Begin typing your search above and press return to search.

అజహర్.. అర్షద్ వాగ్వాదం.. రసాభాసగా హెచ్ సీఏ ఏజీఎం

By:  Tupaki Desk   |   29 March 2021 7:30 AM GMT
అజహర్.. అర్షద్ వాగ్వాదం.. రసాభాసగా హెచ్ సీఏ ఏజీఎం
X
ఈ వార్త చదివే ముందు కొన్ని పదాలకు పూర్తి అర్థాలు తెలుసుకుంటే.. విషయం ఇట్టే అర్థమైపోతుంది. అందులో మొదటిది హెచ్ సీఏ (హైదరాబాద్ క్రికెట్ సంఘం).. ఏజీఎం (వార్షిక సర్వ సభ్య సమావేశం).. సీఏసీ (క్రికెట్ సలహా కమిటీ).. బీసీసీఐ (భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు). ఇక విషయంలోకి వెళదాం.

హైదరాబాద్ క్రికెట్ సంఘంలో రెండు బలమైన గ్రూపులు ఉన్నాయి. ఒకదానికి మాజీ క్రికెటర్ అజహర్ ప్రాతినిధ్యం వహిస్తుంటే.. మరో వర్గానికి మాజీ క్రికెటర్ అర్షద్ అయూబ్ నాయకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హెచ్ సీఏకు అధ్యక్షుడిగా అజహర్ వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం సంఘం వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. సంఘానికి సంబంధించిన అంశాలకు అంబుడ్స్ మెన్ గా ఎవరిని నియమించాలన్న అంశంపై మొదలైన గొడవ చిలికిచిలికి గాలివానలా మారింది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు.. ఆరోపణలు.. వ్యక్తిగత దూషణలకు దిగారు. దీంతో.. నువ్వు అలా అంటే నువ్వు ఇలా అంటూ చెలరేగిపోయారు.

అంబుడ్స్ మెన్ గా జస్టిస్ దీపక్ వర్మను నియమించాలని అజహర్ ప్రతిపాదించారు. అయితే.. అర్షద్ అయూబ్ మాత్రం జస్టిస్ నిసార్ అహ్మద్ కుక్రూను నియమించాలన్నారు. అర్షద్ ప్రతిపాదనకు శివలాల్ యాదవ్ మద్దతు తెలుపుతున్నట్లుగా హెచ్ సీఏ కార్యదర్శి విజయానంద్ వేదిక మీద నుంచి ప్రకటించారు. ఇందుకు అజహర్ అభ్యంతరం తెలిపారు. జస్టిస్ దీపక్ వర్మకే అందరి మద్దతు ఉందని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. మరోవైపు జస్టిస్ మీనాకుమారి పేరును తెర మీదకు తీసుకొచ్చారు. దీంతో.. సమావేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

ఇదే సమయంలో అజహర్.. అర్షద్ అయూబ్ లు ఒకరిపై ఒకరు దూషణలకు దిగారు. కాసేపటికే అవి వ్యక్తిగత విమర్శల స్థాయిని దాటేశాయి. నువ్వు మ్యాచ్ ఫిక్సర్.. దేశాన్ని అమ్మేశావు అంటూ అజ్జూను అర్షద్ ఘాటుగా విమర్శించగా.. నువ్వు హెచ్ సీఏను దోచుకున్నావ్.. నువ్వో దొంగ.. నీ మోసాలన్నీ నాకు తెలుసు.. ఏసీబీ కేసులుకూడా ఉన్నాయంటూ అర్షద్ అయూబ్ ను ఉద్దేశించి అజహర్ వ్యాఖ్యానించారు.

బీసీసీఐలో హెచ్ సీఏ తరఫున తానే ప్రాతినిధ్యం వహిస్తానని గుర్తు చేసిన అజ్జూ.. ఏజీఎంలో మీ ప్రవర్తనపై బీసీసీఐ.. హైకోర్టుకు కంప్లైూంట్ చేస్తానని అజహర్ ప్రకటించటంతో వేడి కాస్త తగ్గింది. అందరూ వెనక్కి తగ్గారు. దీంతో.. రాజీ ఫార్ములా చేపట్టాలని నిర్ణయించారు. అంబుడ్స్ మెన్.. ఎథిక్స్ అధికారి పదవులను ఎవరిని నియమించాలన్న విషయంపై చివరకు ఏకాభిప్రాయం కుదరకపోవటంతో ఏప్రిల్ 11న రహస్య ఓటింగ్ నిర్వహించేందుకు వీలుగా నిర్ణయాన్ని తీసుకొని సమావేశాన్ని ముగించారు. అయితే.. జరగాల్సిన డ్యామేజీ భారగానే పెరిగిపోయింది. హైదరాబాద్ క్రికెట్ సంఘంలో నెలకొన్న వర్గ పోరు ఎప్పటి నుంచో ఉన్నా.. తాజా సమావేశంలో మాత్రం అది పీక్స్ కు చేరుకుందని చెప్పక తప్పదు.