Begin typing your search above and press return to search.

పీవీ నరసింహరావు తప్పు చేశారంటున్న ప్రణబ్

By:  Tupaki Desk   |   29 Jan 2016 11:58 AM GMT
పీవీ నరసింహరావు తప్పు చేశారంటున్న ప్రణబ్
X
రాష్ట్రపతి ప్రణబ్ తన తాజా పుస్తకంలో పీవీ నరసింహరావు ప్రభుత్వంలో అంశాలను వివరించారు. బాబ్రీ మసీదు కూల్చివేతను నిలువరించలేకపోవడం అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావుకు చెందిన అతిపెద్ద వైఫల్యంగా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వ్యాఖ్యానించారు. మసీదు కూల్చివేత దేశ - విదేశాల్లో ముస్లిముల మనోభావా లను తీవ్రంగా గాయపరిచిందని ఆయన అన్నారు. పుస్తకంలో ఆయన ఏం రాశారంటే... ''ఆ రోజు అంటే 1992, డిసెంబర్‌ ఆరో తేదీన నేను బాంబేలో ఉన్నాను. ప్రణాళిక సంఘంలో నాకు స్పెషల్‌ డ్యూటీ ఆఫీసర్‌ గా జైరామ్‌ రమేశ్‌ ఉన్నారు. సరిగ్గా భోజనం చేస్తుండగా ఆయన్నుంచి ఫోన్‌ వచ్చింది. బాబ్రీ మసీదు కూల్చివేత గురించి నాకు చెప్పారు. ఫోనులో విన బడుతున్నది నమ్మలేక పోయాను. అంత పెద్ద కట్టడం ఎలా కూలిపోయిందని నేను అదేపనిగా జైరామ్‌ ను అడిగాను. జరిగి పరిణామాలన్నింటిని ఆయన నాకు ఓపిగ్గా వివరించారు. అదే రోజు సాయంత్రానికి నేను ఢిల్లికి తిరిగి వెళ్లాలి. కానీ అప్పటికే ఉత్కంఠభరితమైన వాతావరణంలో బాంబే అట్టుడికిపోతోంది'' అని రాసుకొచ్చారు. అంతేకాదు... ''బాబ్రీ మసీదు కూల్చివేత దారుణమైన వంచన, విశ్వాస ఘాతుకానికి నిలువటద్దం. భారతీయులందరూ సిగ్గుతో తల దించుకోవాల్సిన మతిమాలిన చర్య అది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ ధార్మిక కట్టడాన్ని కూల్చివేశారు. దేశ విదేశాల్లో ఉంటున్న ముస్లిముల మనోభావాలను అది దారుణంగా గాయపరిచింది. భారతదేశం అన్ని మతాల ప్రజలు శాంతి - సౌభ్రాతృత్వాలతో కలిసిమెలసి జీవిస్తున్న కర్మభూమి. సహనం - భిన్నత్వాలకు ప్రతీక. అలాంటి భారత్‌ ప్రతిష్ట మంటగలసిపోయింది'' అని పేర్కొన్నారు.

''మసీదు కూల్చివేతకు పీవీని(అప్పటి ప్రధాని పి.వి. నరహింహరావు) తప్పుపట్టినవారు కోకొల్లలు. అప్పట్లో నేను మంత్రిని కాను. ఆ విధంగా నిర్ణయం తీసుకోవడంలో భాగ స్వామిని కాలేదు. అయితే గత్యంతరం లేకనే కేంద్ర ప్రభుత్వం అలా వ్యవహ రించిందని నమ్ముతున్నాను. బాబ్రీ మసీదుకు కాపుగాయలేదేమో? అన్న అనుమానంతో కేంద్ర ప్రభుత్వ ఉన్నపళంగా ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయలేదు. అదీగాక జాతీయ సమగ్రతా మండలి సమావే శాల్లో మసీదును పరిరక్షిస్తామని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం పక్కాగా హామీ ఇచ్చింది. సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్‌ కూడా ఇచ్చింది. కేంద్రం ఆర్టికల్‌ 356 కింద రాష్ట్ర ప్రభుత్వా న్ని రద్దు చేయవచ్చు కదా అని జనం వాదిస్తుంటారు. రాష్ట్ర పతి పాలనకు పార్లమెంట్‌ ఎలా ఆమోదం తెలుపుతుంది? రాజ్యసభలో కాంగ్రెస్‌ పార్టీకి ఆధిక్యత లేదు కదా! బాబ్రీ మసీదు కూల్చివేతను నిలువ రించడంలో అశ క్తత... పీవీ పాల్పడిన అతి పెద్ద వైఫల్యాల్లో ఒకటి. ఇతర రాజకీయ పక్షాలతో గట్టిగా మంతనాలు జరిపే బాధ్యతను యూపీలో రాజకీ యాల గురించి బాగా తెలిసిన ఎన్‌.డి. తివారి లాంటి అనుభవజ్ఞులైన నేతలకు అప్పగించాల్సి ఉండాల్సింది. హోమ్‌ మంత్రి ఎస్‌.బి.చవాన్‌ మంతనాలు సాగించడంలో ఘనాపాఠి. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో భావోద్వేగ కోణాలను ఆయన గుర్తించలేక పోయారు. రంగరాజన్‌ కుమార మంగళం చిత్తశుద్ధితో పనిచేశారు. కానీ ఆయన యువకుడు, అనుభవం లేనివాడు... అంతేకాక తొలిసారిగా కేంద్ర సహాయ మంత్రిగా నియమితుడైనవాడు కావడంతో ఏమీ చేయలేకపోయారు'' అని రాశారు.

ఆ తరువాత చాలాకాలానికి ఒక ప్రైవేట్‌ సమావేశంలో పీవీని కలిశానని... ఆయన్ను బాబ్రీ విషయంలో తిట్టేశానని ప్రణబ్ గుర్తు చేసుకున్నారు. అయితా ఆయన్ను అన్ని మాటలన్నా కూడా ఆయన 1993, జనవరి 17న కేబినెట్‌ లో చేరాలంటూ నన్ను ఆహ్వానించారు అని పీవీలోని మంచితనాన్ని ప్రణబ్ గుర్తు చేశారు.

అయితే.. ప్రణబ్ తాజా పుస్తకంలో బాబ్రీ మసీదు కూల్చివేత విషయంలో చేసిన వ్యాఖ్యలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే బీజేపీపై మతం ముద్ర తీవ్రంగా పడుతున్న సమయంలో ఏకంగా రాష్ట్రపతే ఇలాంటి సున్నిత విషయాలను తన పుస్తకంలోప్రస్తావించి వ్యాఖ్యలు చేయడంతో ఏం జరుగుతోందో చూడాలి. దీంతో ప్రణబ్ పుస్తకం మోడీ ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతుందని భావిస్తున్నారు.