Begin typing your search above and press return to search.

మెగా బైట్‌ కు, గిగా బైట్‌ కు తేడా తెలియని సీఎం జగన్‌: బాలయ్య హాట్‌ కామెంట్స్‌!

By:  Tupaki Desk   |   7 April 2023 1:09 PM GMT
మెగా బైట్‌ కు, గిగా బైట్‌ కు తేడా తెలియని సీఎం జగన్‌: బాలయ్య హాట్‌ కామెంట్స్‌!
X
మెగా బైటుకు, గిగా బైటుకు తేడా తెలియని సీఎం జగన్‌ అని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఎద్దేవా చేశారు. జగన్‌ కు పబ్జీ ఆడుకోవడం తప్ప మరేమీ తెలియదని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఓటమి అంచుల్లో ఉందని జగన్‌కూ తెలుసని వ్యాఖ్యానించారు. వైసీపీ అరాచకాలను ఎదిరించేందుకు ప్రజలంతా ముందుకు రావాలని బాలయ్య పిలుపునిచ్చారు. నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో పాల్గొనడానికి ముందు బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. లోకేష్‌ యువగళం పాదయాత్రలో అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం మార్తాడు క్యాంప్‌ సైట్‌ వద్ద బాలయ్య పాదయాత్రలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జగన్‌ పై బాలకృష్ణ మండిపడ్డారు. వైసీపీ పాలనలో ఏపీ సర్వనాశనమైందన్నారు. అభివృద్ధి శూన్యం, దోపిడీ ఘనం అన్నట్లుగా పాలన సాగుతోందని నిప్పులు చెరిగారు. జగన్‌ సీఎం అయ్యాక రాష్ట్రంలో పరిశ్రమలు రాలేదు.. ఉపాధి కల్పన జరగలేదన్నారు. రాష్ట్రమంతటా ల్యాండ్, శాండ్‌ మాఫియా రెచ్చిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ కేసులతో వేధిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పేదవాళ్లు బతికే పరిస్థితి లేదన్నారు. చెత్తపైనా పన్ను వేసే దౌర్భాగ్య పరిస్థితి ఏపీలో మాత్రమే ఉందని బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో మళ్లీ సైకో పాలన వస్తే ఏపీ ప్రజలు మరోచోటికి వలసపోవాల్సి వస్తుందని బాలయ్య హాట్‌ కామెంట్స్‌ చేశారు. అప్పుడు రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని వ్యాఖ్యానించారు. వైసీపీ ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి ఉందని బాలయ్య తెలిపారు. చాలామంది తమతో టచ్‌ లో ఉన్నారని వెల్లడించారు. టీడీపీలో చేరి ప్రజా సేవ చేద్దామని వారంతా కోరుకుంటున్నారని తెలిపారు.

మీకోసం.. మీ నాయకుడిని మీరే ఎన్నుకోవాలని బాలయ్య పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై టీడీపీయే కాదు.. ప్రతి ఒక్కరూ తిరగబడాలన్నారు. ఇప్పటికైనా ప్రజలు జాగ్రత్తపడి కళ్లు తెరవాలని కోరారు.ఓటే మీకు ఆయుధం. అదే మీకు రక్షణ అని తెలిపారు. రాష్ట్రంలో రాజధాని ఎక్కడుంది? బాదుడే బాదుడు.. ఇదేం ఖర్మ? వంటివి చూస్తున్నామని గుర్తు చేశారు.

ఐదు కోట్ల మంది కలల రాజధాని అమరావతి గురించి ఊసే లేదన్నారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు తమకు ఎక్కడ అడ్డంకి అవుతారోనని వాళ్లు ఏం చేసినా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

ఒక సంవత్సరంలో పోలవరం పూర్తిచేస్తామని చెప్పి ఇంతవరకు పూర్తి చేయలేదన్నారు. రూ.8 లక్షల కోట్ల అప్పులు ఎవడబ్బ సొమ్ము? అని నిలదీశారు. అప్పులు చేసినా జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితుల్లో ఉన్నారని గుర్తు చేశారు. గంజాయిలో నంబర్‌ 1 స్థానంలో ఉన్నామన్నారు.

వైసీపీ పాలనలో విద్యుత్‌ చార్జీలు, ఆర్టీసీ, పెట్రోల్, డీజిల్, ఇంటి పన్నులు, ఆఖరికి చెత్త మీద కూడా పన్నువేసే పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని ధ్వజమెత్తారు. ఏ నియోజకవర్గంలో చూసిన వైసీపీ ఎమ్మెల్యేలు శాండ్‌ మాఫియా, ల్యాండ్‌ మాఫియా పేరిట ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు.

లోకేశ్‌ పాదయాత్ర యువతరానికి స్ఫూర్తి అన్నారు. ప్రజలు సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న లోకేష్‌ కు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.