Begin typing your search above and press return to search.

కేసీఆర్ పై 'సోషల్' వార్..కాంగ్రెస్ వీడియోలేనా.?

By:  Tupaki Desk   |   5 Nov 2018 4:42 AM GMT
కేసీఆర్ పై సోషల్ వార్..కాంగ్రెస్ వీడియోలేనా.?
X
కేసీఆర్ బండ బూతులు తిడతాడు.. ఆయన సభకు వచ్చే జనం ఈలలు - చప్పట్లతో ఫిదా అవుతారు. ముఖ్యమంత్రే తిడుతుంటే మేం ఏం తక్కువా అని కాంగ్రెసోళ్లు నోరుపారేసుకుంటున్నారు. కానీ కేసీఆర్ లా ప్రాస - యాస - భాష పఠిమ లేక వారివి పేలడం లేదు.. అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి బాగానే మాట్లాడుతున్నా.. కాంగ్రెస్ లో ఆయన ముందరకాళ్లకు బంధంతో బహిరంగంగా ధైర్యంగా ముందడువేయలేని పరిస్థితి కల్పిస్తోంది. ఇలా తెలంగాణ రాజకీయాల్లో తిట్ల పోటీ పెడితే ప్రస్తుతానికి కేసీఆరే నంబర్ 1..

కేసీఆర్ ను ముందుండి దెబ్బతీయడం కంటే సామాజిక మాధ్యమాల ద్వారా ఎండగట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అందుకే కొద్దిరోజులుగా కాంగ్రెస్ అనుబంధ గ్రూపులన్నీ చిత్రవిచిత్రమైన వీడియోలు - ఫొటోలు - ఆలోచించే కథనాలను తయారు చేసి సోషల్ మీడియాలో వదులుతున్నాయి. ఈ పోటీని గులాబీ పార్టీ అందుకోలేకపోతోంది. గులాబీ సోషల్ మీడియా క్యాంపెయినింగ్ చాలా వెనుకబడ్డట్టు అర్థమవుతోంది.

తాజాగా కేసీఆర్ ను వ్యక్తిగతంగా విమర్శించే స్థాయిలో వెబ్ వీడియోలు కలకలం రేపుతున్నాయి. గడిచిన రెండు వారాల నుంచి వస్తున్న ఈ వీడియోలు తెలంగాణ సమాజంలో కేసీఆర్ తీరును తీవ్రంగా ఆక్షేపించేలా ఉన్నాయి. కేసీఆర్ ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటాడు.. ఎలా వ్యవహరిస్తాడనేది కేసీఆర్ ను పోలిన మనిషిని పెట్టి తీస్తున్న వీడియోలు.. గులాబీ అధినేత పరువును తీస్తున్నాయి.

‘బాతాల పోశెట్టి’ పేరుతో యూట్యూబ్ లో పాపులర్ అవుతున్న ఈ వీడియోలను కాంగ్రెస్ ఎమ్మెల్సీగా పోటీచేసి ఓడిపోయిన ఓ జర్నలిస్ట్ తీస్తున్నాడు. ఆయన గతంలో ‘తీన్ మార్’ తో పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ఓ చానెల్ లో పనిచేస్తూ కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. ఆ చానెల్ ను గులాబీ దళం కొనేసి ఈ జర్నలిస్టును బయటకు సాగనంపింది. అప్పటినుంచి మరింత కసిని పెంచుకున్న సదురు జర్నలిస్టు ఇప్పుడు యూట్యూబ్ లో కేసీఆర్ వ్యక్తిగత వ్యవహారశైలిని తీవ్రంగా దునుమాడాలే దారుణమైన సెటైరికల్ వీడియోలు రూపొందించి విడుదల చేస్తున్నారు. వీటిని కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం జనసామాన్యంలో విస్తృతంగా ప్రచారంలోకి తెస్తోంది. కాంగ్రెసోళ్లే సదురు జర్నలిస్టుతో ఈ వీడియోలు తయారు చేయిస్తోందన్న విమర్శలు లేకపోలేదు.. తాజాగా కేసీఆర్ - కవితలను అవమానించేలా ‘బతుకవ్వ కేరాఫ్ బాతాల పోశెట్టి’ అంటూ ఓ వీడియో రూపొందించారు. ఇది దుమారం రేపుతోంది.

కేసీఆర్ ను అవమానించేలా ఉన్న ఈ వీడియోలు రూపొందించిన వారిపై చర్యలు తీసుకోవాలని టీఆర్ ఎస్ శ్రేణులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాయి. అయినా ఏమాత్రం బెదరకుండా కేసీఆరే టార్గెట్ గా ఆ వీడియోలు వస్తున్నాయి. మున్ముందు ఈ వీడియోలపై గులాబీ దళం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి..