Begin typing your search above and press return to search.

బాలయ్య స్పందన ఎలా ఉండబొతుంది?

By:  Tupaki Desk   |   4 Feb 2017 6:06 AM GMT
బాలయ్య స్పందన ఎలా ఉండబొతుంది?
X
ఏది నిజం.. ఏది ఆరోపణ.. ఎవరిది అవాస్తవం.. మరెవరిది అసమర్ధత అనే సంగతులు కాసేపు పక్కనపెడితే... హిందూపురం నియోజకవర్గంలో మాత్రం ఏదో జరుగుతుందని ఒక స్పష్టత అయితే వచ్చింది. ఈ విషయంలో ఏకంగా హిందూపురంలో నియంత పాలనే సాగుతుందని ఆరోపిస్తున్నారు హిందూపురం టీడీపీ కార్యకర్తలు! హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శేఖర్ పద్దతేమీ బాగాలేదనేది దీనికి కారణంగా చూపిస్తున్నారు! ఈ విషయంలో పీఏ కు వ్యతిరేకంగా నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు మొత్తం కదిలి వస్తారని.. వారంతా ఈ నెల 5న భారీ ఎత్తున సమావేశమవుతారని ప్రకటిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు నివాసంలో వీరంతా సమావేశమై ఈ నిర్ణయానికి వచ్చారని తెలుస్తుంది. అయితే... ఈ విషయాలపై బాలయ్య స్పందనపై అందరికీ ఆసక్తి నెలకొంది.

హిందూపురం నియోజకవర్గంలో బాలయ్య పీఏ శేఖర్ అరాచకాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లేందుకే నాయకులు, కార్యకర్తల అభీష్టం మేరకే సమావేశాలు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు టీడీపీ నేతలు. ఈమధ్యకాలంలో బాలయ్య పీఏ అరాచకాలు ఎక్కువైపోయాయని, వాటిని ప్రశ్నించిన నాయకులు - కార్యకర్తలపై పోలీసు కేసులు నమోదు చేయిస్తున్నారని చెబుతున్నారు. ఏదిఏమైనా, ఎవరు ఏమన్నా 5వ తేదీన సమావేశం నిర్వహించి తీరుతామని, అడ్డుకోవాలని చూస్తే నియోజకవర్గ వ్యాప్తంగా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని పార్టీ పెద్దలకు బలమైన వార్నింగ్ ఇచ్చారు! ఈ వార్నింగ్ చంద్రబాబుకి ఇచ్చారా, బాలయ్యకు ఇచ్చారా అనే సంగతులు కసేపు పక్కనపెడితే... క్రమశిక్షణ గల కార్యకర్తలున్న పార్టీ అని చెప్పుకునే టీడీపీకి ఇది వాస్తవరూపం అనే విషయం స్పష్టమయ్యే అవకాశాలున్నాయి!

ఆ సంగతులు అలా ఉంటే... తన నియోజకవర్గంలో, టీడీపీ కంచుకోట అని చెప్పుకునేచోట పార్టీలో ఇంత రచ్చ జరుగుతుంటే.. ఎమ్మెల్యే అయిన బాలయ్యకు తెలియకుండానో, చెప్పకుండానో స్థానిక నేతలంతా మీటింగులు పెట్టేసుకుంటుంటే.. బాలయ్య తీసుకోబోయే నెక్స్ట్ స్టేప్ పై అందరికీ ఆసక్తి నెలకొంది. ఇంతజరిగినా పీఏ ని వెనకేసుకొచ్చి నియోజకవర్గంలోని నేతలమధ్య చీలికలు తీసుకొస్తారా.. లేక వారి ఆరోపణల్లో వాస్తవం ఉందని తేల్చి పీఏని తొలగిస్తారా.. అన్నది ఇప్పుడు కీలకం! అయితే ఈ విషయంలో ఏ ఒక్కటి జరిగినా బాలయ్యకు ఎంతోకొంత డ్యామేజీ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పీఏ ది తప్పని తేల్చేసిన బాలయ్య అతడిని తొలగిస్తే... ఇంతకాలం బాలయ్య పీఏ చేస్తున్న పనులు తప్పని, అందులో కచ్చితంగా తన బాధ్యత కూడా ఉందని ఒప్పుకున్నట్లు అవ్వొచ్చు! అలా కాకుండా పీఏ చేసేవన్నీ తన కనుసన్నల్లో విషయాలే అని, తన అనుమతితోనే పీఏ అలా వ్యవహరిస్తున్నారని చెప్పి... ప్రస్తుతం నిరసన చెబుతున్న హిందూపురం కార్యకర్తలను తప్పుపడితే... వారంతా వ్యతిరేకంగా మారొచ్చు, దాని ప్రభావం మొత్తం పార్టీపై పడొచ్చు! హిందుపురంలో ఏమి జరగబోతుంది... బాలయ్య స్పందన ఎలా ఉండబొతుంది... ఈ విషయంపై చంద్రబాబు సైతం స్పందిస్తారా... బాలయ్య ఇలాఖా విషయంలో జోక్యం తగదని భావిస్తారా... ఇన్ని ప్రశ్నలు తమ్ముళ్ల మెదళ్లలో మెదులుతున్నాయంట!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/