Begin typing your search above and press return to search.

బాబు దీక్ష ప్ర‌జా స‌మ‌స్యా... పార్టీ స‌మ‌స్యా...!

By:  Tupaki Desk   |   6 Nov 2019 4:31 AM GMT
బాబు దీక్ష ప్ర‌జా స‌మ‌స్యా... పార్టీ స‌మ‌స్యా...!
X
ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ దీక్ష‌ల‌కు రెడీ అయ్యారు. గ‌తంలో ఆయ‌న అధికారంలో ఉన్న స‌మ‌యంలోనే ప్ర‌త్యేక హోదా కోసం అంటూ..కేంద్ర ప్ర‌భుత్వంపై క‌త్తి దూశారు. అయితే, అది విఫ‌ల‌మైంది. కానీ, ప్ర‌జ‌ల ధ‌నం మాత్రం మంచి నీళ్ల ప్రాయంగా ఖ‌ర్చ‌యింది. ఈ విష‌యంపై ఇటీవ‌ల కోర్టు కూడా త‌ప్పుబ‌ట్టింది. అయితే. ఇప్ప‌డు.. మ‌రోసారి చంద్ర‌బాబు దీక్ష‌లంటూ.. రోడ్డెక్కేందుకు రెడీ అయ్యారు. ఇది రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం రేపుతుందా? లేదా ? అనేది చూడాలి. అయితే, దీక్ష‌కు ముందు వెనుక బాబు ప్ర‌యోజ నాలేంటి? ఆయ‌న ఏ ఉద్దేశంతో దీక్ష‌కు రెడీ అయ్యారు? ఏం ఆశిస్తున్నారు? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి.

విష‌యంలోకి వెళ్తే.. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఇసుక తుఫాన్ రేగింది. గ‌డిచిన మూడు మాసాలుగా రాష్ట్రంలో ఇసుక ల‌భ్య‌త భారీగా ప‌డిపోయింది. దీంతో భ‌వ‌న నిర్మాణ రంగంపై ఆధార‌ప‌డి బ‌తుకుతున్న ల‌క్ష‌ల మంది కార్మికులు ఇబ్బందులు ప‌డేలా చేస్తోంది. ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం కూడా అంగీక‌రించింది. అయితే, గ‌డిచిన ప‌ది సంవ‌త్స‌రాల్లో ఎన్న‌డూ లేని విధంగా వ‌ర‌ద‌లు, వ‌ర్షాలు రావ‌డంతో న‌దులు నిండిపోయాయి. దీంతో ఇసుక ల‌భ్య‌త త‌గ్గిపోయింది. ఒక‌వేళ ఇసుక ఉన్నా తీయ‌లేని ప‌రిస్థితి . ఈ విష‌యం అందిర‌కీ తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఏదో విధంగా విరుచుకుప‌డాల‌ని, త‌మ డ్యూటీ తాము చేయాల‌ని భావి స్తున్న రాజ‌కీయ ప‌క్షాలు ఈ అంశాన్ని అందిపుచ్చుకుని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే అటు బీజేపీ, ఇటు జ‌న‌సేన‌, మ‌రోప‌క్క‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలు ఇసుక‌ను భుజాన వేసుకుని ప్ర‌జ‌ల్లో మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టేందుకు ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో తాము పోగొట్టుకున్న ప్ర‌జాభిమానాన్ని తిరిగి పొందేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ క్ర‌మంలో బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన‌లు పోటీ ప‌డుతున్నాయి. మా క‌న్నా ఎవ‌రూ ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌లేదు. మా ఉద్య‌మం కార‌ణంగానే ప్ర‌భుత్వం దిగి వ‌చ్చి ఇసుక‌ను ప్ర‌జ‌ల‌కు అందిస్తోంది (వాస్త‌వానికి ప్ర‌భుత్వ‌మే డెడ్‌లైన్ పెట్టుకుంది. వారం రోజుల్లో లేదా ఈ నెలాఖ‌రునాటికి ఇసుక‌ను ఇవ్వ‌నుంది) అని డ‌ప్పుకొట్టుకునేందుకు పార్టీలు పోటీ ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆయా పార్టీలు పోటీ ప‌డుతున్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ సంక‌ల్ప‌యాత్ర‌లు చేస్తూనే ఈ విష‌యంపై రాష్ట్ర జాతీయ నేత‌ల‌తో విమ‌ర్శ‌లు గుప్పించింది. ఇక రెండు రోజుల కింద‌ట విజ‌య‌వాడ‌లో ఇసుక స‌త్యాగ్ర‌హం పేరుతో నాయ‌కులు రోడ్డెక్కారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా విశాఖ‌లో లాంగ్ మార్చ్ చేశాడు. దీనికి కూడా మంచి స్పంద‌నే వ‌చ్చింది. ఇక‌, ఎటొచ్చీ.. చంద్ర‌బాబు వీరి క‌న్నాముందుగానే ఇసుక కోసం రాష్ట్ర వ్యాప్తంగా త‌మ్ముళ్ల‌ను రోడ్డుపైకి పంపినా.. బీజేపీ, జ‌న‌సేనల దెబ్బ‌తో అవి పాత‌బ‌డిపోయాయి. దీంతో ఆయ‌న త‌న చేయి పైచేయి కావాల‌నే ల‌క్ష్యంతో ఇప్పుడు ఈ నెల 14(అంటే ప్ర‌భుత్వం విధించుకున్న డెడ్‌లైన్‌కు ద‌గ్గ‌ర‌గా) విజ‌య‌వాడ వేదిక‌గా దీక్ష‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. మొత్తానికి ప్ర‌జా స‌మ‌స్య ఎలా ఉన్నా.. పార్టీల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకునేందుకు బాబు చేస్తున్న ప్ర‌య‌త్నంగా దీనిని భావిస్తున్నారుప‌రిశీల‌కులు.