Begin typing your search above and press return to search.

షాక్‌: సోనూ నిగ‌మ్ మ‌ర్డ‌ర్ కు బాల్ ఠాక్రే ప్లానింగ్‌?

By:  Tupaki Desk   |   16 Jan 2019 6:25 AM GMT
షాక్‌: సోనూ నిగ‌మ్ మ‌ర్డ‌ర్ కు బాల్ ఠాక్రే ప్లానింగ్‌?
X
రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు.. ప్ర‌తివిమ‌ర్శ‌లు మామూలే. అయితే.. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శించే క్ర‌మంలో సంబంధం లేని ఇద్ద‌రు ప్ర‌ముఖుల్ని తీసుకురావ‌టం.. వారికి సంబంధించిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌టం చాలా అరుదుగా జ‌రుగుతుంటుంది. తాజాగా అలాంటిదే ఒక‌టి చోటు చేసుకుంది.

వివాదాస్ప‌దంగా మారిన ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. అంతేకాదు.. స‌ద‌రు నేత చేసిన వ్యాఖ్య‌ల‌కు సంబంధించి స‌రికొత్త వాద‌న‌లు తెర మీద‌కు వ‌స్తున్నాయి. ఇంత‌కీ ఎవ‌రా నేత‌? అంత వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు ఏం చేశార‌న్న విష‌యంలోకి వెళితే..

మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి నారాయ‌ణ్ రాణే కుమారుడు.. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నీలేశ్ రాణా షాకింగ్ వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన కార్య‌క్ర‌మంలో శివ‌సేన కార్య‌క‌ర్త వినాయ‌క్ రౌత్ త‌న తండ్రి మీద చేసిన వ్యాఖ్య‌ల‌పై గుర్రుగా ఉన్న ఆయ‌న‌.. ఏకంగా శివ‌సేన్ చీఫ్.. దివంగ‌త బాల్ ఠాక్రే మీద సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

త‌న తండ్రి గురించి త‌ప్పుగా మాట్లాడితే తాను నోరు విప్పాల్సి ఉంటుంద‌న్న నీలేశ్‌.. రాజ‌కీయంగా ఠాక్రే సాబ్ ను తాను ఇప్ప‌టివ‌ర‌కూ త‌ప్పు ప‌ట్ట‌లేద‌న్నారు. కానీ.. త‌న తండ్రిని త‌ప్పు ప‌ట్టిన‌ప్పుడు.. అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌ప్పుడు తాను కూడా గొంతు విప్పాల‌న్నారు. ఠాక్రే సాబ్ గురించి తాను ఎప్పుడూ త‌ప్పుగా మాట్లాడ‌న‌ప్పుడు త‌న తండ్రి గురించి త‌ప్పుగా మాట్లాడ‌టం స‌రికాద‌న్నారు. ఇంత‌కూ నీలేశ్ చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య ఏమంటే.. ప్ర‌ముఖ సింగ‌ర్ సోనూ నిగ‌మ్ ను బాల్ ఠాక్రే చంపాల‌ని కుట్ర ప‌న్నార‌ని.. అయితే ఠాక్రే కుటుంబానికి సోనూ నిగ‌మ్ కు సంబంధం ఏమిట‌న్న‌ది మాత్రం త‌న‌ను ప్ర‌శ్నించొద్ద‌న్నారు. ఇలాంటి నిజాలు తాను బ‌య‌ట‌పెట్ట‌గ‌ల‌న‌ని.. అందుకే త‌మ‌ను రెచ్చ‌గొట్టొద్ద‌ని.. త‌న తండ్రిని ఉద్దేశించి విమ‌ర్శ‌లు చేయొద్ద‌ని మండిపడ్డారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. శివ‌సేన పార్టీలో ఉన్న‌ప్పుడు నారాయ‌ణ్ రాణే మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. త‌ర్వాత రోజుల్లో ఆయ‌న శివ‌సేన నుంచి కాంగ్రెస్ కు షిఫ్ట్ అయ్యారు. ఈ నేప‌థ్యంలో రాణే కుటుంబానికి.. శివ‌సేన‌కు మధ్య మాట‌ల యుద్దం సాగుతూ ఉంటుంది. అయితే.. ఈసారి మాత్రం అది కాస్త శ్రుతిమించి ఎక్క‌డికో వెళ్లింది.