Begin typing your search above and press return to search.

ల‌క్ష్మీపార్వ‌తికి బాల‌య్య స‌మాధాన‌మిది..

By:  Tupaki Desk   |   7 Feb 2017 1:28 PM GMT
ల‌క్ష్మీపార్వ‌తికి బాల‌య్య స‌మాధాన‌మిది..
X
ఆలూ లేదు చూలూ లేదు అన్న త‌ర‌హాలో త‌యారైంది ఎన్టీఆర్ బ‌యోపిక్‌. త‌న తండ్రి జీవిత క‌థ‌తో సినిమా తీయ‌బోతున్నామ‌ని.. అందులో త‌నే క‌థానాయ‌కుడిన‌ని నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌క‌టించ‌డం ఆల‌స్యం.. దీనిపై వివాదాలు మొద‌లైపోయాయి. ఎన్టీఆర్ స‌తీమ‌ణి ల‌క్ష్మీపార్వ‌తి లైన్లోకి వ‌చ్చేసి ఆ సినిమా విష‌యంలో ఏదైనా తేడాలొస్తే తాను కోర్టుకు వెళ్తాన‌ని హెచ్చ‌రించింది. ఈ వ్యాఖ్య‌ల‌పై బాల‌య్య వెంట‌నే స్పందించాడు. మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడుతూ.. ల‌క్ష్మీపార్వ‌తి వ్యాఖ్య‌ల‌పై ద‌న స్పంద‌న తెలియ‌జేశాడు బాల‌య్య‌.

‘‘నాకు ఎక్క‌డ మొద‌లుపెట్టాలో తెలుసు. ఎలా ముగించాలో తెలుసు. సినిమా ఎలా తీయాలో తెలుసు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ జీవిత విశేషాల‌పై ఒక బృందం ప‌రిశోధ‌న జ‌రుపుతోంది. నాన్న‌గారి జీవితంలో నాకు తెలియ‌ని విష‌యాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడెవ‌ర‌న్న‌ది ఇంకా ఖ‌రార‌వ్వ‌లేదు. నేనే నాన్న‌గారి పాత్ర‌ను పోషిస్తా. నేను క‌మ‌ర్షియ‌ల్ గా ఆలోచించ‌ను. ఈ చిత్రాన్ని ఫీచ‌ర్ ఫిల్మ్ గా తీస్తామా లేక డాక్యుమెంట‌రీనా అనేది ఇప్పుడే చెప్ప‌లేం. ఐతే ఎలా తీసినా దీన్ని అమ‌రావ‌తిలోని మ్యూజియంలో నిరంత‌రం ప్ర‌ద‌ర్శ‌న‌కు పెడ‌తాం’’ అని బాల‌య్య చెప్పాడు.

బాల‌య్య కొన్ని రాజ‌కీయ అంశాల‌పైనా మాట్లాడాడు. కేబినెట్లో చేర‌తారా అని అడ‌గ్గా.. ప్ర‌స్తుతమున్న ప‌ద‌వితోనే తాను సంతృప్తిగా ఉన్న‌ట్లు చెప్పారు. లోకేష్ కు కేబినెట్లో స్థానం ద‌క్కుతుందా అని అడిగితే.. పార్టీ నాయ‌క‌త్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా స్వాగ‌తిస్తాన‌న్నాడు. ప్ర‌త్యేక హోదాపై స్పందిస్తూ దీని వ‌ల్ల కొన్ని ప్రయోజ‌నాలుంటాయ‌ని.. అది ద‌క్క‌ని ప‌క్షంలో కొన్ని న‌ష్టాలుంటాయ‌ని.. ఐతే కేంద్రం ప్ర‌త్యేక హోదా ఇచ్చే అవకాశం లేద‌ని తేల్చి చెప్ప‌డంతో తాము రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్ర‌బాబు మీద న‌మ్మ‌కంతో ప్ర‌త్యేక ప్యాకేజీకి అంగీక‌రించామ‌ని బాల‌య్య అన్నాడు. త‌న పీఏ బెదిరింపుల గురించి మాట్లాడుతూ ఇలాంటివి స‌హ‌జ‌మే క‌దా అన్నాడు బాల‌య్య‌. ఈ విష‌యంలో ఎవ‌రినీ తాను నిందించ‌న‌ని చెప్పాడు. హిందూపురంలో నీటి స‌మ‌స్య‌ను తీర్చేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్లు బాల‌య్య చెప్పాడు.