Begin typing your search above and press return to search.

అసలు విషయాన్ని మరిచి అందరిచేత తిట్లు తింటున్న బాబు

By:  Tupaki Desk   |   27 Nov 2019 2:30 PM GMT
అసలు విషయాన్ని మరిచి అందరిచేత తిట్లు తింటున్న బాబు
X
ఏపీలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పని చేసిన ట్రాక్ రికార్డు.. తెలుగు నేల మీద చిత్రవిచిత్రమైన రాజకీయాల్ని.. మాయోపాయాల్ని పరిచయం చేసిన పెద్ద మనిషిగా టీడీపీ అధినేత చంద్రబాబుకు పేరుంది. గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఆయన పెద్ద ఎత్తున పరుష వ్యాఖ్యల్ని పడాల్సి వస్తుంది. సాధారణంగా ఆయన వయసున్న నేతల్ని మాట అనే ముందు కాస్త ఆలోచిస్తారు.

కానీ.. అందుకు భిన్నంగా మాటలు పడుతున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ నాలుగు మాటలు అనటాన్ని అంతో ఇంతో అర్థం చేసుకోవచ్చు. కానీ.. ఆ మధ్య వరకూ టీడీపీలో ఉండి..తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి అయిన కొడాలి నాని నోట వెంట తీవ్రపదజాలంతో వ్యాఖ్యలు రావటాన్ని ఎలా చూడాలి? రాజకీయాల్లో తలపండినట్లుగా తన గురించి తాను గొప్పలు చెప్పుకునే చంద్రబాబు.. ఇన్నేసి మాటలు ఎందుకు పడుతున్నట్లు? అన్నది అసలు ప్రశ్న.
ప్రజల్లో ఉండే పలుకుబడి నేతల మీద ఎన్నేసి మాటలు అనేందుకైనా అవకాశం ఇస్తుంది. ప్రజల్లో సానుకూలత ఉన్న వేళలో నేతను ఇష్టారాజ్యంగా తిట్టేసి మైలేజీ రాదు కదా? సదరు నేత మీద సానుభూతి పెరుగుతుంది. అరే.. అంత పెద్ద మనిషి ముందు ఇంత దురుసుగా వ్యవహరిస్తారా? ఇన్నేసి మాటలు అంటారా? కనీసం మనిషికి కాకున్నా.. వయసుకు మర్యాద, గౌరవం ఇవ్వరా? అన్న వాదనలు వినిపిస్తాయి.

కానీ.. ప్రజల్లో ఆదరణ లేని నేత మీద వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అందరూ విరుచుకుపడుతుంటారు. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాంటి దుస్థితినే ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ప్రజలు ఛీ కొట్టి తిరస్కరించిన తర్వాత.. కొత్త ప్రభుత్వానికి కాస్త టైమిచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఒకవేళ జగన్ ప్రభుత్వం చేసే తప్పుల కారణంగా ప్రజల్లో వ్యతిరేకత పెరిగితే.. అలాంటి వేళలో తెర మీదకు వచ్చి తీవ్ర విమర్శలు చేస్తే అర్థముంటుంది?

అందుకు భిన్నంగా అధికారం చేపట్టిన వారం నుంచే విమర్శలు చేయటం.. తప్పులు ఎత్తి చూపించటం.. గొప్పలు చెప్పుకోవటం లాంటివి అధికారపక్షాన్నే కాదు.. ప్రజల్లోనూ కోపం కలిగేలా చేస్తాయి. తిట్టే నోరు.. తిరిగే కాలు ఊరుకోదన్నట్లుగా అదే పనిగా జగన్ మీద విషం చిమ్మటం.. ప్రతి పనిలోనూ తప్పులు వెతికి రాజకీయ మైలేజీ పొందాలన్న ఆరాటంతో తప్పుల మీద తప్పులు చేస్తున్న చంద్రబాబు.. అందరి చేత మాట పడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరింత విచిత్రం ఏమంటే.. చంద్రబాబును అన్నేసి మాటలు అంటున్నా ప్రజల్లో ఎలాంటి సానుభూతి రాకపోగా.. చేసుకున్నోడికి చేసుకున్నంత అంటూ వ్యాఖ్యలు చేయటం కనిపిస్తుంది. ప్రజలమూడ్ ను గుర్తించి.. అందుకు తగ్గట్లు వ్యవహరించాలన్న విచక్షణ మిస్ కావటం బాబు ఫెయిల్యూర్ గా చెప్పక తప్పదు.అదే ఆయన్ను అందరి చేత మాటలు అనేలా చేస్తుందని చెప్పకతప్పదు.