Begin typing your search above and press return to search.

చిన‌బాబుకు తోడ‌ల్లుడి తోడు?

By:  Tupaki Desk   |   1 July 2018 6:15 AM GMT
చిన‌బాబుకు తోడ‌ల్లుడి తోడు?
X
భార‌త దేశంలో వార‌స‌త్వ రాజ‌కీయాలు కొత్తేం కాదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్....రాష్ట్ర స్థాయిలో టీడీపీ ల‌లో రాజ‌కీయ వార‌సులు కొన్ని ద‌శాబ్దాలుగా కొన‌సాగుతూనే ఉన్నారు. టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క రామారావు వార‌సుడిగా బాల‌కృష్ణ కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న అల్లుడు - ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ బాబు కూడా మరో రాజ‌కీయ‌ వార‌సుడిగా ఇప్ప‌టికే అధికారంలో ఉన్నాడు. వీరికి తోడు తాజాగా, లోకేష్ తోడ‌ల్లుడు కూడా త్వ‌ర‌లో రాజ‌కీయాల్లోకి రాబోతున్న‌ట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నిక‌ల్లో బాల‌కృష్ణ చిన్న‌ల్లుడు భ‌ర‌త్ ....విశాఖ లోక్ స‌భ‌కు పోటీ చేయ‌బోతున్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీతో టీడీపీ తెగ‌దెంపులు చేసుకున్న నేప‌థ్యంలో విశాఖ ఎంపీ సీటును టీడీపీ త‌ర‌ఫున భ‌ర‌త్ కు కేటాయించాల‌ని ప్ర‌పోజ‌ల్స్ వ‌చ్చాయ‌ట‌.

గీతం విద్యాసంస్థల అధినేత ఎంవీవీఎస్ మూర్తి మ‌న‌వ‌డు భ‌ర‌త్ ను బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే, 2019లో విశాఖ ఎంపీ సీటును మూర్తిగారు ఆశించార‌ట‌. త‌న‌కు కాక‌పోయినా....తన వారసుడిగా మ‌న‌వడు భరత్ కు సీటు ఇవ్వాలని బాల‌య్య‌బాబుకు ప్ర‌పోజ‌ల్ పెట్టార‌ట‌. ఈ ప్ర‌పోజ‌ల్ కు బాల‌య్య కూడా సానుకూలంగా స్పందించిన‌ట్లు తెలుస్తోంది. చిన‌బాబుకు తోడుగా తోడుగా చిన్నల్లుడు భరత్ ను క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకురావాలని బాలయ్య ప‌ట్టుద‌ల‌తో ఉన్నార‌ట. మ‌రోవైపు, విశాఖ లో మంచిప‌ట్టున్న గంటా శ్రీనివాస్ ను ఈ సారి లోక్ స‌భ‌కు పంపాల‌ని చంద్ర‌బాబు ప్లాన్ చేస్తున్నారని వినికిడి. కొద్ది రోజుల క్రితం వెలువ‌డిన స‌ర్వేపై గంటా గుర్రుగా ఉండ‌డం, కొంత‌మంది టీడీపీ నేత‌ల‌తో గంటాకు విభేదాలుండ‌డం వంటి కార‌ణాల నేప‌థ్యంలో.....ఆయ‌న‌ను పార్ల‌మెంట్ కు పంపాల‌ని చంద్ర‌బాబు ప్లాన్ చేస్తున్నార‌ని టాక్ వ‌స్తోంది. మ‌రి, వియ్యంకులిద్ద‌రిలో ఎవ‌రి మాట చెల్లుతుందో వేచి చూడాలి.