Begin typing your search above and press return to search.

మా ప్ర‌భుత్వం..మా ఇష్టం అంటున్న మంత్రి

By:  Tupaki Desk   |   5 Feb 2017 7:25 AM GMT
మా ప్ర‌భుత్వం..మా ఇష్టం అంటున్న మంత్రి
X
"కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ కమిటీలు వేసి ఆ పార్టీ వాళ్లకు పథకాలు మంజూరు చేసి ఇష్టా రాజ్యంగా వ్యవహరించలేదా? మా ప్రభుత్వం - మా ఇష్టం. మాకు ఇష్టమొచ్చిన వారికి పథకలు వర్తింపజేస్తాం. పదేళ్లలో కాంగ్రెస్‌ వాళ్లు ఇళ్లు - రుణాలు - పింఛన్లు అందరికీ ఇచ్చారా? కాబట్టి అలా మాట్లాడే వారెవరైనా నోరు మూసుకొని ఉండాలి" ఇది ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట. నర్సీపట్నం - చోడవరం - పాయకరావుపేట నియోజకవర్గాల టీడీపీ ఎన్నికల ప్రతినిధుల శిక్షణా కార్యక్రమంలో అయ్యన్న మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ఏ విధంగా వ్య‌వ‌హ‌రించాలో హిత‌బోధ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులే స్వయంగా ఇతర పార్టీల వారిని పథకాలకు ఎంపిక చేస్తే ఎలా? ఇలాంటి తప్పులు చేస్తే ఎంతటి నాయకులనైనా క్షమించేదిలేదు' అంటూ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షాత్తు మంత్రి స్థాయిలో ఉన్న వ్య‌క్తి బ‌హిరంగంగా 'మా ప్రభుత్వం మా మా ఇష్టం' అంటూ ఆయన మాట్లాడిన తీరు - టీడీపీ కార్యకర్తలకు ఇచ్చిన ఆదేశాలు ఇటు పాత్రికేయులను - అటు ఆ పార్టీ కార్యకర్తలను సైతం విస్మయానికి గురి చేశాయి.

ఈ సంద‌ర్భంగా త‌న‌లాగా వ్య‌వ‌హ‌రించాల‌ని సైతం అయ్య‌న్న‌పాత్రుడు పార్టీ నేత‌ల‌కు సూచించారు. నాకూ వైసీపీ - కాంగ్రెస్‌ లకు చెందిన చాలా మంది ప్రజలు తెలుసు. అలాగని నేను వాళ్లందర్నీ ప్రభుత్వ పథకాలకు ఎంపిక చేయడం లేదుకదా. మన పార్టీలోనే కొందరు ఇతర పార్టీలకు చెందిన వారిని పథకాలకు ఎంపిక చేయాలంటూ తీసుకొస్తున్నారు. ఇది సరైంది కాదు. గాడిద పని గాడిద చేయాలి - కుక్క పని కుక్క చేయాలి. పార్టీకి బాధ్యత వహించే వారే తప్పు చేస్తే నాకు వారి మీద ఎలా నమ్మకం ఉంటుంది. పింఛన్ల మంజూరులో ఎందుకు పొరపాట్లు (ఇతర పార్టీల వారికి మంజూరు కావడం) జరుగుతున్నాయి? నేనేదో సరదాగా మాట్ల్లాడటం లేదు అని అన్నారు. గ్రామస్థాయిలో పార్టీ కోసం నిబద్ధతగా పినిచేసే వారితో పటిష్టమైన గ్రామ కమిటీలను త్వరలో ఏర్పాటు చేయాలని అని అయ్య‌న్న‌పాత్రుడు సూచించారు. "వచ్చే పంచాయతీ ఎన్నికల్లో వాటి ద్వారానే గెలవాలి. ప్రస్తుత జన్మభూమి కమిటీల స్థానే వేయబోయే గ్రామ కమిటీల ఏర్పాటు విషయంలో రాజీ పడవద్దు. నా గురించి పత్రికల వారు ఏం రాసినా వాటిని నేను పట్టించుకోను. రాబోయే తరానికి పార్టీ కావాలి. కాకపోతే కొన్ని రాత్రి రికమండేషన్లు ఎలానూ ఉంటాయి" అంటూ మంత్రి అయ్యన్న కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పారు. కాగా..పాలన రెండున్నరేళ్లు పూర్తవుతున్నందున ప్రస్తుతం ఉన్న జన్మభూమి కమిటీలను రద్దు చేశామ‌ని తెలిపారు. మళ్లీ "కొత్తగా గ్రామాల్లో జన్మభూమి కమిటీలు వేసి కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సి ఉంది. జన్మభూమి కమిటీ మీద అవగాహన లేక పత్రికలు చాలా రాతలు రాస్తున్నాయి. కాని మేము చట్ట ప్రకారం ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి మాత్రమే వర్తింపజేస్తున్నాం " అని మంత్రి చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/