Begin typing your search above and press return to search.

రాయలసీమ ఎత్తిపోతలపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ .. హరిత ట్రైబ్యునల్ కీలక ఆదేశాలు

By:  Tupaki Desk   |   29 Oct 2020 9:40 PM IST
రాయలసీమ ఎత్తిపోతలపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ .. హరిత ట్రైబ్యునల్ కీలక ఆదేశాలు
X
రాయలసీమ వాసుల తాగు, సాగునీటి ప్రయోజనాలు తీరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకానికి వరుసగా అన్ని అడ్డంకులే తగులుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం, కృష్ణాబోర్డు మెలికలు పెడుతుండగా , ఇప్పుడు కేంద్రం కూడా జగన్‌ సర్కారు కు షాక్ ఇచ్చినట్టే తెలుస్తుంది. రాయలసీమ లిఫ్ట్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఓ కేసును విచారించిన జాతీయ హరిత ట్రైబ్యునల్‌ తన తాజా ఉత్తర్వుల్లో మరో బ్రేక్‌ వేసింది.

కేంద్ర జల్‌శక్తి శాఖ ఇచ్చిన అఫిడవిట్‌ ఆధారంగానే జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఈ తీర్పు ఇవ్వడంతో కేంద్రం తీరుపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టొద్దని.. పర్యావరణ అనుమతులు తప్పనిసరి అని జస్టిస్ రామకృష్ణన్, నిపుణుడు సైబల్ దాసు గుప్తలతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. పాత ప్రాజెక్టు అనే ఏపీ వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం.. డీటైల్ట్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీ.పీ.ఆర్), ప్రాజెక్టు సంబంధిత అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టొద్దని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్దేశించిన విషయాన్ని కూడా ప్రస్తావించింది

కృష్ణానదిలో ఏపీ వాటాగా ఉన్న మిగులు జలాలను వాడుకునేలా ఏపీ సర్కార్ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పై తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ఏపీ వాటాకు మించి నీటిని తోడుకునేందుకు ఇది వీలు కల్పిస్తుందని తెలంగాణ వాదిస్తోంది. సరిగ్గా ఇదే అభ్యంతరాలతో జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో దాఖలైన కేసును విచారించిన ఎన్టీటీ చెన్నై ధర్మాసనం కేంద్రం అభిప్రాయం కోరింది. దీనికి సమాధానంగా జల్‌శక్తి మంత్రిత్వశాఖ దాఖలు చేసిన అఫిడవిట్‌ ఆధారంగా ఎన్జీటీ నేడు కీలక ఆదేశాలు జారీ చేసింది.

పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్‌పై ముందుకెళ్లొద్దని ఏపీ ప్రభుత్వానికి హరిత ట్రైబ్యునల్‌ తన తాజా తీర్పులో ఆదేశాలు ఇచ్చింది. ప్రాజెక్టు డీపీఆర్‌ సమర్పించి అనుమతులు తీసుకోవాల్సిందేనని జగన్‌ సర్కారుకు స్పష్టం చేసింది. రాయలసీమ లిఫ్ట్‌ ద్వారా తాగునీటి, సాగునీటి అవసరాలు తీరే అవకాశం ఉన్నందున పర్యావరణ అనుమతుల్లేకుండా ప్రాజెక్టు నిర్మించడం సరికాదని ఎన్జీటీ అభిప్రాయపడింది. దీనితో ప్రభుత్వం ఈ మేరకు ఆ అనుమతుల కోసం ప్రయత్నం చేయాల్సి ఉంది.

రాయలసీమ లిఫ్ట్‌ను ఎలాగైనా నిర్మించి తీరాలని పట్టుదలగా ఉన్న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఆ మేరకు సహకారం లభించడం లేదు. ముఖ్యంగా కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్.. జగన్‌ తో గతంలో భేటీలోనూ కీలకమైన పోలవరం, రాయలసీమ లిఫ్ట్‌ పై హామీలిచ్చినా అటు జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు పంపిన అఫిడవిట్‌లో మాత్రం పర్యావరణ అనుమతులు తప్పనిసరని కుండబద్దలు కొట్టేశాడు. దీనితో ఆ పత్రాలు లేకుండా ప్రాజెక్టుకు తాము కూడా క్లియరెన్స్‌ ఇవ్వలేమని హరిత ట్రైబ్యునల్‌ స్పష్టం చేసింది.