Begin typing your search above and press return to search.

కలయికపై చంద్రబాబు క్లారిటీ.. సరైన టైంలో సరైన మాట

By:  Tupaki Desk   |   22 Dec 2022 4:13 AM GMT
కలయికపై చంద్రబాబు క్లారిటీ.. సరైన టైంలో సరైన మాట
X
విడిగా ఉన్నాం. కలిశాం. మళ్లీ విడిపోయాం. ఇక్కడితో కథ ముగిసినట్లే. మళ్లీ కలవాలనుకోవటానికి మించిన అర్థం లేని మాట మరొకటి ఉండదు. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. కాలం చెప్పిన అనుభవ పాఠాల్ని చూస్తే.. విడిపోయి కలిసి ఉండటానికి మించింది మరొకటి ఉండదు.కానీ.. ఇంతకాలం కామ్ గా ఉండి.. ఈ మధ్యనే రెండు తెలుగు రాష్ట్రాలు కలిసిపోవాలంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహిత సలహాదారు అయిన సజ్జలవారి నోటి నుంచి వచ్చిన మాట వేళ.. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన సమాధానం చూసినప్పుడు.. సరైన సమయంలో సరైన మాట బాబు నోటి నుంచి వచ్చిందని చెప్పాలి.

తాజాగా ఖమ్మంలో నిర్వహించిన శంఖారావం సభకు భారీగా హాజరైన జనాన్ని చూసిన రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. తెలంగాణలో టీడీపీ ఖతమైందన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. అందుకు భిన్నంగా భారీగా జరిగిన ఖమ్మం సభతో టీడీపీకి కొత్త జోష్ వచ్చినట్లుగా చెప్పాలి. ఇలాంటి వేళ.. అంతటి జనసమూహాన్ని చూసిన చంద్రబాబు ఏ మాత్రం బ్యాలెన్స్ మిస్ కాకుండా.. అందరి మనసుల్ని దోచుకునే కీలక వ్యాఖ్య చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరికి వారుగా డెవలప్ కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి.. 'కొందరు సిగ్గు లేకుండా రెండు రాష్ట్రాలు కలవాలనుకుంటున్నారు. కానీ.. రెండు రాష్ట్రాలు డెవలప్ కావటమే మా విధానం' అంటూ స్పష్టమైన వ్యాఖ్య చేశారు. అంతేకాదు.. తెలంగాణకు తమ ప్రభుత్వం ఏం చేసిందన్న దానికి బదులుగా.. ధీటైన సమాధానం చెప్పారు.

టీడీపీ పాలనలనే తెలంగాణ డెవలప్ మెంట్ జరిగిందన్న చంద్రబాబు.. ''సాగర్‌ ఎడమ కాలువ అభివృద్ధితోపాటు ఎస్‌ఆర్‌ఎస్పీ దేవాదుల, ఎస్‌ఎల్‌బీసీ, భీమా, నెట్టెంపాడు లాంటి ప్రాజెక్టులు నిర్మించాం. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ నివారణకు తాగునీటి పథకాలు కల్పించాం. ఖమ్మం జిల్లాలో దుమ్ముగూడెం లాంటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశాం. మా హయాంలో భద్రాచలంలో నిర్మించిన కరకట్ట వల్లే వరదల నుంచి పట్టణం క్షేమంగా బయటపడింది. ఐటీకి నగరాన్ని కేరాఫ్ అడ్రస్ గా నిలిపాం' అంటూ తన ప్రభుత్వంలో సాధించిన వాటి గురించి ప్రస్తావించారు.

రెండు తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లు లాంటివని విభజన వేళలో చంద్రబాబు అన్నప్పుడు ఎవరెంతలా కామెడీ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది తాను అన్న మాట అక్షర సత్యమన్న విషయాన్ని తాజాగా చంద్రబాబు తన నోటి మాటతో స్పష్టం చేశారని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డ మీదనేనని.. హైదరాబాద్ లోనే అన్న ఆయన.. పార్టీని విడిపోయిన వారంతా తిరిగి వచ్చేయాలన్న పిలుపును ఇచ్చారు.

మొత్తంగా తెలంగాణ విషయంలో తాను ఎంత క్లారిటీగా ఉన్నానన్న విషయాన్ని చంద్రబాబుతన తాజా మాటలతోస్పష్టం చేశారని చెప్పాలి. ఏమైనా.. రెండు తెలుగు రాష్ట్రాలు కలవాలన్న మాటను తీవ్రంగా తప్పు పడటం ద్వారా.. సరైన సమయంలో సరైన మాట బాబు నోటి నుంచి వచ్చిందని చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.