Begin typing your search above and press return to search.

ఈ దెబ్బతో ఆజంఖాన్ నోటికి ఫెవికాలే..

By:  Tupaki Desk   |   31 July 2019 11:41 AM GMT
ఈ దెబ్బతో ఆజంఖాన్ నోటికి ఫెవికాలే..
X
మొనగాళ్లు లాంటోళ్లు సైతం అన్ని మూసుకుంటూ ఆచితూచి అన్నట్లు వ్యవహరిస్తున్న వేళ.. కొందరు నేతలు మాత్రం తమ తీరును మార్చుకోకపోవటం కనిపిస్తుంది. మోడీ బలం అంతకంతకూ పెరిగిపోవటంతో పాటు.. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆయన ఇమేజ్ భారీగా పెరిగిపోవటం తెలిసిందే. ఈ దెబ్బతో విపక్ష నేతలు మొదలు.. ఆయన్ను టార్గెట్ చేసిన నేతలంతా సైలెంట్ అయిపోయి.. తమ పనేదో తాము చూసుకుంటున్న పరిస్థితి. ఈ క్రమాన్ని గుర్తించటంలో వివాదాస్పద సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్ కాస్తంత నిర్లక్ష్యంతో ఉన్నట్లుగా కనిపిస్తుంది.

తనలాంటోడ్ని మోడీ ఏంటి? ఎవరైనా ఏమీ చేయలేరన్నట్లుగా ఉన్న ఆయన కాన్ఫిడెన్స్ మీద గడిచిన రెండు.. మూడు రోజులుగా తగులుతున్న ఎదురుదెబ్బలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆయన నోరు ఎంత గలీజ్ అంటే.. ఆయన పెట్టుకోవటానికి భయపడిపోయే పరిస్థితి. ఇలాంటివారిని ఎలా కంట్రోల్ చేయాలో మోడీ మాష్టారికి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదు. అయితే.. ఈ పాయింట్ ను ఆజంఖాన్ మిస్ అయినట్లున్నారు. తన ఓవర్ కాన్ఫిడెన్స్ కు ఇప్పుడు ఆయన విపరీతంగా వేదన చెందటం ఖాయం.

మొన్నటికి మొన్న లోక్ సభలో డిఫ్యూటీ స్పీకర్ లాంటి గౌరవనీయస్థానంలో ఉన్న మహిళను ఉద్దేశించి ఆయన చేసిన చౌకబారు వ్యాఖ్యలకు పార్టీలకు అతీతంగా ఆగ్రహం చేసిన పరిస్థితి. సభానాయకుడిగా ఉన్న మోడీకి ఇలాంటి విషయాల్లో చాలా సీరియస్ గా ఉంటారన్న విషయాన్ని మర్చిపోయిన ఆజంఖాన్ భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నట్లుగా చెప్పక తప్పదు. సారీ చెప్పాలని కోరితే.. పొగరుగా తల ఎగరేసి సభ నుంచి వెళ్లిపోయిన ఆయనకు తర్వాత కాస్త తెలివి వచ్చినట్లుంది కాస్త వెనక్కి తగ్గారు.

అయితే.. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. సభలో ఆయన వ్యవహరించిన తీరుపై కానీ.. గతంలో ఆయన ఇష్టారాజ్యంగా అన్న వ్యాఖ్యలకు కానీ ఏకంగా 13 కేసులు బుక్ అయ్యాయి. ఈ కేసులకు సంబంధించి అజాంఖాన్ పై చార్జిషీట్ దాఖలు చేస్తున్న సమయంలోనే.. ఊహించని పరిణామం మరొకటి చోటు చేసుకుంది.

ఈ రోజు ఆజంఖాన్ కుమారుడు అబ్దుల్లా అజాంఖాన్ ను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకనుకుంటున్నారు.. ఆయన పాస్ పోర్ట్ పత్రాల్లో పుట్టిన రోజు తప్పుగా పేర్కొన్నందుకు ఆయన్ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఎంపీ ఆజం ఖాన్ కొడుకేమీ తక్కువేమీ కాదు.. ఆయన సువార్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు.

అయితే.. మాత్రం చట్టానికి భిన్నంగా తప్పులు చేస్తే శిక్షలు తప్పవు కదా? ఆయన చదువుకున్న రోజుల్లో జారీ చేసిన సర్టిఫికేట్లకు.. పాస్ పోర్ట్ డాక్యుమెంట్లలో ఆయన పుట్టినరోజును తేడాగా వివరాలు ఇవ్వటంపై అరెస్ట్ చేశారు. జరగాల్సిన పరిణామాలన్ని ఒక్కొక్కటిగా జరుగుతున్న వేళలో ఆజంఖాన్ కు తత్త్వం బోధ పడటమే కాదు.. నమో సాఫ్ట్ వేర్ ఎంత ఫవర్ ఫుల్ అన్న విషయం అర్థం కాక మానదు. చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఆజంఖాన్ నోటికి ఫెవికాల్ రాసేసుకున్నట్లుగా ఉండటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరి.. అందుకు భిన్నంగా ఆయన వ్యవహరించే సాహసం చేస్తారేమో చూడాలి.