Begin typing your search above and press return to search.

పోలవరం.. ఇకపై వైఎస్ ఆర్ పోలవరం!

By:  Tupaki Desk   |   27 May 2019 4:30 PM GMT
పోలవరం.. ఇకపై వైఎస్ ఆర్ పోలవరం!
X
ఏపీ జీవనాడిగా పరిగణిస్తున్న జాతీయ ప్రాజెక్టు పోలవరం పేరు మారిపోతోందా? అంటే... అవుననే చెప్పక తప్పదు. తెలుగు నేల విభజనతో ఏపీకి బాసటగా నిలిచే క్రమంలో కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. దీంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చంతా కూడా కేంద్రమే భరిస్తుంది. అయితే ఇక్కడే ఓ చిన్న మతలబు చేసిన చంద్రబాబు... నిధులు మీరిస్తే చాలు ప్రాజెక్టును మేమే నిర్మించుకుంటామంటూ ఓ విచిత్ర ప్రతిపాదన తీసుకొచ్చి.. ఆ ప్రాజెక్టు పనులను ఎక్కడికక్కడ ఆగేలా చేశారనే చెప్పాలి.

సరే... ఇదంతా గతం అనుకుంటే... ప్రస్తుత ఎన్నికల్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ బంపర్ మెజారిటీతో గ్రాండ్ విక్టరీ కొట్టేసింది. ఈ నెల 30న జగన్ సీఎంగా పదవీ ప్రమాణం చేయనున్నారు. ఈ క్రమంలో తమ నేత, మహానేతగా పేరుగాంచిన వైఎస్ అనుమతులు సాధించి, ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన కాలువల నిర్మాణాలను పూర్తి చేసిన వైనాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అంతటితో ఆగని వైసీపీ నేతలు... వైఎస్ చేతుల కష్టం మీద ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టుకు వైఎస్ ఆర్ పేరు పెట్టాల్సిందేనని సరికొత్త డిమాండ్ ను తెరమీదకు తెచ్చారు.

ఈ మేరకు ఈ ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి ఎంపీగా ఎన్నికైన వైసీపీ నేత వల్లభనేని బాలశౌరి ఈ డిమాండ్ ను వినిపించారు. కేంద్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాని రీతిలో పోలవరం ప్రాజెక్టుకు అనుమతులన్నీ సాధించారని చెప్పారు. అంతేకాకుండా ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన కాలువలను వైెఎస్సే తవ్వించారని - ఇందుకోసం రూ.6 వేల కోట్లను కూడా వెచ్చించారని తెలిపారు. వైఎస్ తవ్వించిన కాలువలతోనే చంద్రబాాబు పట్టిసీమ ప్రాజెక్టును కట్టారని కూడా ఆయన గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించిన వైఎస్... ప్రాజెక్టుకు అవసరమైన భూమిని కూడా అప్పుడే సేకరించారని కూడా ఆయన గుర్తు చేశారు.

మొత్తంగా పోలవరానికి ఆద్యుడిగా నిలిచిన వైఎస్ ఆర్ పేరు ఆ ప్రాజెక్టుకు పెట్టాల్సిందేనని కూడా బాలశౌరి డిమాండ్ చేశారు. ఎన్నికల్లో క్లిస్టర్ క్లియర్ మెజారిటీ సాధించిన వైసీపీ తలచుకుంటే... పోలవరం ప్రాజెక్టును వైఎస్ ఆర్ పోలవరం ప్రాజెక్టుగా మార్చడం పెద్ద కష్టమైన పనేమీ కాదన్న వాదన వినిపిస్తోంది. కేంద్రంలో మరోమారు అధికారం చేపట్టనున్న నరేంద్ర మోదీ సర్కారుతోనూ జగన్ కు మంచి సంబంధాలే ఉన్న నేపథ్యంలో కేంద్రం నుంచి కూడా పెద్దగా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు లేవన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ లెక్కన పోలవరం ప్రాజెక్టు... వైఎస్ఆర్ పోలవరం ప్రాజెక్టుగా మారిపోవడం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది.