Begin typing your search above and press return to search.

లోకేశ్ మెజార్టీపై లెక్కలు మొదలైపోయాయ్

By:  Tupaki Desk   |   7 April 2016 7:49 AM GMT
లోకేశ్  మెజార్టీపై లెక్కలు మొదలైపోయాయ్
X
‘ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం’ అన్న పామెత వినే ఉంటారు. ఏపీ టీడీపీలో ఇప్పుడు అలాంటి వ్యవహారమే కనిపిస్తోంది. టీడీపీ అధినేత - సీఎం చంద్రబాబు కుమారుడు యువనేత లోకేశ్ ను కేబినెట్ లోకి తీసుకుంటారన్న ప్రచారం గత కొద్దిరోజులుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన్ను కేబినెట్ లోకి తీసుకోవడం కోసం ఎమ్మెల్సీని చేస్తారని... ఎమ్మెల్యేగా పోటీచేయిస్తారని రకరకాలుగా టాక్ వినిపిస్తుంది. అసెంబ్లీలోకా... మండలిలోకా? ఎక్కడికి ఎన్నికవుతారన్నది ఇంకా తేలనప్పటికీ లోకేశ్ కు ఎంత మెజార్టీ వస్తుందన్న అంచనాలు, గొప్పలు మొదలైపోయాయి.

లోకేశ్ కోసం తమ ఎమ్మెల్సీ స్థానాలను వదులకుంటామని బుద్దా వెంకన్న - సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి వంటివారు ముందుకు రాగా అదేమీ కాదు ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తారన్న వాదన వినిపిస్తోంది. పెనమలూరు నుంచి పోటీ చేస్తారని... అక్కడి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆయన కోసం రాజీనామా చేస్తారని ఒక ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో లోకేశ్ అసెంబ్లీకి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తున్న తరుణంలో ఆయనకు వచ్చే మెజార్టీపై అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. తాజాగా టీడీపీ నేత - ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ లోకేశ్ ఎక్కడ పోటీ చేసినా ఆయనకు లక్ష ఓట్లకు తగ్గకుండా మెజారిటీ వస్తుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ తాతదేనని - రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఆయన పోటీ చేసినా, లక్ష ఓట్లకు పైగా మెజారిటీ ఖాయమని రాజేంద్రప్రసాద్ అన్నారు.

అంతేకాదు.... కృష్ణా జిల్లాలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచైనా లోకేష్ బరిలోకి దిగి గెలుస్తారని ఢంకా బజాయించి చెబుతున్నారు. ఆయనకు క్యాబినెట్ లో మంత్రి పదవి ఇస్తే, యువతకు ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లవుతుందని అన్నారు. చంద్రబాబునాయుడి కృషితో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళుతోందని వ్యాఖ్యానించారు. ఇదంతా బాగానే ఉన్నా కృష్ణా జిల్లాలో ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తారన్న మాటకు టీడీపీలో ఓ వర్గం పెడార్థాలు తీస్తోంది. అంటే... మిగతా జిల్లాల నుంచి పోటీ చేస్తే లోకేశ్ గెలవరా అంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా టీడీపీలో యువరాజు కోసం అప్పుడే మెజారిటీ లెక్కలు మొదలవడంతో అభిమానులకు మాట్లాడుకోవడానికి మంచి టాపిక్ దొరికినట్లయింది.