Begin typing your search above and press return to search.

మిమ్మల్ని మీరు వేసుకోవాల్సిన ప్రశ్న.. ప్రజలకు వేస్తే ఎలా బాబు?

By:  Tupaki Desk   |   8 Aug 2020 6:15 AM GMT
మిమ్మల్ని మీరు వేసుకోవాల్సిన ప్రశ్న.. ప్రజలకు వేస్తే ఎలా బాబు?
X
సవాలు విసరటం పెద్ద విషయం కాదు. దానికి కట్టుబడి ఉండటంతో వచ్చే చిక్కులు అన్ని ఇన్ని కావు. ఇప్పుడు అలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారు టీడీపీ అధినేత..ఏపీ విపక్ష నేత చంద్రబాబు. మూడు రాజధానుల వ్యవహారంలో ఇటీవల ఆయన చేసిన సంచలన సవాలుకు కట్టుబడకుండా.. మాట తిప్పేసిన ఆయన.. ఇప్పుడు తన పాలనలో రాష్ట్రానికి ఏమేం చేశానన్న విషయాన్ని చెప్పుకునే ప్రయత్నంలో మునిగిపోయారు.

ఉమ్మడి రాష్ట్రంలో తాను తొమ్మిదిన్నరేళ్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారని అప్పుడు హైదరాబాద్ లో తనకెవరు కులాన్ని అపాదించలేదన్నారు. అక్కడ లేని కులం అమరావతిలో ఎలా వచ్చింది? అని ప్రశ్నించారు. అయితే.. ఈ విషయంలో బాబు ఎవరికో ఈ ప్రశ్న వేసే కంటే.. తనను తాను ప్రశ్నించుకుంటేనే మరింత ప్రయోజనం ఉంటుందని చెప్పాలి.

2004 ముందు తొమ్మిదిన్నరేళ్లు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వేళలో.. తన కులానికి బాబు ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదని చెబుతారు. కీలక స్థానాల్లో వారి హవా నడపటం.. జిల్లాల్లోనూ వారి ప్రాధాన్యత పెరగటాన్ని మర్చిపోలేమని చెబుతారు. దీనికి తోడు తమకు లభించిన రాజకీయ అధిక్యత విషయాన్ని ప్రజల ముందు ప్రదర్శించే విషయంలో బాబు చేసిన తప్పులు.. తర్వాతి కాలంలో ఆయన్ను వెంటాడాయని చెప్పక తప్పదు.

2004లో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక.. కానీ అప్పటివరకు నిద్రాణంగా ఉన్న వివిధ వర్గాలు ఒక్కసారి ఉత్తేజితం కావటం.. తొమ్మిదిన్నరేళ్ల పాటుతమను తొక్కేశారన్న వేదన బాహాటంగా వ్యక్తమైంది. 2014 ఎన్నికల తర్వాత.. ఐదేళ్ల వ్యవధిలో ఏపీలో కులతత్త్వాన్ని తగ్గించే కన్నా.. దాన్ని పెంచి పోషించేలా చేయటంలో బాబు కీలకమన్న వాదన బలంగా వినిపిస్తుంటుంది. దీనికితోడు.. తొమ్మిదిన్నరేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సోషల్ మీడియా ఇంతలా విస్తరించి లేదు. దీంతో.. సమాజంలో మొదలైన రుగ్మత బయటకు రావటానికి టైం పడుతుంది. పాలకులు చేసిన తప్పులు పండటానికి కొంత సమయం తీసుకునేది.

ఇప్పుడు అలా కాదు.. ఏదైనా ఘటన జరిగితే.. కోట్లాది మంది ప్రజలు సోషల్ మీడియా వేదికల ద్వారా చెప్పేస్తున్నారు. వీడియోలు పెట్టేస్తున్నారు. ఇలాంటి వేళలో గతంలో మాదిరి మాట్లాడితే కుదరదన్న విషయాన్ని మర్చిపోకూడదు. గతంలో లేని కులాన్ని ఇప్పుడే ఎందుకు ఆపాదిస్తున్నారనే ప్రశ్న బాబు వేసే కన్నా.. తనకు తాను తన మనసాక్షిని ప్రశ్నించుకుంటే.. చాలా విషయాల మీద బాబుకు క్లారిటీ రావటం ఖాయం. ముందా పని చేస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.