Begin typing your search above and press return to search.

వలసల పై ట్రంప్ కు కోర్టులో ఎదురుదెబ్బ

By:  Tupaki Desk   |   6 Dec 2020 4:24 AM GMT
వలసల పై ట్రంప్ కు కోర్టులో ఎదురుదెబ్బ
X
వలసల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంత కఠినంగా వ్యవహరిస్తారో తెలిసిందే. దేశంలో అక్రమంగా ఉన్న వారి విషయంలో ఆయన ఇప్పటికే పలు చట్టాలు చేసి.. వారిపై చర్యలకు ఉపక్రమించటం తెలిసిందే. మైనర్లుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులతో పాటు అక్రమంగా అమెరికాకు వచ్చిన వారి రక్షణ విషయంలో ట్రంప్ ప్రభుత్వం తీరు భిన్నంగా ఉండేది. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై తాజాగా కోర్టులో షాక్ తగిలింది.

అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారి విషయంలో ఒబామా ప్రభుత్వం చేపట్టిన వలస విధానాన్ని పునరుద్ధరించాలని అమెరికా ఫెడరల్ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. భారత్ తో సహా వివిధ దేశాల నుంచి అమెరికాకు అక్రమంగా వచ్చిన చిన్నారులకు రక్షణ కలుగ నుంది. ఒబామా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేయటానికి ట్రంప్ సర్కారు మూడేళ్ల క్రితం ప్రయత్నించగా.. అప్పట్లో కోర్టు దాన్ని నిలిపేసింది.

తాజాగా ఈ అంశంపై ఫెడరల్ కోర్టు స్పందిస్తూ.. మరో రెండేళ్ల పాటు ఒబామా విధానాన్ని అనుసరించాలని పేర్కొంది. చట్టపర రక్షణ కోసం వలసదారులు చేసుకునే దరఖాస్తుల్ని సోమవారం నుంచి తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. 2017 నుంచి అప్లికేషన్లు తీసుకోవటం ట్రంప్ సర్కారు నిలిపివేసింది. తాజాగా కోర్టు ఆదేశాల నేపథ్యంలో చిన్నతనంలో తల్లి దండ్రులతోపాటు అమెరికాలోకి అక్రమంగా వచ్చిన వారికి రక్షణ కలుగుతుంది. వారి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్న కోర్టు నిర్ణయం వారికి సాంత్వన కలిగించటం ఖాయం. ఒక నివేదికప్రకారం భారత్ నుంచే ఇలాంటి వారు 6.30లక్షల మంది ఉంటారని చెబుతారు. ఇలాంటివారెందరికో కోర్టు నిర్ణయం ఊరట కలిగించనుంది.