Begin typing your search above and press return to search.

అస‌దుద్దీన్ vs అజ‌హ‌రుద్దీన్‌...కాంగ్రెస్ వ్యూహం!

By:  Tupaki Desk   |   20 Oct 2017 12:57 PM GMT
అస‌దుద్దీన్ vs అజ‌హ‌రుద్దీన్‌...కాంగ్రెస్ వ్యూహం!
X
రాష్ట్ర విభ‌జ‌నానంత‌రం కాంగ్రెస్ పార్టీ వైభ‌వం కోల్పోయింది. ఆ రెండు రాష్ట్రాల‌లో ఆ పార్టీని న‌డిపే ర‌థ‌సార‌ధి లేక నానా అవ‌స్థ‌లు ప‌డుతోంది. రాష్ట్ర విభ‌జ‌నానంత‌రం ఏపీలో ఆ పార్టీ ఉనికే ప్ర‌శ్నార్థ‌క‌మైంది. ఆంధ్ర ప్ర‌దేశ్ తో పోల్చుకుంటే తెలంగాణ‌లో కాంగ్రెస్ ప‌రిస్థితి కొంత మెరుగ్గానే ఉంది. తెలంగాణ‌లో పార్టీకి పున‌ర్ వైభ‌వం తెచ్చేందుకు కాంగ్రెస్ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. రాబోయే ఎన్నిక‌ల నేప‌థ్యంలో పార్టీకి కొత్త క‌ళ‌ను తెచ్చేందుకు పావులు క‌దుపుతున్నారు. కాంగ్రెస్ కు గ్లామ‌ర్ అద్దే ప్ర‌య‌త్నంలో భాగంగా మాజీ ఎంపీ అజారుద్దీన్ ను హైదరాబాద్ లోక్ సభ నుంచి పోటీ చేయించాలనే యోచనలో ఉంది. హైద‌రాబాద్ లో బ‌ల‌మైన ముస్లిం ఓటు బ్యాంకును కొల్ల‌గొట్టేందుకు కాంగ్రెస్ స‌న్నాహాలు చేస్తోంది.

రాబోయే ఎన్నిక‌ల్లో మజ్లిస్ పార్టీ అధినేత - ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై పోటీకి అజ‌హ‌ర్ ను దింపాల‌ని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. గురువారం హైదరాబాద్ లో అజహరుద్దీన్ కు రాజీవ్ స‌ద్భావన అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆ ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. అజహరుద్దీన్ హైదరాబాదీ కావడంతో ఇక్కడి సమస్యల పట్ల ఆయ‌న‌కు అవగాహన ఉందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి - సీఎల్పీ నాయకుడు జానారెడ్డి - ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ - మాజీ ఎంపీ వీహెచ్ అభిప్రాయపడ్డారు. దీంతో, వచ్చే ఎన్నికల్లో హైద‌రాబాద్ నుంచి పోటీ చేస్తే బాగుంటుందని అజ‌హ‌ర్ కు సూచించారు. వారి ప్ర‌తిపాద‌న ప‌ట్ల అజ‌హ‌ర్ కూడా సానుకూలంగా స్పందించిన‌ట్లు తెలుస్తోంది. మాజీ క్రికెట‌ర్ అజహరుద్దీన్ 2009 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డ ముస్లిం ఓట‌ర్లు అధికంగా ఉండ‌డంతో అజ‌హ‌ర్ గెలుపు న‌ల్లేరు మీద న‌డ‌కే అయింది. అదే త‌ర‌హాలో హైదరాబాద్ లో కూడా ముస్లిం ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకే అజ‌హ‌ర్ ముందుకు ఈ ప్ర‌తిపాద‌న వ‌చ్చింది.

అజ‌హ‌ర్ తో పాటు మాజీ ఐఏఎస్ గోపాలకృష్ణ కూడా రాజీవ్ సద్భావన అవార్డును పొందారు. అవార్డు ప్ర‌దానోత్స‌వ సంద‌ర్భంగా అజ‌హ‌ర్ మాట్లాడారు. రాజీవ్ సద్భావన అవార్డు త‌న‌కు రావ‌డం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ వయసులో కూడా గోపాలకృష్ణ గారు చాలా ఉత్సాహంగా ఉన్నార‌న్నారు. కాంగ్రెస్ పార్టీ‌లో కూడా ఇటువంటి ఉత్సాహ‌మే రావాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ లోక్ సభ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ నేతలు చేసిన సూచన పట్ల అజహరుద్దీన్ సానుకూలంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో అందరినీ క‌లుపుకొని పని చేస్తానన్నారు. పార్టీకి ఎల్ల‌వేళ‌లా సేవ‌లందిస్తాన‌ని అన్నారు. అంద‌రూ కలిసిక‌ట్టుగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఆ విధంగా చేస్తే రాబోయే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ప్ప‌క విజ‌యం సాధిస్తుంద‌న్నారు.