Begin typing your search above and press return to search.

జగన్ తో బాలయ్య భేటీ ఎపుడంటే... ?

By:  Tupaki Desk   |   5 Feb 2022 3:30 PM GMT
జగన్ తో బాలయ్య భేటీ ఎపుడంటే... ?
X
ఆయన ప్రముఖ సినీ నటుడు, నందమూరి వారి వారసుడు. తండ్రి ఎన్టీయార్ జగమెరిగిన నాయకుడు. ఇక బావ కమ్ వియ్యంకుడు నారా చంద్రబాబు సీనియర్ మోస్ట్ నేత, మాజీ ముఖ్యమంత్రి. బాలయ్య అయితే ఎమ్మెల్యే కూడా. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న బాలయ్య జగన్ని ఇప్పటిదాకా కలవలేదు. అయితే ఆయన కలవరా, కలవడానికి ఇష్టం లేదా అంటే అబ్బే అలాంటిదేమీ లేదు, ఎందుకంటే బాలయ్య మీడియాతో మాట్లాడిన ప్రతీ సందర్భంలో కూడా తాను జగన్ని కలుస్తాన‌నే చెబుతున్నారు.

అది సినిమా రంగానికి సంబంధించిన సమస్య నుంచి తాజాగా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేసే విషయం దాకా చూస్తే సీఎం జగన్ తో కలసి మాట్లాడుతాను, ఆయన‌తోనే అన్నీ ప్రస్థావిస్తాను అని చెబుతున్నారు. కానీ బాలయ్య మాత్రం ఇప్పటిదాకా ఆ ప్రయత్నమే చేయడంలేదు. మరి ఈ మధ్యలోనే మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున లాంటి వారు జగన్ని పలు మార్లు కలసి వచ్చారు.

మరి సీఎంతో భేటీ అంటే బాలయ్యకు అపాయింట్మెంట్ దొరకదా అంటే ఆ ప్రశ్నే లేదు. బాలయ్య అడిగితే సీఎంఓ అధికారులు దాదాపుగా నో చెప్పే చాన్సే లేదు, పైగా ఈ మధ్యనే ఎన్టీయార్ పేరుని కొత్త జిల్లాకు పెట్టిన జగన్ ఆయన కుమారుడు తనతో భేటీ అవుతాను అంటే అసలు కాదనరు. చంద్రబాబుని ఇబ్బంది పెట్టడానికైనా బాలయ్యతో ఎక్కువ సేపు భేటీ వేసి మరీ రాజకీయ ముచ్చట చూపిస్తారు.

అయితే ఈ భేటీకి ఇబ్బంది ఎక్కడ ఉంది అంటే బాలయ్య మాటల్లోనే అనుకోవాలి. ఆయన అవసరమైతేనే సీఎం జగన్ని కలుస్తాను అని మాత్రమే అంటున్నారు. ఆ అవసరమైతే అన్న మాటలోనే చాలా అర్ధాలు ఉన్నాయని అంటున్నారు. బాలయ్యకు అవసరం ఇపుడైతే లేదు, అందుకే ఆయన జగన్ని కలవడంలేదు అని కూడా అనుకోవాలేమో. అంతే కాదు బాలయ్య కలవాల్సిన అవసరం లేకుండానే జగన్ ఆయా సమస్యల పట్ల స్పందించేస్తున్నారు అని కూడా భావించాలేమో.

ఏది ఏమైనా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయకపోతే ఊరుకోను అని నందమూరి సింహం గర్జిస్తున్నారు. ఈ విషయంలో అవసరమైతే జగన్ని కలుస్తాను అని అంటున్నారు. హిందూపురం మాత్రం కచ్చితంగా జిల్లా కేంద్రం చేయరంటే చేయరు. దానికి చాలా రాజకీయ లెక్కలు ఉన్నాయి. మరి అలా కనుక జరగకపోతే బాలయ్య జగన్ని తప్పనిసరిగా కలవాల్సిందే. మరి ఆ అవసరం అపుడు పడుతుంది.

అయినా సరే హిందూపురం కోసమైనా బాలయ్య వెళ్ళి జగన్ని కలుస్తారా. ఆయన అలా కలిసేందుకు చంద్రబాబు అనుమతిస్తారా. చూడాలి. మొత్తానికి చూస్తే గత మూడేళ్ళుగా జగన్ని కలుస్తాను అన్న బాలయ్య డైలాగులు మాత్రం పక్కా రొటీన్ గానే మిగిలిపోతున్నాయని అంటున్నారు. ఈ ఇద్దరు కలిస్తే అది నిజంగా ఒక సంచలనం, తెలుగు మీడియా ఫోకస్ అంతా అటు వైపే ఉంటుంది. మరి ఆ రోజు ఎపుడు వస్తుందో చూడాలి. నందమూరి నట సింహం పులి వెందుల పులి బిడ్డతో భేటే అంటే ఇష్యూ ఏదైనా మీడియా షేక్ అయిపోదూ. మరి చూడాలి అది ఎపుడు జరుగుతుందో.