Begin typing your search above and press return to search.

నిజంగా మోజు లేదా బాలయ్యా...?

By:  Tupaki Desk   |   5 Nov 2021 3:11 AM GMT
నిజంగా మోజు లేదా బాలయ్యా...?
X
రాజకీయాల్లో కాదంటే అవును అనిలే అన్న అర్ధం వస్తుంది. అయితే కొందరు మాత్రం ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారని పేరు. ఇక సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్ళిన వారు అయితే మనసులో ఏదీ దాచుకోలేరు. ఎన్టీయార్ నట వారసుడిగా తనను తాను నిరూపించుకున్న బాలక్రిష్ణ రాజకీయలలో మాత్రం వట్టి ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు. పార్టీ పగ్గాలు మొత్తం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ చేతిలోనే ఉన్నాయి. బాలయ్య సైతం అందరి లాంటి సాధారణ నాయకుడిగానే ఉండిపోయారు.ఇది నిజంగా నందమూరి అభిమానులకు ఆవేదన కలిగించే విషయమే. మరి బాలయ్య మనసులో దీని మీద ఏముంది.

అది ఇప్పటిదాకా ఎవరూ అడగలేదు, ఆయన కూడా ఎక్కడా బయటపడలేదు. కానీ ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫారం మీద అన్ స్టాపబుల్ పేరిట బాలయ్య చేస్తున్న టాక్ షోలో మాత్రం మంచు మోహన్ బాబు ఆయన్ని ఇదే విషయం మీద సూటిగా నిలదీశారు. మీ తండ్రి ఎన్టీయార్ పెట్టిన పార్టీ టీడీపీ. దాని పగ్గాలను మీరెందుకు తీసుకోలేదు అని మోహన్ బాబు అడిగితే దానికి బాలయ్య చెప్పిన ఆన్సర్ చాలా మందికి నచ్చేలా మాత్రం లేదు, మరీ ముఖ్యంగా కరడు కట్టిన బాలయ్య ఫ్యాన్స్ కి అయితే చేదుగానే ఉండే జవాబు ఇది. ఇంతకీ బాలయ్య ఏం చెప్పారు అంటే వారసత్వ రాజకీయాలకు ఎన్టీయార్ వ్యతిరేకం. టీడీపీ సిద్ధాంతమే అది అని.

నాడు ఇందిరాగాంధీ వారసత్వ రాజకీయ పోకడలకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీగా టీడీపీకి పేరుంది. ఆమె తదనంతరం రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చారు. ఇలా కుటుంబ రాజకీయాలు వారసత్వం అన్న తీవ్రమైన అంశాల మీద టీడీపీ ఆ రోజుల్లో గట్టిగా పోరాడింది అని చెప్పారు. అందుకే తాను ఎన్టీయార్ తరువాత వారసుడిగాపార్టీ పగ్గాలు చేపట్టలేదు అని బాలయ్య చెప్పారు. ఇక్కడ చూస్తే బాలయ్య కొంత డిప్లమాటిక్ గా మాట్లాడినట్లుగా అనిపిస్తోంది. పైగా అడిగిన దానికి తోచిన జవాబుగా చెప్పినట్లుగా ఉంది అంటున్నారు.

నిజానికి టీడీపీలో నిండా వారసత్వ రాజకీయాలే ఉన్నాయి. అంత వరకూ ఎందుకు చంద్రబాబు బయటవారు కాదు కదా. ఆయన స్వయాన ఎన్టీయార్ అల్లుడు. మరి ఎన్టీయార్ తరువాత పగ్గాలు అందుకున్నది చంద్రబాబే కదా. ఇపుడు చూస్తే చంద్రబాబు కుమారుడు అన్న ట్యాగ్ తో వచ్చిన లోకేష్ భావి నాయకుడిగా కీర్తిని అందుకుంటున్నాడు. టీడీపీలో చూస్తే ద్వితీయ శ్రేణి నాయకులు వారి పుత్ర రత్నాలను ఎన్నికల్లో నిలబెడుతున్నారు. టీడీపీలో యువ రక్తం కొత్త నీరు అంటున్నారు. అలా వచ్చే వారు అంతా సీనియర్ల వారసులే. మరి ఇంతలా వారసత్వ రాజకీయాల్లో నిండిపోయిన టీడీపీ వారసత్వానికి వ్యతిరేకం అని అమాయకంగా చెబితే ఎలాగయ్యా బాలయ్యా అని అంతా అంటున్నారు.

మరో వైపు చూస్తే బాలయ్యే నా వారసుడు అని స్వయంగా ఎన్టీయార్ ఒక సందర్భంలో చెప్పారు కూడా. ఇక ఎన్టీయార్ నట వారసుడిగా సినిమాలలో రాణించిన బాలయ్య రాజకీయాల్లోకి వస్తే తప్పుగా ఎవరూ తీసుకోరు కూడా. అయితే టీడీపీలో పరిస్థితులు, బాలయ్యను దూరం పెట్టిన వైనం అందరికీ తెలుసు. బాలయ్య కూడా సొంత బావ మీద తన అసంతృప్తిని ఎక్కడా వెళ్ళ‌గక్కలేదు. పైగా లోకేష్ అల్లుడు కూడా. అందుకే ఆయన డిప్లమాటిక్ ఆన్సర్ ఇచ్చారు అంటున్నారు. నిజానికి మోహన్ బాబు కెలికింది కూడా బాబు మీద బాలయ్య ఎలా ఫైర్ అవుతారో చూడాలనే . కానీ ఆ చాన్స్ బాలయ్య అసలు ఇవ్వలేదు. అంటే రాజకీయంగా గడసరిగానే మాట్లాడారు అన్న మాట. సరే ఇవన్నీ పక్కన పెట్టేసినా టీడీపీ సారధ్యం పైనా అధికారం పైనా బాలయ్యకు నిజంగా మోజు లేదా. ఇది నందమూరి ఫ్యాన్స్ వేస్తున్న నిజాయతీతో కూడిన ప్రశ్న. మరి దీనికి జవాబు బాలయ్య ఎలా చెబుతారో.