Begin typing your search above and press return to search.

సిట్ ఎదుట హాజ‌రైన అయ్య‌న్నపాత్రుడు!

By:  Tupaki Desk   |   14 July 2017 11:22 AM GMT
సిట్ ఎదుట హాజ‌రైన అయ్య‌న్నపాత్రుడు!
X
విశాఖ‌ భూకుంభ‌కోణంపై మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ కుంభ‌కోణం గురించి 2015లోనే క‌లెక్ట‌ర్ కు ఫిర్యాదు చేసినా స్పందించలేద‌న్నారు. ప్ర‌భుత్వ భూముల‌తో పాటు, ప్ర‌భుత్వ ర‌హ‌దారుల‌పై కూడా కొంద‌రు రుణాలు పొందార‌ని విస్తుపోయే నిజాల‌ను వెల్ల‌డించారు. విశాఖలో భూ రికార్డుల తారుమారు వ్యవహరంపై ఏర్పాటుచేసిన సిట్ అధికారుల కమిటీని ఆయ‌న శుక్రవారం కలిశారు.

అయ్య‌న్నపాత్రుడు... భూ కుంభకోణాలపై ఫిర్యాదులను సిట్ అధికారులకు అంద‌జేశారు. కొంద‌రు వ్య‌క్తులు ప్రభుత్వ భూములను తాకట్టుపెట్టి రూ.190కోట్లు రుణాలను పొందిన విషయాన్ని ఆయన సిట్‌కు వివరించారు. ఆఖ‌రికి ప్ర‌భుత్వ ర‌హ‌దారుల‌ను కూడా తాక‌ట్టు పెట్ట‌డంపై మంత్రి విస్మ‌యం వ్య‌క్తం చేశారు. కొంద‌రు బ‌డాబాబులు పెదగంట్యాడ మట్టెక్ పార్క్ కోసం ప్రభుత్వం స్థలాన్నే కబ్జాచేసి స్వంత భూమి అని నమ్మించి కోట్లాది రూపాయల పరిహరం పొందార‌ని వెల్ల‌డించారు.

ఈ కుంభకోణాన్ని 2015లోనే గుర్తించి మంత్రి హోదాలో తాను క‌లెక్ట‌ర్ కు లేఖ రాశాన‌ని అయ్య‌న్నపాత్రుడు తెలిపారు. కానీ, క‌లెక్ట‌ర్ నుంచి త‌న‌కు కనీస స్పంద‌న రాలేద‌ని చెప్పారు. చెల్లింపులు ఆపాలని క‌లెక్ట‌ర్ కు లేఖ రాసినా ఫ‌లితం లేకుండా పోయింద‌న్నారు. భూకుంభ‌కోణానికి సంబంధించి త‌న వ‌ద్ద ఉన్న ఆధారాల‌ను సిట్ అధికారుల‌కు స‌మ‌ర్పించాన‌ని తెలిపారు.

ఈ నెల 19న సిట్ అధికారులను మ‌రోసారి కలిసి మరిన్ని ఆధారాలను సమర్పించనున్నట్టు ఆయన చెప్పారు. విశాఖ భూకుంభకోణానికి సంబంధించి స్వప‌క్షంలోని నేత‌ల‌పై అయ్యన్నపాత్రుడు గతంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనాన్ని సృష్టించాయి. ఈ విషయమై ఇదే జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావుపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే.