Begin typing your search above and press return to search.

రచ్చకెక్కిన హెచ్ సీఏ రాజకీయాలు.. అజర్ పై వేటుకు పావులు

By:  Tupaki Desk   |   8 Sep 2020 7:30 AM GMT
రచ్చకెక్కిన హెచ్ సీఏ రాజకీయాలు.. అజర్ పై వేటుకు పావులు
X
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో మరో సారి వివాదాలు బయట పడ్డాయి. ఈ సారి పంచాయితీ పోలీస్ స్టేషన్ దాకా చేరింది. హెచ్ సీఏ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్, అసోసియేషన్ మెంబర్ సయ్యద్ మొయిజుద్దీన్ లు ఎంపైర్ యూసుఫ్ తో పాటు తననూ దూషించడం తోపాటు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా క్లబ్ కార్యదర్శులు అజర్ పై వేటుకు పావులు కదుపుతున్నారు.

హెచ్ సీఏ అంబుడ్స్ మెన్, ఎథిక్ అధికారిని నియమించాలంటే నిబంధనల ప్రకారం తొలుత అపెక్స్ కౌన్సిల్ లో చర్చించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏజీఎం లో ప్రతిపాదించాలి. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఏజీఎంను సమావేశపరచడం అంత సులభం కాదని, ముందుగా అంబుడ్స్ మెన్ ను నియమించి.. ఆ తర్వాత ఏజీఎం మద్దతు తీసుకుందామని అజారుద్దీన్ ప్రతిపాదించాడు. ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో ఏజీఎంలోనే నిర్ణయం తీసుకోవాలని క్లబ్ కార్యవర్గ సభ్యులు తీర్మానించారు. ఈ పరిస్థితులు ఇలా ఉండగా అజారుద్దీన్ ఉన్నట్టుండి సుప్రీం కోర్టు మాజీ జడ్జి దీపక్ వర్మను అంబుడ్స్ మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నెలకు రూ.2 లక్షలు వేతనంగా ఖరారు చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్ సహా మిగిలిన సభ్యులంతా దీపక్ వర్మకు లేఖ రాశారు. దీంతో అజారుద్దీన్ దీపక్ వర్మ అంబుడ్స్ మెన్ గా బాధ్యతలు తీసుకునేలా చూడాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జైషాకు లేఖ రాశారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈనెల 15న అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరుగనుంది. అజారుద్దీన్ కి వ్యతిరేకంగా విజయానంద్ నేతృత్వంలో పలువురు హెచ్ సీఏ క్లబ్ కార్యదర్శులు ఒకచోట సమావేశమై చర్చలు జరిపారు. వారంతా మహ్మద్ అజారుద్దీన్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అజర్ పై సస్పెన్షన్ వేటు వేసి ఎలాగైనా క్రికెట్ అసోసియేషన్ కు దూరం చేయాలని వ్యూహాలు పన్నుతున్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.