Begin typing your search above and press return to search.

బాల‌య్య‌కు హిందీ బాగా వ‌చ్చ‌ట‌!

By:  Tupaki Desk   |   23 April 2018 5:07 AM GMT
బాల‌య్య‌కు హిందీ బాగా వ‌చ్చ‌ట‌!
X
తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టిన త‌ర్వాత కూడా అస‌భ్య‌క‌రంగా.. అప్ర‌జాస్వామికంగా ఎలాంటి ప‌ద‌జాలాన్ని వాడ‌లేద‌ని చెప్ప‌టం ఏపీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌కే చెల్లింది. త‌రిమి.. త‌రిమి కొడ‌తాం మోడీ లాంటి మ‌చ్చుతున‌క‌లే కాదు.. చివ‌ర‌కు సంచ‌ల‌నాల కోసం త‌పించిపోయే ఛాన‌ళ్లు సైతం బాల‌య్య మాట‌ల్ని య‌థాత‌ధంగా వాడ‌లేక‌.. బీప్ సౌండ్ వేసిన త‌ర్వాత కూడా ఆయ‌న త‌న మాట‌ల్ని క‌వ‌ర్ చేసుకుంటున్న వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది..

హోదా సాధ‌న‌లో భాగంగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏర్పాటు చేసిన ఒక రోజు దీక్ష స‌భ‌లో బాల‌కృష్ణ మాట్లాడ‌టం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న నోటి వ‌చ్చిన మాట‌ల‌కు.. ఆయ‌న చేసిన హిందీ ప్ర‌సంగం హైలెట్ గా మార‌ట‌మే కాదు.. బాల‌య్య హిందీ ప్రావీణ్యం మీద టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి మీడియా సంస్థ అయితే.. ఏకంగా పావుపేజీని కేటాయించింది.

త‌న మాట మీదా.. హిందీ ప్రావీణ్యం మీద వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు.. జోకులు.. కేసుల నేప‌థ్యంలో బాల‌య్య తాజాగా స్పందించారు. త‌న‌కు హిందీ బాగా వ‌చ్చ‌ని ఆయ‌న చెప్పుకున్నారు. అంతేనా.. మోడీని తాను అస‌భ్య‌క‌రంగా ఏమీ తిట్ట‌లేద‌న్నారు. త‌న‌కు హిందీ బాగా వ‌చ్చ‌ని.. అయిన‌ప్ప‌టికీ త‌న‌పై కొన్నిచోట్ల కేసులు పెట్ట‌టం చాలా బాధ క‌లిగించిన‌ట్లుగా చెప్పారు.

ప్ర‌ధాని మోడీపై బాల‌కృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ‌లోని ప‌లుచోట్ల పోలీసుల‌కు ఫిర్యాదులు అందాయి. బీజేపీ.. బీజేవైఎంతో పాటు.. బీజేపీ మ‌హిళా మోర్చా నాయ‌కులు ప‌లు చోట్ల పోలీసుల‌కు ఫిర్యాదులు చేశారు. ఇదిలా ఉంటే.. బాల‌య్య‌కు మ‌తిస్థిమితంగా స‌రిగా లేని కార‌ణంగానే అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌ట్లుగా ఏపీ బీజేపీ మ‌హిళా మోర్చా అధ్య‌క్షురాలు మాలతీరాణి పేర్కొన‌టం గ‌మ‌నార్హం. గ‌తంలో తాను చేసిన నేరం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు వీలుగా త‌న మాన‌సిక స్థితి బాగాలేద‌ని స‌ర్టిఫికేట్ తెచ్చుకున్న వైనాన్ని గుర్తు చేశారు. మోడీని తిట్టిన క్ర‌మంలో బాల‌య్య కేసు బీజేపీ నేత‌ల‌కు గుర్తుకు రావ‌టాన్ని గ‌మ‌నించారా? ఆ సంగ‌తిని వ‌దిలేస్తే.. త‌న‌కు హిందీ బాగా వ‌చ్చ‌ని చెప్పిన బాల‌య్య మాట‌ల్ని మ‌ర్చిపోకండి.