Begin typing your search above and press return to search.

బాబుకు బ్యాడ్ న్యూస్.. సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణ కన్నుమూత

By:  Tupaki Desk   |   6 May 2022 11:30 AM GMT
బాబుకు బ్యాడ్ న్యూస్.. సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణ కన్నుమూత
X
పార్టీ పెద్దది అయిపోతున్న కొద్దీ.. ఆ పార్టీకి చెందిన నేతలు పెద్ద వయస్కులైపోతుంటారు. అలాంటి సమయంలో ఎదురయ్యే విషాదాలు ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీకి తరచూ ఎదురవుతూ ఉన్నాయి. 1983లో స్వర్గీయ నందమూరి తారకరామారావు పార్టీ పెట్టి ఇప్పటికి నలబై ఏళ్లు అవుతోంది. అప్పట్లో నలభైల్లో ఉన్న వారు ఇప్పుడు ఎనభైల్లోకి వచ్చేస్తారు. దీంతో.. తరచూ విషాదాలు వినాల్సిన పరిస్థితి పార్టీకి ఎదురవుతూ ఉంటుంది. తాజాగా అలాంటి విషాదమే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎదురైంది.

పార్టీ సీనియర్ నేత.. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఇటీవల కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ మధ్యనే బొజ్జలకు పుట్టినరోజు శుభాకాంక్షల్ని స్వయంగా చంద్రబాబే వెళ్లి చెప్పి వచ్చారు. బొజ్జల మరణవార్త విన్నంతనే చంద్రబాబు తన సంతాపాన్ని తెలియజేశారు. బొజ్జలకు బాబు ప్రాణ స్నేహితుడన్న పేరుంది. గత నెలలో ఆయన పుట్టిన రోజునాడు బొజ్జల ఇంటికి వెళ్లిన బాబు కేక్ కట్ చేయించి వచ్చారు. అంతలోనే ఇలా జరగటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.

లాయర్ గా జీవితాన్ని ప్రారంభించిన బొజ్జల .. ఎన్టీఆర్ పిలుపుతో పార్టీలో చేరారు. శ్రీకాళహస్తి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. మంత్రిగా పని చేశారు. అలాంటి సీనియర్ నేత అకాల మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు.

బొజ్జల మరణం పార్టీకి తీరని లోటుగా అభివర్ణించారు. బొజ్జల మరణం గురించి సమాచారం తెలిసిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం స్పందించారు. తన తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ హయాంలో బొజ్జలతో పాటు కలిసి పని చేసిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు.

తనతో కలిసి పని చేసిన రాజకీయ సహచరుడ్ని.. ఆత్మీయ మిత్రుడ్ని తాను కోల్పోయినట్లుగా పేర్కొన్నారు. ఈ మధ్యన అనారోగ్యంతో బాధ పడుతున్న విషయం తెలిసి.. .ఆయన నివాసానికి వెళ్లి మరీ పలుకరించి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా బొజ్జలతో తనకున్న గురుతుల్ని గుర్తు చేసుకున్నారు. బొజ్జల కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

1989, 1994, 1998, 2009, 2014 లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగాగెలుపొందిన బొజ్జల..2004 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. 1994-2004 మధ్యన చంద్రబాబు మంత్రివర్గంలో ఐటీ మంత్రిగా.. రోడ్లు.. భవనాల శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో మాత్రం బొజ్జల ఎన్నికల బరిలోకిదిగలేదు. ఆయనకు బదులుగా ఆయన కుమారుడు సుధీర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు కానీ.. ఆయన ఓటమి పాలయ్యారు. మొత్తంగా చిత్తూరు జిల్లా రాజకీయాల్లోనూ.. ఏపీ రాజకీయాల్లోనూ ఒక సీనియర్ నేత శకం ముగిసింది.