Begin typing your search above and press return to search.

చంద్రబాబు కన్నీళ్లపై బాలయ్య ఆగ్రహం.. సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   20 Nov 2021 1:00 PM IST
చంద్రబాబు కన్నీళ్లపై బాలయ్య ఆగ్రహం.. సంచలన వ్యాఖ్యలు
X
ఏపీ అసెంబ్లీలో జరిగిన వ్యవహారంపై శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కన్నీరు మున్నీరయ్యారు. లోకేశ్, భువనేశ్వరి విషయంలో అధికార పక్ష నాయకులు అసభ్య పదజాలం వాడారని చంద్రబాబు మీడియా ఎదుట చెబుతూ ఒక్కసారిగా బావోద్వేగానికి గురయ్యారు. దీంతో చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకునేందుకు కారణమైన వారిపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కుటుంబ సభ్యులు భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలతో కలత చెందారు. ఆమె అక్క భువనేశ్వరి, సోదరుడు బాలకృష్ణ స్పందించారు. బాలకృష్ణ తన ఇంట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీలో జరిగిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

'వైసీపీ నేతలు మాట్లడే భాష చూస్తే అసహ్యం వేస్తోంది. ప్రజా సమస్యలు చర్చించాల్సిన చోట క్యారెక్టర్ గురించి మాట్లాడమేంటి..? అసెంబ్లీలో సమస్యలపై మాట్లాడండి.. వాగ్వాదాలు చేసుకోండి.. కానీ వ్యక్తిగతంగా మాట్లాడడమెందుకు..? చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. రాష్ట్ర విభజన తరువాత కూడా రాష్ట్రాభివృద్ధికి కృషి చేశారు. ఇప్పుడు ఏం అభివృద్ది జరుగుతుందో చెప్పగలరా..?' అని అన్నారు.

'తన సోదరి భువనేశ్వరి పై మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది..? అసలు అసెంబ్లీలో మహిళపై విమర్శలు చేయడం సమంజసమేనా..? ఇస్యూ మీద మాట్లాడాలి. కానీ దానికి సంబంధం లేని విషయంపై మాట్లాడడమెందుకు..? చంద్రబాబు ఏనాడు కంటతడి పెట్టలేదు. ఆయనది చాలా గట్టి గుండె. కానీ ఆయనకే కన్నీళ్లు తెప్పించేలా వైసీపీ నాయకులు వ్యవహరించడం దారుణం. ప్రజాసమస్యలపై మాట్లాడడం తెలియదా..? ఆడవాళ్ల జోలికి వస్తే ఊరుకునేది లేదు. మెజారిటీ ఉందికదా అని ఇష్టం వచ్చినట్లు విర్ర వీగితే ఊరుకునేది లేదు. ఇకపై మాకు చంద్రబాబు అనుమతి అవసరం లేదు. మేమే విరుచుకుపడుతాం. ఇప్పటికైనా వైసీపీ పద్ధతి మార్చుకోవాలి. లేకపోతే మెడలు వంచుతాం. ' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక ఆతరువాత నందమూరి చైతన్య కృష్ణ మాట్లాడుతూ 'రాజకీయ లబ్ధి కోసమే మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారు. మా తాత ఎన్టీఆర్ మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇలా మాట్లాడితే మహిళలు వస్తారా..? చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వల్లభనేని వంశీ, కొడాలి నాని పదవుల్లో ఉండే అర్హత లేదు. వారిని వెంటనే బర్తరఫ్ చేయాలి.' అని అన్నారు. మరోవైపు టీడీపీ శ్రేణులు ఏపీలో పలు చోట్ల ధర్నాలు నిర్వహించారు. ఏపీ సీఎం జగన్ తో పాటు మంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. భువనేశ్వరి సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి సైతం భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. 'అక్కాచెల్లెళ్లమైన మేము నైతిక విలువలతో పెరిగాం' అని ట్విట్టర్ ద్వారా స్పందించారు.