతలు ఒక్కసారి షాక్ తిన్నారు. అంతలోకి అక్కడే ఉన్న నేత ఒకరు ఏం మాట్లాడుతున్నావ్ అంటూ హెచ్చరించేసరికి.. ఎలా కలుపుతామంటూ సర్ది చెప్పుకొన్న ఆయన.. సరదాగా మాట్లాడా అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. విపక్షాలన్నీ కలిసి బంద్ నకు పిలుపునిచ్చి.. తెలంగాణ సర్కారుపై ఒత్తిడి పెంచిన క్రమంలో బలరాం నాయక్ నోటి నుంచి వ్యాఖ్యలతో తెలంగాణ అధికారపక్షం ఒక్కసారి చెలరేగింది.

దీంతో.. ఆయనపై వారు ఒంటికాలిపై లేచారు. కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం కుట్రలు చేస్తుందో బలరాం నాయక్ మాటలతో అర్థమవుతుందంటూ గులాబీ నేతలు ఫైర్ అయ్యారు. దీంతో.. ఈ వివాదం ఎక్కడి వరకు వెళుతుందో అన్న కంగారు పడిన బలరాం నాయక్ మీడియాతో మళల్ మాట్లాడి.. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే.. ఏపీలో కలిపిన ఆరు మండలాల్ని వెనక్కి తీసుకొస్తామని చెప్పబోయి అలా చెప్పానని.. తప్పుగా మాట్లాడినట్లు అనిపిస్తే.. క్షమాపణలు చెప్పేందుకు సైతం తాను సిద్ధమన్నారు. మరోవైపు.. టీఆర్ఎస్ నేతలు మాత్రం బలరాం నాయక్ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేయకుండా ఉండేందుకు ఈ ఒక్క మాట చాలంటూ మండిపడుతున్నారు.