Begin typing your search above and press return to search.

అన్ని అపశకునాలే.. తేడా కొడుతోందిగా మోడీషా?

By:  Tupaki Desk   |   12 Jan 2022 9:30 AM GMT
అన్ని అపశకునాలే.. తేడా కొడుతోందిగా మోడీషా?
X
గడిచిన ఏడాది మొదలు తాజాగా విడుదల అవుతున్న సర్వే నివేదికలు మొత్తం యూపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీజేపీ సర్కారేనని స్పష్టం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో మాదిరి అదిరే సీట్లు బీజేపీ సొంతం కాకున్నా.. కొన్ని సీట్లు చేజార్చుకున్నా.. అంతిమంగా గెలుపు మాత్రం కమలనాథులదేనని చెబుతూ సర్వే ఫలితాలు వెల్లడవుతున్నాయి. సర్వేల్లో పేర్కొన్నట్లుగా అంతా సానుకూల వాతావరణం నెలకొని ఉంటే.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు అందుకు భిన్నంగా ఎందుకు ఉంటున్నాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

మరో నెలలో మొదలయ్యే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు పక్కా అంటూ సర్వేల్లో వెల్లడవుతున్న రాష్ట్రాల్లో రెండింటి పేర్లను అందరు ప్రస్తావిస్తున్నారు. అందులో ఒకటి యూపీ కాగా.. రెండోది గోవా. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. దేశంలోనే అత్యంత పెద్ద రాష్ట్రం.. అత్యంత బుల్లి రాష్ట్రాల్లో ఒకటైనగోవా రెండింటిలోనూ బీజేపీ ప్రభుత్వం కొలువు తీరుతుందని.. మిగిలిన రాష్ట్రాలైన పంజాబ్.. మణిపూర్.. ఉత్తరాఖండ్ లలో ఫలితాలు కాస్త తేడా రావొచ్చన్న మాటను చెబుతున్నారు.

విచిత్రమైన విషయం ఏమంటే.. గెలుపు పక్కా అని చెబుతున్న గోవా.. యూపీ రాష్ట్రాల్లో.. భిన్నమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటికి నిన్న గోవాలో ఒక మంత్రి.. ఒక బీజేపీ ఎమ్మెల్యే కాంగ్రెస్ తీర్థం తీసుకోవటం తెలిసిందే. యూపీలోనూ అలాంటి పరిస్థితే నెలకొంది. పలువురు బీజేపీ నేతలు..సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎస్పీలోకి వెళ్లటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

మరోవైపు కీలకమైన ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. బీజేపీ నమ్మకాలన్ని పెట్టుకున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ఆరోగ్య పరిస్థితిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు.. ఎంపీ రాధామోహన్ సింగ్ కరోనా బారిన పడటమే ఇందుకు కారణం.

యూపీ సీఎం యోగితో కలిసి ఎన్నికల సమావేశంలో గంటల పాటు ఆయనతో గడిపిన కొంత సేపటికే ఆయన పాజిటివ్ గా తేలింది. దీంతో.. యోగి ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం యోగి పక్కనే కూర్చున్న రాధామోహన్ సింగ్.. అభ్యర్థుల ఖరారీపై జరిగిన కీలక సమావేశంలో పక్కపక్కనే కూర్చున్నట్లు చెబుతున్నారు.

మరోవైపు యూపీ ముఖ్యమంత్రి యోగి.. డిప్యూటీ ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య.. యూపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. అదే సమావేశానికి పలు పార్టీలకు చెందిన వారు హాజరయ్యారు. తాజాగా రాధామోహన్ కు పాజిటివ్ కావటంతో.. బీజేపీ నాయకత్వానికి ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది.

ముఖ్యమంత్రి యోగి మొదలుకొని కీలక నేతలంతా కరోనా బారిన పడితే.. కీలకమైన పది రోజుల సమయం ఐసోలేషన్ కే సరిపోతుంది. అదే నిజమైతే.. పెద్ద ఎత్తున నేతలకు కరోనా ఖాయమంటున్నారు. అదే జరిగితే కీలకమైన యూపీ ఎన్నికల వేళ.. పార్టీకి ఇబ్బందులు తప్పవన్న మాట వినిపిస్తోంది.

దీనికితోడు.. యోగి మీద ఉన్న గుర్రుతో టైం కోసం చూస్తున్న నేతల్లో పలువురు ఇతర పార్టీల వైపు చూస్తున్నారన్న మాట వినిపిస్తోంది. ఇదే నిజమైతే.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలు ఏవీ కూడా మంచి శకునాలుగా కనిపించకపోవటం గమనార్హం. సర్వే అంచనాలకు భిన్నంగా శకునాలు ఉండటం విశేషం. ఇదంతా చూస్తుంటే.. ఏదో తేడా కొడుతున్నట్లు అనిపించట్లేదు మోడీజీ?